England vs India: దయలేని వరుణుడు.. ఆటకు మళ్లీ అడ్డంకి

ABN , First Publish Date - 2022-07-03T02:22:29+05:30 IST

భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టుపై వరుణుడు పగబట్టినట్టుగా ఉంది. శుక్రవారం తొలి రోజు భారత

England vs India: దయలేని వరుణుడు.. ఆటకు మళ్లీ అడ్డంకి

బర్మింగ్‌హామ్: భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టుపై వరుణుడు పగబట్టినట్టుగా ఉంది. శుక్రవారం తొలి రోజు భారత జట్టు ఇన్నింగ్స్‌ను కాసేపు అడ్డుకున్న వరుణుడు.. రెండో రోజైన నేడు (శనివారం) పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించాడు. 416 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ (England) 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన అలెక్స్ లీస్‌ (Alex Lees)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఒల్లీ పోప్ (Ollie Pope) క్రీజులోకి వచ్చాడు. అయితే, అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో లంచ్ బ్రేక్ (Lunch Break) ప్రకటించారు. 


లంచ్ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ తిరిగి కొనసాగింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లిష్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ జాక్ క్రాలీ (9)ని కూడా బుమ్రా (Jasprit Bumrah) పెవిలియన్ పంపాడు. దీంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభమయ్యాక మూడు ఓవర్లు కూడా పూర్తి కాకముందే అంటే 6.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం (Rain) ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.  


ఈసారి చాలా ఎక్కువసేపే ఆటను అడ్డుకుంది. ఏకంగా 26 ఓవర్లను తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత నెమ్మదించడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. తొలి రెండు వికెట్లను పడగొట్టిన బుమ్రా అదే ఊపుతో మరో వికెట్‌ను  నేలకూల్చాడు. ఒల్లీ పోప్‌ (10)ని వెనక్కి పంపి మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెయిర్‌స్టోతో కలిసి రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. సరిగ్గా 15.1 ఓవర్ల వద్ద వర్షం మరోమారు ప్రారంభం కావడంతో ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి భారత్ కంటే 356 పరుగుల వెనక ఉంది. రూట్ (19) బెయిర్‌స్టో (6) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-07-03T02:22:29+05:30 IST