రైతుల గుండెల్లో తుఫాను

ABN , First Publish Date - 2021-11-16T06:57:46+05:30 IST

జిల్లాలో భారీ వర్షాలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి.

రైతుల గుండెల్లో తుఫాను

ఓపక్క హెచ్చరికలు

మరోపక్క ముందుగానే భారీ వర్షాలు 

29 మండలాల్లో వర్షపాతం నమోదు 

సగటు జిల్లా వర్షపాతం 4.1 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో భారీ వర్షాలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. ఒకపక్క రానున్న తుఫాను ముప్పుపై జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తుండగా.. మరోపక్క ముందుగానే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో చేతికొచ్చిన పంటలను దక్కించుకునేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. గురువారం నుంచి వాయుగుండం ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే సోమవారమే తుఫాను ప్రభావం కనిపించింది. జిల్లాలో పలుచోట్ల ఉదయం, సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఉదయం 8.30 గంటల ప్రాంతానికి జిల్లావ్యాప్తంగా 206.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. సగటు జిల్లా వర్షపాతం 4.1గా నమోదయింది. సాయంత్రం కూడా జిల్లాలో పలు చోట్ల వర్షపాతం నమోదయింది. పామర్రు మండలంలో అత్యధికంగా 26.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, గుడివాడ మండలంలో 0.8 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదయింది. 


అంతటా ముసురు  

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విజయవాడ నగరం మినహా జిల్లా అంతటా ముసురు కమ్ముకుంది. వాయుగుండం బలపడితే 17, 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 


వరి కొయ్యొద్దు : కలెక్టర్‌ సూచన

వన్‌టౌన్‌, నవంబరు 15 : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రానున్న మూడు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వరి కోతలు కోయవద్దని కలెక్టర్‌ నివాస్‌ రైతులకు విజ్ఞప్తి చేశారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి దిశగా కదులుతోందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం కలెక్టర్‌ నివాస్‌ క్యాంపు కార్యాలయం నుంచి జేసీ డాక్టర్‌ మాధవీలతతో కలిసి ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాయుగుండం కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఈ దృష్ట్యా ఈ నెల 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని, జిల్లా, మండల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ కోరారు. లోతట్టు ప్రాంత ప్రజలను శిబిరాలకు తరలించాలని స్థానిక అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో ఖరీఫ్‌ వరి కోతలు ప్రారంభమయ్యాయని, అయితే ప్రస్తుతం పంటను కోయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పంట కోసి ఉంటే, 17వ తేదీలోపే సురక్షిత ప్రాంతంలో భద్రపరచుకోవాలని సూచించారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌ తప్పనిసరి అని, ఇంకా చేసుకోని రైతులందరూ వెంటనే చేయించుకోవాలని కోరారు. జేసీ డాక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ఈ నెల 19న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలకు వెళతారని, వారిని వెళ్లొద్దంటూ దండోరా వేసి హెచ్చరించాలని కోరారు. 

Updated Date - 2021-11-16T06:57:46+05:30 IST