వానలు లేక విలవిల..

ABN , First Publish Date - 2022-06-21T05:44:39+05:30 IST

ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభమై 20రోజులు దాటినా కనీస వర్షాలు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వానలు లేక విలవిల..
పత్తి విత్తనాలు నాటుతున్న కూలీలు(ఫైల్‌)

ఎండుతున్న విత్తనాలు

 ఆందోళలో రైతులు

వైరా, జూన్‌ 20: ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభమై 20రోజులు దాటినా కనీస వర్షాలు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా కురిసిన సన్నటి వర్షపు జల్లులు పడి ఆశలు రేకెత్తించటంతో పలువురు రైతులు పొడిదుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు. పచ్చిరొట్ట విత్తనాలు చల్లారు. అయితే ఈ విత్తనాలు వేసిన నాటి నుంచి చుక్క చినుకు కూడా పడకపోవడంతో అన్నదాతలు విలవిలలాడుతున్నారు. వానల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 85మిల్లీమీటర్లు నమోదు కావల్సి ఉంది. అయితే కేవలం 18శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతానికి వాస్తవ వర్షపాతానికి ఎక్కడా పొంతనే లేదు. మండలంలో ఇప్పటివరకు 400ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటారు. ఎక్కడా కూడా ఒక్క విత్తనం కూడా మొలక రాలేదు. ఆ విత్తనాలు మొత్తం పనికిరాకుండాపోతున్నాయి. ఈ రైతులు మళ్లీ పత్తి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ఒక్కో రైతుకు వేలాదిరూపాయల నష్టం వాటిల్లుతుంది. ఇకపోతే నాలుగైదువేల ఎకరాల్లో రైతులు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగులు, పిల్లిపెసర, ఇతర విత్తనాలు చల్లుకున్నారు. అవి కూడా మొలకరాలేదు. ప్రతిరోజూ పలు సమయాల్లో ఆకాశం మేఘామృతం కావడం ఆవెనువెంటనే సాధారణ మబ్బులు విడిపోయి సాధారణ స్థితికి రావడం పరిపాటిగా మారింది. పగటిపూట ఎండలు, ఉక్కపోత, కొద్దిసేపట్లోనే దట్టమైన మబ్బులు ఆవరించటం, కుండపోత వర్షం కురుస్తుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూడటం ఆకొద్దిసేపటికే మబ్బులు విడిపోతుండటంతో రైతుల ఆశలు వమ్ముఅవుతున్నాయి. పదిరోజులుగా చినుకు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు.


Updated Date - 2022-06-21T05:44:39+05:30 IST