కమ్ముకున్న ముసురు

Jul 23 2021 @ 01:05AM
చిత్తడిగా రహదారులు

చిత్తడైన రహదారులు

రెండురోజులుగా తేలికపాటి జల్లులు  

దర్శి, జూలై 22 : రెండురోజులగా కమ్ముకున్న ముసురుతో పలు  రహదారులు చిత్తడిగా మారాయి.  మురికి కాల్వలు లేకపోవడంతో వర్షపునీరు రోడ్లపైనే నిల్వ ఉంది. దీంతో రహదారి దెబ్బతిని గుంటలు పడుతున్నాయి. దర్శి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి సైతం మురికి కాలువలు సక్రమంగా లేవు. పలుచోట్ల కాల్వలు నిర్మించలేదు. దీంతో రోడ్లపైకి చేరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదే పరిస్థితి ఉంది.   ఇక పల్లెలో జనజీవనం స్తంభించింది.

ఎడతెరిపిలేని వర్షం

కురిచేడు : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మండలంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో మండల వాసులు ఇళ్లకే పరిమతమయ్యారు. ప్రస్తుత వర్షాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు భూములు సిద్ధం చేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. రాయితీపై విత్తనాలు అందజేయాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

ముండ్లమూరు : అల్పపీడన ప్రభావంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడ తెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షం వలన మండలంలోని పలు గ్రామాల్లోని వీధులు చిత్తడిగా మారాయి. 

పీసీపల్లి : రెండురోజులుగా కురుస్తున్న వర్షంతో మండలంలో గురువారం ఉదయం 8 గంటలకు 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో మెట్టపైర్లు సాగుకోసం దుక్కి దున్ని సిద్ధంగా ఉంచిన పొలాలు పదునెక్కాయి. తేమ ఆరగానే పొలాల్లో కంది విత్తేందుకు రైతులు విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు. పీసీపల్లి, మురుగుమ్మి, తురకపల్లి, పెద్దన్నపల్లి, తలకొండపాడు గ్రామాల్లో వరినార్లు పోస్తున్నారు. భూములు సారవంతం చేసేందుకు మాగాణీ, రేగడ భూముల్లో పచ్చిరొట్ట ఎరువుకోసం జనుములు, పిల్లిపెసర, జీలుగలను సాగుచేశారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌ సాగుకు ఎంతో ఉపయోగకరమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో మురికి కాలువలు సక్రమంగా లేక వర్షపునీరు రోడ్లపై చే రి దారులు చిత్తడిగా మారాయి. ప్రధానంగా మండలంలో పీసీపల్లి, పెద్దన్నపల్లి, కమ్మవారిపల్లి, పాలేటిపల్లి తదితర గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది.  పీసీపల్లిలో పెట్రోలు బంకు, ఎన్టీఆర్‌ బొమ్మ సెంటర్‌లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్ధితి ఉంది.పెద్దన్నపల్లి, కమ్మవారిపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినప్పటికీ డ్రైనేజీలు నిర్మించకపోవడంతో వర్షం పడినపుడు వర్షపు నీటితోపాటు ఇళ్లలోనుంచి వచ్చే నీరు రోడ్డుపై నిలుస్తోంది. ప్రజలు కాలినడకన నడిచేందుకు కూడా ఇబ్బందులను ఎదుర్కొనక తప్పడంలేదు.

లింగసముద్రం : ఇటీవల కురుస్తున్న వర్షాలకు వెంగళాపురం-రాళ్ళపాడు ప్రాజెక్టు వరకు ఉన్న రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ వర్షాలకు వెంగళాపురం నుంచి జంగంరెడ్డిపాలెం వరకు,  అలాగే లింగసముద్రంలోని కళ్యాణ మండపం నుండి వాకమళ్ళవారిపాలెం ఆనకట్ట వరకు,  అదేవిధంగా తాతాహోటల్‌ నుండి రాళ్ళపాడు ప్రాజెక్టు వరకు ఉన్న ఈ ఆర్‌ అండ్‌ బీ రోడ్డుపై అడుగుకో గుంతపడి దారుణంగా తయారైంది. వర్షాలకు ముందు ఓ మోస్తరు గుంతలు పడి ఉన్న ఈ రోడ్డు ఈ వర్షాలతో  మరీ దారుణంగా తయారైంది. దీంతో వాహనదారులకు ప్రయాణం నరక ప్రాయంగా మారింది.  రోడ్డు దెబ్బతిన్న ప్రతిసారీ ఆర్‌అండ్‌బీ అధికారులు ప్యాచ్‌ వర్క్‌తో సరిపెడుతున్నారు. అధికారులు ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చి అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఆగని ముసురు

వెలిగండ్ల : వెలిగండ్లలో గత రెండురోజుల నుండి వర్షం ప్రారంభమైనా ముసురు ఆగడం లేదు. విరామం లేకుండా ముసురు పట్టడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం మండలంలో 14.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో రైతులకు కొంతమేర మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎ్‌సపురం : మండలంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం ముసురుగా పడుతూనే ఉంది. దీంతో గ్రామాలలోని రహదారులు జలమయమయ్యాయి. సీసీ రోడ్లు లేని రహదారులు బురదమయమయ్యాయి. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీ్‌ఫలో పంటలు సాగుచేయడానికి ఈ వర్షం అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.