నైరుతి ప్రవేశం

ABN , First Publish Date - 2022-06-01T14:01:33+05:30 IST

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అవి ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని, ఈ కారణం గా కొన్ని చోట్ల వర్షాలు కురవచ్చని చెన్నై

నైరుతి ప్రవేశం

- పలు చోట్ల మూడు రోజులపాటు వర్షం

- వెల్లడించిన చెన్నై వాతావరణ కేంద్రం


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అవి ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని, ఈ కారణం గా కొన్ని చోట్ల వర్షాలు కురవచ్చని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణంగా ఈ నైరుతి రుతుపవనాలు జూన్‌ నుంచి ప్రారంభమవుతాయి. కానీ, ఈ యేడాది మూడురోజులు ముందుగా అంటే మే 29 తేదీనే ప్రవేశించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ, ఉత్తర తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో వర్షాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, ఈ యేడాది నైరుతి రుతుపవనాలు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల్లో 15 రోజులకు ముందుగానే ప్రవేశించిన విషయం తెలిసిందే.


మూడో తేదీ వరకు వర్షాలు ..

 రుతుపవనాల ప్రభావంతో బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, రెండో తేదీ గురువారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో ఒకటి రెండు చోట్ల పిడుగులు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని, 3వ తేదీ శుక్రవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల పిడుగులు, ఉరుములతో వర్షం కురుస్తుందని తెలిపింది. అదేవిధంగా రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షపు జల్లులు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం

మంగళవారం వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో పందలూరు తాలూకాలో 10 సెంటీమీటర్లు, దేవాలాలో 8, పుల్లంపాడిలో 6, ధర్మపురిలో, కీళ్‌కరై, నందియార్‌, నావలూరు, కోట్టపాడు, సిరగమణి 4, మరికొన్ని ప్రాంతాల్లో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే, పైన పేర్కొన్న రోజుల్లో సముద్రపు గాలుల వేగం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

Updated Date - 2022-06-01T14:01:33+05:30 IST