వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2021-04-15T05:54:55+05:30 IST

: జిల్లాలో అకాలంగా వచ్చిన వడగళ్ల వర్షం వందలాది మంది రై తులను అతలాకుతలం చేసింది. వారం రోజుల్లో కోసే పంటలను దెబ్బతీసింది.

వర్ష బీభత్సం


జిల్లాలో వడగళ్ల వర్షానికి భారీగా దెబ్బతిన్న వరిపంట

వెయ్యి ఎకరాలకుపైగా పంట నష్టం

పలు గ్రామాల పరిధిలో తడిసిన ధాన్యం

ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతుల వినతి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో అకాలంగా వచ్చిన వడగళ్ల వర్షం వందలాది మంది రై తులను అతలాకుతలం చేసింది. వారం రోజుల్లో కోసే పంటలను దెబ్బతీసింది. కోసినవారి ధాన్యం ఈ అకాల వర్షానికి తడిసిపోగా వందలాది ఎకరాల పంట ఈ వడగళ్ల వానకు దెబ్బతింది. రైతులు ఎన్నో ఆశలతో కష్టాలు పడి సాగుచేసిన ఈ పంటను మంగళవారం సాయంత్రం పడిన వడగళ్ల వర్షం వారి ఆశలను నిరాశ చేసింది. వారం రోజుల్లో పంట కోయడంతో పాటు అమ్మే అవకాశం ఉందని భావించిన వారికి ఈ వర్షం నిరాశను మిగిల్చింది. వడగళ్లు జిల్లాలోని రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో మంగళవారం సాయంత్రం వర్ని, కోటగిరి, ఎడపల్లి, నవీపేట, నిజామాబాద్‌రూరల్‌, మాక్లూర్‌, జక్రాన్‌పల్లి, సిరికొండ, డిచ్‌పల్లి, మోపాల్‌ మండలాల్లో ఈ వర్షం పడింది. వడగళ్లతో కూడిన వర్షం ప డడంతో ఈ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సిరికొండ మండలం తూంపల్లి, కొండూరు గ్రామాల్లో భారీగా వడగళ్లు పడడంతో సుమారు 280 హెక్టార్‌లకు పైగా పంట దెబ్బతింది. ఇదే కాకుండా వర్ని మండలం లో 80 ఎకరాల వరకు, నవీపేటలో వంద ఎకరాలకు పైన, మాక్లూర్‌ మండలంలో 150 ఎకరాల వరకు, జక్రాన్‌పల్లి మండలంలో 200 ఎకరాల వరకు పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వీటితో పాటు ఇతర మండలాల్లోని వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక అంచనా వేస్తున్నారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అందిన స మాచారం మేరకు వెయ్యి ఎకరాలకుపైగా వరి దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఒకేసారి భారీగా వడగళ్ల వర్షం పలు గ్రామాల పరిధిలో పడడంతో చేతికివచ్చిన పంటలు నేలకొరగడంతో పాటు ధాన్యం రాలడంతో భారీగా నష్టం జరిగింది. 

నిబంధనల మేరకు అంచనా..

వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం ఏ పంట అయి నా 35శాతానికి మించి నష్టం జరిగితేనే నష్టపరిహారానికి సిఫారసు చేస్తారు. జిల్లాలో రెండు రోజుల్లో పడిన అకాల వ ర్షాల వల్ల పంట నష్టం ఎక్కువగానే ఉన్నా చాలా గ్రా మాల పరిధిలో 35శాతంలోపే నష్టం ఉండడం వల్ల వ్యవసాయ అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవడంలేదు. నిబంధనల మేరకే నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 

తడిసిన ధాన్యం.. 

జిల్లాలో రెండు రోజుల పాటు పడిన వర్షాలతో భారీగా ధాన్యం తడిసిపోయింది. వర్షం ఆగిపోవడంతో మళ్లీ ఆరబోస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఇతర ధాన్యంలాగానే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టాలని కోరుతున్నారు. వడగళ్ల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు. 

అప్రమత్తమైన రైతులు..

వడగళ్ల వర్షం పడడం, పంట నష్టం జరగడంతో రైతులు అప్రమత్తమయ్యారు. వర్షం పడని ప్రాంతంలో త్వరగా వరి కోతలను చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. హార్వెస్టర్‌లకు కూడా డిమాండ్‌ పెరిగింది. వారు ఎకరాకు రూ.2400 అంతకు మించి తీసుకుంటున్నా వడగళ్ల భయంతో డబ్బులను పెట్టి వరి కోతలను చేస్తున్నారు.  కోసిన ధాన్యం కూడా వెంటనే అమ్మేందుకు సిద్ధం అవుతున్నారు. 

మందకొడిగా కొనుగోళ్లు..

జిల్లాలో ఇప్పటి వరకు 200లకు పైగా కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసినా సేకరణ భారీగా జరగడంలేదు. వరుస సెలవులు ఉండడం, కొన్ని చోట్ల గన్నీబ్యాగులు, వాహనాల కొరత ఉండడం వల్ల ఆలస్యం అవుతోంది. గన్నీ బ్యాగులను ఇక్కడికే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన అధికారులు అన్ని ప్రాంతాలకు సరఫరా చేసిన కొరత మాత్రం కొనసాగుతుంది. రైతులు మాత్రం వర్షాలను దృష్టిలో పెట్టుకుని త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. 

నష్టాన్ని అంచనా వేస్తున్నాం..

- గోవింద్‌, జేడీఏ 

జిల్లాలో పడిన వడగళ్ల వాన వల్ల వరి పంట దెబ్బతింది. ఆయా మండలాల పరిధిలో వ్యవసాయశాఖ తరపున నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ప్రాథమిక నివేదిక అందగానే ప్రభుత్వానికి నివేదిస్తాం. 

Updated Date - 2021-04-15T05:54:55+05:30 IST