ఎంత కష్టం.. ఎంత నష్టం

ABN , First Publish Date - 2020-11-29T04:15:43+05:30 IST

నివర్‌ కోలుకోలేని దెబ్బ తీసింది. జాతీయ రహదారి మొదలుకుని గ్రామీణ రోడ్ల వరకు అన్నీ ధ్వంసం అయ్యాయి.

ఎంత కష్టం.. ఎంత నష్టం
నెల్లూరులోని పరమేశ్వరినగర్‌లోకి చొచ్చుకొచ్చిన వరద నీరు

‘నివర్‌’ అంచనా నష్టం రూ.220 కోట్లు

ఫరహదారులకే రూ.192 కోట్లు

నేతన్నకే రూ.18.4 కోట్లు

అన్నదాత కోల్పోయింది రూ.7.8 కోట్లు

ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసిన అధికారులు

నెల్లూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):నివర్‌ కోలుకోలేని దెబ్బ తీసింది. జాతీయ రహదారి మొదలుకుని గ్రామీణ రోడ్ల వరకు అన్నీ ధ్వంసం అయ్యాయి. పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖకే రూ.192 కోట్ల నష్టం వాటిల్లింది. రబీ సీజనులో ఎన్నో ఆశలతో పంటలు సాగు చేసిన రైతులను ఆదిలోనే తుఫాన్‌ ముంచేసింది.  7.80 కోట్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వాస్తవానికి ఈ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని రైతు వర్గాలు అంటున్నాయి. 


వ్యవసాయానికి ఆదిలోనే..

తుఫాను కారణంగా 17,648 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ పంట రూపంలో  రైతులకు 4.12 కోట్ల నష్టం జరిగింది. 13,393 హెక్టార్లలో మినుము, 1,216 హెక్టార్లలో పెసర, 2,500 ఎకరాల్లో అరటి, 500 హెక్టార్లలో కూరగాయలు దెబ్బతిన్నాయి. మొత్తంపై రూ.7.80 కోట్ల నష్టం జరిగింది.


పంచాయతీరాజ్‌కు భారీగానే..

భారీ వర్షాల కారణంగా గ్రామీణ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అధికారుల అంచనా ప్రకారం 815 కిలోమీటర్ల పంచాయతీరాజ్‌ రోడ్లు పాడయ్యాయి. దీనివల్ల 192.86 కోట్ల నష్టం వాటిల్లింది. ఇరిగేషన్‌ శాఖ పరిధిలో 94 చెరువులు దెబ్బతినగా, రూ. 11.75 కోట్ల నష్టం వాటిల్లింది. 290 కిలోమీటర్ల పొడవున ఆర్‌అండ్‌బీ రోడ్లు, రెండు వంతెనలు, 18 కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. ఈ శాఖకు సుమూరు 6.40 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. మున్సిపల్‌ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు దెబ్బతినడం ద్వారా 4.23 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 130 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినడం ద్వారా రూ.30 లక్షలు, చేనేత మగ్గాలు తడిసిపోవడం వల్ల రూ.18.4 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 



విద్యుత్‌ శాఖకు రూ.3.2 కోట్ల నష్టం

నెల్లూరు(జడ్పీ) : జిల్లాలో నివర్‌ తుఫాన్‌ బీభత్సంతో విద్యుత్‌శాఖ భారీగా నష్టపోయింది. తీర ప్రాంతాలే కాకుండా  అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినింది. దీంతో రూ.3.2కోట్ల మేర నష్టం సంభవించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలు, గాలులతో 33కేవీ ఫీడర్లు 87 దెబ్బతినగా, శనివారం నాటికి 83 ఫీడర్లకు మరమ్మతులు చేశారు. మరో నాలుగు ఫీడర్లు ఇంకా పునరుద్ధరణ కాలేదు.  అలాగే 33కేవీ స్తంభాలు 338 దెబ్బతినగా, వాటిలో 182 ఏర్పాటు చేశారు. మరో 156 ఏర్పాటు చేయాల్సి ఉంది. 33కేవీ లైన్లు 36కి.మీ మేర దెబ్బతినగా 15కి.మీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. మరో 21 కి.మీ మరమ్మతులు చేయాల్సి ఉంది. 11కే.వీకి సంబంధించి 321 ఫీడర్లు దెబ్బతినగా 302ను మరమ్మతులు చేశారు.  మరో 19 లైన్లు చేయాల్సి ఉంది. 1384 స్తంభాలు దెబ్బతినగా 620 స్తంభాలు ఏర్పాటు  చేశారు. మరో 764 ఏర్పాటు చేయాల్సిఉంది. 86.83 కి.మీ మేర లైను దెబ్బతినగా 45కి.మీను మరమ్మతులు చేయగా, మరో 41.83 కి.మీ పనులు చేయాల్సి ఉంది. అలాగే ఎల్‌టీ లైను 120.63కి.మీ దెబ్బతినగా 22.75కి.మీ పనులు చేశారు. మరో 97.8కి.మీ చేయాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించి స్తంభాలు 1625 దెబ్బతినగా 364 ఏర్పాటు చేశారు. మరో 1261 ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లు 420 దెబ్బతినగా 380 ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 180 గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినగా 168 గ్రామాలకు పునరుద్ధరించారు. 


అంధకారంలో 12 గ్రామాలు

వరద ఉధృతితో ఇంకా 12 గ్రామాలు అంధకారంలో ఉంటున్నాయి. కావలి డివిజన్‌లో 9, ఆత్మకూరు డివిజన్‌లో 3 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది. విడవలూరు మండలం ఊటుకూరు, ముదివర్తి, అలాగానిపాడు, వీరారెడ్డిపాళెం, జలదంకి మండలం చామాదల, ఆదిరెడ్డిపాళెం, గురువారెడ్డిపాళెం, అనంతసాగరం మండలం కేడీపల్లి,  వెంగమనాయుడుపల్లి, ఆత్మకూరు రూరల్‌ మండలంలోని వీరగుడిపల్లిపాడులకు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద ఉదృతి తగ్గగానే ఆ గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. 













Updated Date - 2020-11-29T04:15:43+05:30 IST