వానపోయి.. వరదొచ్చె!

ABN , First Publish Date - 2022-10-08T03:45:55+05:30 IST

ముసురుపట్టి కురిసిన వాన తెరిపిచ్చినా దాని ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. రెండురోజుల వ్యవధిలో భారీవర్షం కురవగా తొలుత ఖరీఫ్‌ పంటలకు మేలని భావించిన రైతులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వానపోయి.. వరదొచ్చె!
బొడిచెర్ల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ

తెరిపిచ్చినా తీరని ఇక్కట్లు 

పెరుగుతున్న పంట నష్టాలు

తాజాగా 4వేల ఎకరాలుగా అంచనా

అంతకు నాలుగు రెట్లు దెబ్బతినే అవకాశం

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు

ఉధృతంగానే ముసి, ఇతర వాగులు

పలుచోట్ల రవాణాకు ఆటంకం

గుండ్లకమ్మకు కొనసాగుతున్న వరద

రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఛిద్రమైన రోడ్లు, అధ్వానంగా పారిశుధ్యం

అవస్థలు పడుతున్న జనం

ముసురుపట్టి కురిసిన వాన తెరిపిచ్చినా దాని ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. రెండురోజుల వ్యవధిలో భారీవర్షం కురవగా తొలుత ఖరీఫ్‌ పంటలకు మేలని భావించిన రైతులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల పైర్లు నీటిలో కనిపిస్తున్నాయి.  క్రమంగా దెబ్బతిన్న విస్తీర్ణం పెరుగుతోంది. మరోవైపు పైనుంచి వస్తున్న వరదతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుచోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అలాగే రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. పలు లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీల్లో నీరు తీయకపోవడంతో పేదలు అల్లాడుతున్నారు. మొత్తంగా ముంచెత్తిన వానతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం ఇంకా కుదుటపడలేదు.

ఒంగోలు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వర్షం కాస్తంత తెరిపి ఇచ్చినా జనానికి మాత్రం ఇక్కట్లు  తప్పడం లేదు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర  అంతరాయం ఏర్పడింది. పైర్లకు నష్టం పెరుగుతోంది. ఒకవైపు వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారులు పరిశీ లిస్తుండగా, మరోవైపు పొలాల్లోని నీటిని బయటకు పంపడంతోపా టు వీలైనంత మేర నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో రైతు లు ఉన్నారు. రెండు రోజులు గడి చినా పలు ప్రాంతాల్లోని జనావా సాల్లో చేరిన నీరు బయటకుపోక కాలనీవాసులు ఇబ్బందిపడుతు న్నారు. వ్యాపారాలకు పరిస్థితి అనుకూలించక వీధివ్యాపారులు, చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.


20మండలాల్లో  భారీ వర్షం

జిల్లాలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈనెల ఆరంభంలో విస్తారంగా వర్షాలు కురవగా వ్యవసాయానికి ఇతర అవసరాలకు ఉపకరించాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో అంతకు మించి వర్షం కురిసింది. చాలా మండలాల్లో భారీవర్షం కురవగా అక్కడక్కడా కుంభవృష్టి పడింది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు ప్రారంభమై శుక్రవారం ఉదయం వరకు కురిశాయి. ఈ వ్యవధిలో జిల్లాలో సగటున 67.60 మి.మీ వర్షపాతం నమోదైంది. దాదాపు 20 మండలాల్లో భారీవర్షమే కురిసింది. దాదాపు రెండురోజుల వ్యవధిలోనే ఇలా భారీవర్షాలు కురవడంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పైర్లకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల సజ్జ, ఇతర పంటలు కోతలు జరిగాయి. వర్షంతో కంకులు తడిశాయి. ఒంగోలు, దర్శి, సంతనూతలపాడు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో వేలాది ఎకరాల్లో పైర్లు నీటమునిగాయి. 


పెరుగుతున్న పంట నష్టం

ప్రాథమికంగా తొలుత 1,951 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేయగా ప్రస్తుతం అది పెరిగింది. తాజాగా 3,938 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. జిల్లాలో ఆరు మండలాల్లోని 27 గ్రామాల్లో 2,250 ఎకరాల్లో అలసంద, 655 ఎకరాల్లో వరి, 635 ఎకరాల్లో మినుము, 378 ఎకరాల్లో సజ్జ, మరో 20 ఎకరాల్లో మొక్కజొన్న, పెసర దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే వాస్తవానికి 15 మండలాల్లో సుమారు 50వేల ఎకరాల్లో ఇంకా మిర్చి, పత్తి, మినుము ఇతరత్రా పైర్లు నీటిలో ఉన్నట్లు ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం తర్లుపాడుతోపాటు పశ్చిమ ప్రాంతంలోని మరికొన్ని చోట్ల వర్షం పడటంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


కొనసాగుతున్న ప్రవాహాలు

వర్షం తెరపి ఇచ్చినప్పటికి రెండు రోజుల భారీవర్షాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు, నదులలో నీటి ప్రవాహం అధికంగానే ఉంది, గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వర్షపు నీరు వస్తుండటంతో రెండు గేట్లు ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ముసి, పాలేరు నదులతోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న వాగులు, వంకలలో నీటి ప్రవాహంతో రవాణాకు ఆటంకంగానే ఉంది. మరోవైపు పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షంతో వివిధ పట్టణాల్లో జలమయమైన కాలనీల్లో నీరు పూర్తిస్థాయిలో తీయకపోగా బురదమయంతో జనం అవస్థలు పడుతున్నారు. 




Updated Date - 2022-10-08T03:45:55+05:30 IST