వర్షం నష్టం.. రూ.496.66 కోట్లు

ABN , First Publish Date - 2020-11-10T13:54:55+05:30 IST

అకాల వర్షాలు, వరదల కారణంగా..

వర్షం నష్టం.. రూ.496.66 కోట్లు

విపత్తులపై కేంద్ర బృందానికి కలెక్టర్‌ నివేదిక 

శాశ్వత పునరుద్ధరణకు రూ.664 కోట్లు అవసరం

పరిహారం కోసం కలెక్టర్‌ విజ్ఞప్తి

జిల్లాలో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన 

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం

వరద నష్టాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అకాల వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో వివిధ రంగాల్లో మొత్తం రూ.496.66 కోట్ల నష్టం వాటిల్లింది. ఆయా రంగాలను పునరుద్ధరించటానికి రూ.664 కోట్ల వ్యయం అవుతుందని జిల్లా అధికార యంత్రాంగం కేంద్ర బృందానికి వివరించింది. ఆ మేరకు సత్వర సహాయం అందించి, జిల్లాను ఆదుకోవాలని కేంద్ర బృంద సభ్యులు సౌరవ్‌రాయ్‌, ఆయుష్‌ పునియా, శ్రావణ్‌కుమార్‌ సింగ్‌లకు విజ్ఞప్తి చేసింది. మూడు నెలల కాలంలో భారీ వర్షాలు, వరదలు, తుఫాన్ల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం జిల్లాకు వచ్చిన కేంద్ర బృందానికి నగరంలోని క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జిల్లాకు జరిగిన నష్టాన్ని వివరించారు. ఈ సమావేశంలో జేసీలు కె.మాధవీలత, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని భర్తీ చేసేందుకు పెద్ద మనసు చేసుకుని సహాయం చేసి ఆదుకోవాలని కేంద్ర బృందానికి కలెక్టర్‌ ఇంతియాజ్‌ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో గత కొద్ది నెలలుగా సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందానికి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని వివరించారు. వర్షాలు, వరదలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని 18 మండలాలు, ఇతర ప్రాంతాల్లోని 15 మండలాలు నష్టపోయాయన్నారు. ఈ వరదల్లో ఇళ్లు కూలి ఒకరు, నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మరొకరు మృతి చెందారన్నారు. మొత్తం దెబ్బతిన్న నివాసాలు, పంటలతో పాటు, ఆక్వా, సెరీ కల్చర్‌కు జరిగిన నష్టాన్ని బృందం ముందుంచారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌శాఖలతో పాటు విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్‌ల పరిధిలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ముందుగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందాలు పరిశీలించాయి. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తర్వాత నాగాయలంక, మచిలీపట్నం, ముసునూరు, మండవల్లి మండలాల పరిధిలో క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది. కేంద్ర బృందానికి జిల్లా యంత్రాంగం అందజేసిన నష్టం అంచనాలు శాఖల వారీగా ఇలా ఉన్నాయి. 


ప్రాణ నష్టం  

ఇల్లు కూలి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తండు శివ శంకరరావు (53), నదిలో పడి ఇబ్రహీంపట్నం వద్ద కొత్తపల్లి నవీన్‌ (28) మృతిచెందారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి కుటుంబీకులకు రూ.4 లక్షల పరిహారం అందజేశారు.


ఉద్యాన పంటల నష్టం ఇలా.. 

జిల్లాలో ఉద్యాన పంటలకు  తీవ్ర నష్టం జరిగింది. మొత్తం 35 మండలాల్లో అరటి, యాసిడ్‌ లైమ్‌, మిర్చి, డ్రాగన్‌ ఫ్రూట్‌, జామ, మామిడి, బొప్పాయి, పసుపు, పూలు, కూరగాయలు, కంద, బీటెల్‌వైన్‌ తదితర పంటలు దెబ్బతిన్నాయి. అక్టోబరు నాటికి 6,661.70 హెక్టార్ల ఉద్యానపంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొత్తం 10.194 మంది రైతులకు సంబంధించి రూ.192.72 కోట్ల నష్టం వాటిల్లింది. తక్షణం ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.1,103.10 లక్షలు రావాల్సి ఉంది. 


పట్టు పరిశ్రమకు నష్టం.. 

జిల్లాలో చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో 123 మంది మల్బరీ రైతులకు సంబంధించి 169.5 ఎకరాల విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. పట్టు పురుగుల షెడ్లు, పరికరాలతో పాటు, పట్టుపురుగులకు సంబంధించి మొత్తం రూ.23 లక్షల మేర నష్టం వాటిల్లింది. 


మత్స్య శాఖకు ఎంతో నష్టం.. 

