వెంటాడుతున్న వర్షాలు

ABN , First Publish Date - 2022-05-17T05:52:30+05:30 IST

జిల్లాలో వరుసగా కురుస్తున్న వడగళ్ల వర్షాలు రైతులను వణుకు పుట్టిస్తున్నాయి. కమ్ముకుంటున్న మబ్బుల, ఉరుములు, మెరుపులతో ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో ఆశగా కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసుకున్న ధాన్యం తడిసి ముద్దవుతోంది. పిడుగు పాటుకు రైతులు గాయపడుతుండగా పశువులు మృతిచెందుతున్నాయి. నీటి పాలవుతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు.

వెంటాడుతున్న వర్షాలు
ఎల్లారెడ్డిపేటలో నిలిచిన నీటిని తొలగిస్తున్న రైతు

- జిల్లాలో మరోసారి గాలివాన బీభత్సం

- తడిసి ముద్దవుతున్న యాసంగి ధాన్యం 

-   5 వేల క్వింటాళ్ల వరకు నష్టం 

- కోనరావుపేటలో పిడుగుపాటుకు ఎద్దు మృతి 

- కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు 

- మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు 

 -   రైతుల ఆందోళనలు 

- తడిసిన ధాన్యంపై ఆరాతీసిన మంత్రి కేటీఆర్‌ 

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో వరుసగా కురుస్తున్న వడగళ్ల వర్షాలు రైతులను వణుకు పుట్టిస్తున్నాయి. కమ్ముకుంటున్న మబ్బుల, ఉరుములు, మెరుపులతో ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో ఆశగా కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసుకున్న ధాన్యం తడిసి ముద్దవుతోంది. పిడుగు పాటుకు రైతులు గాయపడుతుండగా పశువులు మృతిచెందుతున్నాయి. నీటి పాలవుతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు  తిప్పలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు మాత్రం పుంజుకోవడం లేదు.  అదివారం అర్ధరాత్రి తరువాత మొదలైన గాలివాన బీభత్సం రైతులను ఆగమాగం చేసింది. దాదాపు 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతుండగా అధికారులు మాత్రం 4 వేల బస్తాల వరకు తడిశాయని వాటిని బాయిల్డ్‌ మిల్లులకు తరలిస్తున్నామని పేర్కొంటున్నారు.  అకాల వర్షం బీభత్సానికి జిల్లాలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, చందుర్తి, ముస్తాబాద్‌, కోనరావుపేట, రుద్రంగి, బోయినపల్లి, వేములవాడ, వీర్నపల్లి, మండలాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం భారీగా తడిసిపోయింది. రైతులు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు కప్పినా నేలపై నుంచి వర్షపు ధారలతో ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్లపై ధాన్యం ఆరబోసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా చోట్ల ధాన్యం కుప్పపోసుకోవడానికి వీలు లేకుండా పోయింది. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో పిడుగుపాటుతో సోమినేని శంకర్‌కు చెందిన ఎద్దు మృతిచెందింది. తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టుకోవడం, కుప్పలు పోసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. 

ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు  

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకోకు దిగారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు భరోసా  కల్పించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ముస్తాబాద్‌  మండలం తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద, చందుర్తి మండల కేంద్రంలో వేములవాడ వెళ్లే రహదారిపై రాస్తారోకో చేశారు. 

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు 

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 2.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం 268 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి 254  ప్రారంభించారు. ఇప్పటి వరకు 252 కొనుగోలు కేంద్రాల ద్వారా 8,410 మంది రైతుల నుంచి 59,258 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాతమ్రే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద భారీగా ధాన్యం కుప్పలుగా ఉంది. ధాన్యం సేకరణ వేగంగా జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో  తీవ్రంగా నష్టపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని, ఎలాంటి నష్టం చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధాన్యం నష్టంపై తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ 

జిల్లాలో అకాల వర్షంతో జరిగిన ధాన్యం నష్టంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ జరిగిన నష్టాన్ని వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుదన్న భరోసా ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ మేరకు  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో పర్యటించారు. పంట వివరాలను తెలుసుకున్నారు. 


తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం 

జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడం, రైతుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్‌ స్పందించారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అందోళన చెందవద్దని సూచించారు. 



Updated Date - 2022-05-17T05:52:30+05:30 IST