మళ్లీ ముసురు

ABN , First Publish Date - 2021-11-29T04:31:42+05:30 IST

జిల్లాలో మళ్లీ ముసురుపట్టింది. ఆదివారం ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి. తూర్పు, దక్షిణ ప్రాంతంలోని పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది.

మళ్లీ ముసురు
రాళ్లపాడు రెండు గేట్లు ఎత్తివేయడంతో దిగువకు ప్రవహిస్తున్న నీరు, ఒంగోలులో వర్షంలోనే తడుస్తూ ఇంటికెళుతున్న ప్రజలు

తూర్పు, దక్షిణ ప్రాంతంలో భారీ వర్షం జూ అత్యధిక మండలాల్లో రోజంతా జల్లులు 

గుండ్లకమ్మ, రాళ్లపాడుకు వరద..

దిగువకు నీటి విడుదల

కర్షకుల్లో కలవరం 

నేడు, రేపు విస్తారంగా కురిసే అవకాశం 

కంట్రోల్‌ రూంల ఏర్పాటు

ఒంగోలు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మళ్లీ ముసురుపట్టింది. ఆదివారం ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి. తూర్పు, దక్షిణ ప్రాంతంలోని పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది. చలిగాలుల తీవ్ర త కూడా పెరిగింది. తాజా పరిస్థితి కర్షకులను కలవరానికి గురి చేస్తోం ది. ఐదారు రోజుల క్రి తం వరకూ కురిసిన వర్షాలతో కోలుకోలేని దెబ్బతిన్న వారికి మరో వానగండం పొంచి ఉం దన్న సమాచారంతో కంటిమీద కునుకు కరువెంౖది. గుండ్లకమ్మ, రాళ్లపాడు ప్రాజెక్టులు ఇప్పటికే నిండి ఉండగా తాజా వర్షాలతో ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలులోని కలెక్టరేట్‌తోపాటు, మూడు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లోనూ కంట్రోలు రూంలు ఏర్పాటు చేశారు. 


చీరాలలో అత్యధికంగా 50.5 మి.మీ వర్షపాతం

శ్రీలంక-తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో శనివారం నుంచే వాతావరణంలో మార్పు వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి అత్యధిక ప్రాంతాల్లో ఈదరుగాలులుతో కూడిన జల్లులు పడుతూనే ఉన్నాయి. తూర్పు,దక్షిణ ప్రాంతంలోని పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది. అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు గరిష్ఠంగా చీరాలలో 50.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వేటపాలెంలో 45.5, సింగరాయకొండ మండలంలో 43.75, ఒంగోలు మండలంలో 40.0, జరుగుమల్లిలో 33.75, ఉలవపాడులో 27.0, టంగుటూరులో 23.50. మర్రిపూడిలో 22.0, ముండ్లమూరులో 21.75, అద్దంకిలో 20.0, కందుకూరులో 19.0 మి.మీ కురిసింది. మరో 20కిపైగా మండలాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. ఇతర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిశాయి.


వాగుల్లో పెరిగిన ప్రవాహ ఉధృతి

ఇటీవలి వర్షాలకు జిల్లాలోని నదులు, వాగులు, వంకలు ఇతర నీటి వనరుల్లో నీటి ప్రవాహ ఉధృతి పెరిగింది. ఇప్పటికే రాళ్లపాడు, గుండ్లకమ్మ ప్రాజెక్టులు నిండగా పాలేరు మన్నేరు, ముసి నదులు, ఇతర దాదాపు 50కిపైగా ఉన్న ప్రధాన వాగులు, వంకల్లో జల ప్రవాహం అధికంగా ఉంది. గుండ్లకమ్మ, రాళ్లపాడు ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటిమట్టం 24.89 మీటర్లుకాగా ప్రస్తుతం 23.70 ఉంది. ఎగువ నుంచి 5వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఒక గేటు ద్వారా  ఆ మొత్తాన్ని దిగువకు పంపుతున్నారు. రాళ్ల ప్రాజెక్టు నీటిమట్టం 20.60 అడుగులు కాగా ప్రస్తుతం 20.0 అడుగులు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో రెండు గేట్లు ఎత్తి 5200 క్యూసెక్కులు దిగువన ఉన్న మన్నేరులోకి వదులుతున్నారు. 


రైతుల్లో వణుకు

ఐదారు రోజులు క్రితం జిల్లాలో వరుసగా వారం రోజులపాటు కురిసిన వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 1.01 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా అనధికారికంగా మరో 50వేలు అదనంగా ఉన్నట్లు సమాచారం. అలా ఇంచుమించు లక్షన్నర ఎకరాల్లో పంటలు కోల్పోయి దాదాపు రూ.400 కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. వర్షాలు కాస్తంత తగ్గి ఉన్న పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో మళ్లీ ముసురు పట్టడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కంటిమీద కునుకు కరువైంది. 


కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు 

తాజా వర్షాలతోపాటు అండమాన్‌ ప్రాంతంలో ఇంకో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండురోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందింది. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సంబంధిత అఽధికారులను అలర్ట్‌ చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్‌తో పాటుమూడు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోలు రూంకు 08592-281400 నెంబర్‌తోపాటు, 1077 టోల్‌ఫ్రీ నెంబర్‌ను కేటాయించారు. కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో 08598-223235, మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో 9110393042, ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో 8886616044 నెంబర్‌తో కంట్రోల్‌ రూంలు పనిచేస్తాయి.  వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఎస్పీ మలికగర్గ్‌ ఆదేశించారు. 

Updated Date - 2021-11-29T04:31:42+05:30 IST