వీడని వర్షం

ABN , First Publish Date - 2021-11-22T06:18:16+05:30 IST

భారీ వర్షాలు జిల్లా రైతులను నిలువునా ముంచేశాయి.

వీడని వర్షం
గూడూరులో నీటిలో తేలియాడుతున్న వరి పైరు

నీటిలోనే వరి పైరు

వరుసగా రెండో ఏడాదీ రైతులకు కోలుకోలేని దెబ్బ

ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు సడలిస్తేనే మేలు


భారీ వర్షాలు జిల్లా రైతులను నిలువునా ముంచేశాయి. పంట చేతికొచ్చే దశలో భారీ వర్షాల రూపంలో వచ్చిన విపత్తు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలకొరిగి నీటిలో తేలియాడుతుంటే, ఆ పైరును నిలబెట్టలేక, పొలంలో ఉన్న నీటిని బయటకు పంపేందుకు వీలులేక అన్నదాతలు నిస్సహాయులుగా మిగిలిపోయారు. 


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లా రైతులను వరుసగా రెండో ఏడాదీ వర్షాలు కష్టాల్లోకి నెట్టేశాయి. గత ఏడాది నవంబర్లో పది రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వరి పంట దెబ్బతింది. ఆ నష్టం నుంచి ఇప్పటికీ చాలా మంది రైతులు కోలుకోలేదు. ఈ ఏడాది కూడా వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు చేతికొచ్చిన పంటను ముంచేశాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లలో వరిపంట సాగైంది.  ఇప్పటివరకు  సుమారు మూడు వేల హెక్టార్లలో మాత్రమే వరికోతలు పూర్తయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా నాట్లు పూర్తిచేసిన రెండు లక్షల హెక్టార్లలో వరి కోతకు సిద్ధంగా ఉంది. ఆలస్యంగా నాట్లు వేసిన పొలాల్లోని 35 వేల హెక్టార్లలోని పైరు పొట్టదశలో ఉంది. కొంత పైరు ఈత దశలో, కంకులు పాలుపోసుకునే దశలో ఉండగా, మరికొంత పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ మొత్తం పైరునూ వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతీశాయి. వర్షానికి తోడు  బలమైన గాలులు వీయడంతో లేత గింజలు పగిలిపోయాయి. నేలవాలిన వరి నీటిలోనే రోజుల తరబడి ఉండటంతో కంకులు మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పట్లో కోత కోసేందుకు కూడా వీలు లేకుండా పొలంలో ఆరు అంగుళాలకు పైగా నీరు నిల్వ ఉండిపోయింది. దీంతో యంత్రాల ద్వారా కోయాలన్నా మరో పదిరోజులు ఆగాల్సిందేనని గుండుపాలెంకు చెందిన రైతు మురళి చెప్పారు. చేతికి అందివచ్చే తరుణంలో పైరు నేలవాలడంతో ఎటూ పాలుపోవడంలేదని బందరు, గూడూరు మండలాలకు చెందిన రైతులు వాపోతున్నారు.  ఈ వర్షాల కారణంగా గింజల్లో నాణ్యత దెబ్బతినడంతోపాటు, రంగు మారుతుందని చెబుతున్నారు. 


ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు సడలించేనా?

ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధనలు రైతుల పాలిటశాపంగా మారాయి. ఆర్‌బీకేలు సిఫార్సు చేసిన మిల్లులకే ధాన్యం విక్రయించాలనే నిబంధన పెట్టారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో  గుడ్లవల్లేరు, వేమవరం, పెడన, మంజులూరు, అర్తమూరు తదితర ప్రాంతాల్లో వరి కోతలు కోశారు. ఽధాన్యం కొనుగోలు చేయాలని రైతులు మిల్లర్ల వద్దకు వెళితే మేం కొనేదిలేదు. మీ గ్రామ పరిధిలోని ఆర్‌బీకేల వద్దకు వెళ్లాలని మిల్లర్లు రైతులకు చెబుతున్నారు. ఆర్‌బీకేల నుంచి ఆన్‌లైన్లో అనుమతులు వస్తేనే ధాన్యం తీసుకువెళతామని మిల్లర్లు అంటున్నారు. ఆర్‌బీకేల్లో  పనిచేసే సిబ్బందికి ధాన్యం కొనుగోళ్లపై ఎంతమేర అవగాహన ఉన్నదని రైతులు ప్రశ్నిస్తున్నారు.  వాతావరణం అనుకూలంగా లేని సమయంలో రోడ్లపై, కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ధాన్యాన్ని జిల్లాలో ఎక్కడైనా విక్రయించుకునేలా నిబంధనలను సడలించాలని రైతులు కోరుతున్నారు.   


పంటనష్టం అంచనా వేసేనా?  

అధిక వర్షాల కారణంగా కోతకొచ్చిన దశలో ఉన్న వరి నేలవాలింది. అయినా వ్యవసాయ శాఖ బృందాలు ఇంతవరకు పొలాలను పరిశీలించలేదు.  గతంలో  కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం అంచనా వేసిన బృందాలే ఈ ఏడాది కూడా అంచనాలను తయారు చేస్తాయని వ్యవసాయశాఖ జేడీ టి.మోహనరావు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత పంట నష్టం అంచనాలను వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. 


వెంటాడుతున్న వాన 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మూడు రోజుల క్రితమే తీరందాటినా జిల్లాను వర్షం వీడటంలేదు. ఆదివారం కూడా విడతలవారీగా వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు కోడూరులో అత్యధికంగా 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, పెదపారుపూడిలో అత్యల్పంగా ఒక్క మిల్లీమీటరు వర్షపాతం నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 8 మిల్లీ మీటర్లుగా నమోదైంది. 


రొయ్యల చెరువులకూ వర్షం తాకిడి

భారీ వర్షాల ప్రభావం రొయ్యల చెరువులపైనా పడింది. చల్లదనం అధికం కావడం, వ్యాధుల భయం వెంటాడు తుండడంతో పాటు, వర్షాల కారణంగా డ్రెయినేజీలు పొంగి ప్రవహిస్తుండటంతో గట్లు తెగిపోతాయనే భయంతో రైతులు రొయ్యల పట్టుబడి మొదలెట్టారు. బందరు మండలంలోని రుద్రవరం, కోన, గరాలదిబ్బ, పోలాటితిప్ప ప్రాంతాల్లో పట్టుబడి సాగుతోంది.

Updated Date - 2021-11-22T06:18:16+05:30 IST