జిల్లాలో చేపలు / రొయ్యల చెరువులకు 2500 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. మొత్తం 850 మంది రైతులు నష్టపోయారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం రూ.2 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి. మత్స్యకారులకు సంబంధించి 475 వలలు, 42 బోట్లకు నష్టం వాటిల్లింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఆక్వా రైతులకు సంబంధించిన నష్టం అంచనాలను మాత్రమే జిల్లా యంత్రాంగం ఇచ్చింది. కొల్లేరు వైల్డ్‌ లైఫ్‌ శాంచురీ ఏరియా పరిఽధిలోనూ, కైకలూరు 5 కాంటూరు ఏరియా పరిధిలోని చేపల/ రొయ్యల చెరువులను భారీ విస్తీర్ణంలో నష్టపోయిన పెద్ద రైతుల వివరాలను ఇవ్వలేదు. అలాగే లైసెన్స్‌ లేకుండా చెరువుల సాగు చేపట్టిన వారి నష్టం వివరాలను పొందుపరచలేదు. ఇక పశు సంవర్ధక శాఖకు సంబంధించి కృష్ణానదిలో ఆరు మేకలు కొట్టుకు పోగా, 4100 కోడిపిల్లలు, రెండు గేదెలు చనిపోయాయి. 


పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లకు భారీ నష్టం

పంచాయితీరాజ్‌ శాఖ పరిధిలోని సీసీ, బీటీ, డబ్ల్యూబీఎం, గ్రావెల్‌ రోడ్లు మొత్తం 378.79 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. వీటిలో బీటీ రోడ్లు 294.36 కిలోమీటర్లు, డబ్ల్యూబీఎం రోడ్లు 29.10 కిలోమీటర్లు గ్రావెల్‌ రోడ్లు 55.33 కిలోమీటర్లు పొడవున దెబ్బతిన్నాయి. వీటికి పాక్షిక మరమ్మతులకైతే రూ.16.92 కోట్లు, శాశ్వతంగా అయితే రూ.119 కోట్లు అవసరం. 


ఇక ఆర్‌అండ్‌బీ పరిధిలోని 14 రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రూ.82.50 లక్షల మేర నష్టం వాటిల్లింది. స్టేట్‌ హైవేస్‌, ఎండీఆర్‌ఎస్‌ పరిధిలోని 139 రోడ్లకు డ్యామేజి వాటిల్లింది. వీటికి పాక్షికంగా మరమ్మతులు చేయటానికి రూ.45 కోట్లు, శాశ్వత నిర్మాణానికైతే రూ.312.98 కోట్లు కావాలి. ఆర్‌అండ్‌బీ పరిధిలోనే సీడీ వర్క్స్‌ మొత్తం 36 చోట్ల దెబ్బతిన్నాయి. పాక్షిక పనులకు రూ.1.64 కోట్లు, శాశ్వతంగా అయితే రూ.24.88 కోట్లు అవసరం. స్కవర్స్‌ వల్ల తలెత్తిన నష్టాన్ని పూడ్చేందుకు తాత్కాలికంగా రూ.95 లక్షలు, శాశ్వతంగా రూ.26.60 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. 


ఇరిగేషన్‌కూ నష్టమే 

ఇరిగేషన్‌ శాఖ పరిధిలో కృష్ణానది, కాలువలు, చెరువులు మొత్తం 316 చోట్ల దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులకు రూ.30.25 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.35.09 కోట్లు అవసరం.


దెబ్బతిన్న నివాసాలు 

జిల్లాలో మొత్తం 26,279 ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయని, ఇందులో 24,078 ఇళ్లు వారం పాటు ముంపులోనే ఉండిపోయాయని నివేదికలో పేర్కొన్నారు. 2,651 నివాసాలు ఒక రోజు ముంపులో ఉన్నాయని,  అకాల వరదలు, వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 407 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పక్కా ఇళ్లు 4, కచ్చా ఇళ్లు 51 ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న పక్కా ఇల్లు 1, కచ్చా ఇళ్లు మూడు, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లు 20, కచ్చా ఇళ్లు 227, దెబ్బతిన్న గుడిసెలు 51గా పేర్కొన్నారు. మొత్తంగా ఇళ్లకు రూ.70.46 లక్షల మేర నష్టం వాటిల్లింది. 


మునిసిపల్‌ ఏరియాల పరిధిలో.. 

విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్‌లు, నూజివీడు మునిసిపాలిటీ భారీ వర్షాలు, వరద తాకిడికి గురయ్యాయి. ఈ మూడింటి పరిధిలో 7.7 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఓపెన్‌ డ్రెయిన్స్‌, యూజీడీ వ్యవస్థలకు 7.05 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లింది. మంచినీటి పైపులెన్లు 6.05 కిలోమీటర్ల పొడవున దెబ్బతిన్నాయి. మొత్తం 682 వీధి లైట్లు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించి మొత్తం నాలుగు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి మొత్తం రూ.5.99 కోట్ల నష్టం వాటిల్లింది. 


వ్యవసాయానికి కోలుకోలేని నష్టం

జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలు, అదే సమయంలో సంభవించిన వరదల కారణంగా 19,580 మంది రైతులకు సంబంధించి 22,849.67 ఎకరాల విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి సంబంధించి రూ.3168.12 లక్షల ఇన్‌పుట్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 777 మెట్రిక్‌ టన్నుల వరి, 900 మెట్రిక్‌ టన్నుల మినుము,  1250 టన్నుల పత్తి, 2237  టన్నుల పెసలు, 6.84 టన్నుల చెరకు,  0.6 టన్నుల కంది దెబ్బతిన్నాయి. ఈ పంటలకు సంబంధించి మొత్తం రూ.183.3 కోట్ల నష్టం వాటిల్లింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం ఈ మొత్తం నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.18 కోట్ల మేర చెల్లించాలి. 



Updated Date - 2020-11-10T13:54:55+05:30 IST