గిద్దలూరు టౌన్, మే 21 : గ్రామీణ ప్రాంతాలలో నాటుసారా తయారు చేయకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎస్టీ ఎంప్లాయిస్ అధ్యక్షులు బి.ఎల్.రామానాయక్, ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు. నాటుసారా తయారు చేయడం చట్టరిత్యా నేరమని, అయితే ఈ విషయం గిరిజన గ్రామాల్లోని ప్రజలకు తెలియకపోవడంతో వారు అనవసరంగా పీడీ యాక్ట్ కింద అరెస్టు అవుతున్నారన్నారు. బురుజుపల్లి, దూర్‌చింతలతాండా, వెంకటాపురంతాండా, దిగువమెట్టతాండాతోపాటు రాచర్ల మండలంలోని కొన్ని గ్రామాలలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, ఆయా గ్రామాలలో ఎస్‌ఈబీ, పోలీసు అధికారులు వారికి గ్రామసభల ద్వారా అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వం తాజాగా సారా తయారు చేసినా, అమ్మకాలు చేసిన పిడి యాక్ట్ చట్టం తెచ్చిందని, ఈ చట్టం గురించి కొండ ప్రాంతాల్లో నివసించే వారికి పెద్దగా తెలియదని, దీని వలన పేదలైన గిరిజనులు పీడీ యాక్ట్‌కు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్నతాధికారులు సహకరించాలని కోరారు.