వర్షార్పణం!

ABN , First Publish Date - 2022-05-17T05:26:34+05:30 IST

అకాల వర్షాలు అన్నదాతలను కోలుకులేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో మెదక్‌ జిల్లాలో మూడుసార్లు అకాల వర్షాలు కురిశాయి. ధాన్యం నీటిపాలైంది.

వర్షార్పణం!
హవేళిఘనపూర్‌లో నీటమునిగిన వడ్లను తీసి ఆరబెడుతున్న రైతులు

మెదక్‌ జిల్లాలో 20 రోజుల్లో మూడోసారి అకాల వర్షం  

భారీ వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యం  

అన్నదాతలకు దెబ్బ మీద దెబ్బ  

కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో తడుస్తున్న ధాన్యం 

అత్యధికంగా చిన్నశంకరంపేటలో 82.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు


 ఆంధ్రజ్యోతిప్రతినిధి,మెదక్‌/తూప్రాన్‌/చిల్‌పచెడ్‌/పాపన్నపేట/హవేళిఘనపూర్‌/పెద్దశంకరంపేట/కొల్చారం, మే16: అకాల వర్షాలు అన్నదాతలను కోలుకులేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో మెదక్‌ జిల్లాలో మూడుసార్లు అకాల వర్షాలు కురిశాయి. ధాన్యం నీటిపాలైంది. కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లల వేగం పెంచకపోవడంతో రైతాంగానికి శాపంగా మారింది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం తెల్లవారుజామునుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రైతులు తేరుకుని పంటను కాపాడుకునే ప్రయత్నం చేసే లోపే ధాన్యం నీటిపాలైంది. చేసిన కష్టం కళ్లముందే వర్షం పాలు కావడాన్ని రైతాంగం జీర్ణించుకోలేకపోయింది. 

 మెదక్‌ జిల్లాలో అకాల వర్షం దాటికి చిన్నశంకరంపేట మండల రైతాంగం అతలాకుతలమైంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా మండలంలో భారీ వర్షం కురిసింది.  అనేకసార్లు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లాలోనే అత్యధికంగా చిన్నశంకరంపేట మండలంలో 82.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు నీటిలో కొట్టుకుపోయాయి. రహదారుల వెంట, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ఫలితం లేకుండా పోయింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చిన్నశంకరంపేట మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అరగంట పాటు రాస్తారోకో చేశారు. చివరకు తహసీల్దార్‌ మహేందర్‌గౌడ్‌ వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హవేళీఘనపూర్‌, కొల్చారం, అల్లాదుర్గం మండలాల్లో భారీ వర్షం కురిసి తీరని నష్టం వాటిల్లింది. తూప్రాన్‌, రామాయంపేట, చేగుంట, మెదక్‌, మనోహరాబాద్‌, రేగోడ్‌లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. చిల్‌పచెడ్‌ మండలాల్లోని గ్రామాల్లో కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిశాయి. పాపన్నపేట మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురిసిన గాలివాన బీభత్సనికి చెట్లు విరిగిపడి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం కరెంటు తీగలపై చెట్లను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. పాపన్నపేట మండలం కొత్తపల్లి-యుసు్‌ఫపేట గ్రామాల మధ్య బొడ్మట్‌పల్లి-మెదక్‌ రహదారిపై నిర్మించిన వంతెన కుంగిపోవడం, ఆ పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నవర్షానికే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.


మెదక్‌ జిల్లాలో నమోదైన వర్షాపాతం వివరాలు

సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలకు మెదక్‌ జిల్లాలో 328.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిన్నశంకరంపేట మండలంలో 82.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నార్సింగిలో 0.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.  హవేళీఘనపూర్‌లో 42.6 మి.మీ, కొల్చారంలో 42.4 మి.మీ, అల్లాదుర్గంలో 33.1 మి.మీ, తూప్రాన్‌ 19.1 మి.మీ, రామాయంపేటలో 16.9 మి.మీ, మెదక్‌ 16.6 మి.మీ, చేగుంట 13.3 మి.మీ, మనోహరాబాద్‌లో 12.7 మి.మీ, రేగోడ్‌లో 10 మి.మీ, పాపన్నపేటలో 9.2 మి.మీ, కౌడిపల్లిలో 8.4 మి.మీ, పెద్దశంకరంపేటలో 7.8 మి.మీ, టేక్మాల్‌లో 4.4 మి.మీ, చిలప్‌చెడ్‌లో 3.5మి.మీ, నిజాంపేటలో 1.3మి.మీ, వెల్దుర్తిలో 3.3మి.మీ, శివ్వంపేటలో 0.7 మి.మీ, నార్సింగిలో 0.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.  


సంగారెడ్డి జిల్లాలో..

నారాయణఖేడ్‌/కంగ్టి మే 16: సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌లో ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని కొండాపూర్‌ తండా పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని  ధాన్యం తడిసి ముద్దయింది. మండల పరిధిలోని కొండాపూర్‌ హనుమాన్‌ తండాలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని వారం రోజుల క్రితం ప్రారంభించారు. ఈ కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలు, తండాలకు చెందిన 20 మంది రైతులు దాదాపు 1200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి పడిగాపులు కాస్తు న్నా, ఇప్పటి వరకు ఒక్కగింజ కూడా తూకం వేయలేదని రైతులు వాపోతున్నారు. ధాన్యం తడవడం వల్ల తేమశాతం పేరిట మరో నాలుగైదు రోజులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం వరి వద్దని చెప్పడంతో కొందరు రైతులు వేరుశనగ సాగు చేశారు. అయితే కొనుగోలు ఏర్పాటు చేయకపోవడంతో కామారెడ్డి జిల్లా పిట్లంకు తీసుకెళ్లి విక్రయించాల్సి వస్తుంది. ఫలితంగా రవాణా చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. పొలాల్లో ఉంచిన వేరుశనగలు అకాల వర్షాలకు తడిసిముద్దవుతున్నాయి. 


 విద్యుత్‌ స్తంభం విరిగిపడి ఆవు మృతి

కంగ్టి : కంగ్టి మండలం సర్దార్‌ తండాలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి పెల్యా జైత్రానికి చెందిన ఆవుపై కరెంటు స్తంభం విరిగిపడింది. ఆవు అక్కడిక్కడే మృతిచెందింది. 





Updated Date - 2022-05-17T05:26:34+05:30 IST