రైతువ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T04:59:40+05:30 IST

రైతువ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

రైతువ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
ఇబ్రహీంపట్నం : రాస్తారోకో చేపట్టిన నాయకులు

  • ప్రజా సంఘాల నాయకుల డిమాండ్‌
  • ఢిల్లీలోని రైతుల పోరాటానికి మద్దతుగా జిల్లాలో ధర్నాలు, నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు

ఇబ్రహీంపట్నం/చేవెళ్ల/మహేశ్వరం/యాచారం: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా గురువారం ఇబ్రహీంపట్నంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయించి నిర్భధించడం అమానుషమన్నారు. కార్పొరేట్‌ శక్తుల కోసమే కేంద్రం చట్టాలు తెచ్చిందని ఆయన ఆరోపించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు బి.సామేల్‌, కె.జగన్‌, సీ.హెచ్‌.జంగయ్య, విఘ్నేష్‌, నర్సింహ, ఆనంద్‌, శంకర్‌, బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ రంగాలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ నూతన చట్టాలను తెచ్చిందని చేవెళ్ల డివిజన్‌ రైతు సంఘం అధ్యక్షుడు టి.జంగయ్య ఆరోపించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను వీడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహులు, సత్తయ్య, శ్రీనివాస్‌, శ్రీరాములు, అనంతయ్య, రైతులు ఉన్నారు.  రైతు సంక్షేమం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల రవికుమార్‌ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మహేశ్వరం మండలం కోళ్ళపడకల్‌ గ్రామంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా చట్టాలను రద్దుచేసి వారికి మేలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బాలయ్య, రమేష్‌, నర్సింహ, లక్ష్మయ్య, రాజు, శంకరయ్య, యాదయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల గోడు వినకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం దారుణమని ప్రజాసంఘాల నాయకులు బ్రహ్మయ్య, ఽథావ్‌నాయక్‌ మండిపడ్డారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా గురువారం యాచారం మండల కేంద్రంలోని సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను అడ్డుపెట్టుకొని పార్లమెంట్‌లో రైతులకు వ్యతిరేకంగా బిల్లులు ప్రవేశపెట్టడం  ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయనిమచ్చ అని విమర్శించారు. వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు వినోద్‌కుమార్‌, సీఐటీయూ నాయకులు వెంకటయ్య, విజయ్‌కుమార్‌, జంగయ్య, యాదగిరి, శారదమ్మ, మల్లయ్య, రాములు, లక్ష్మమ్మ, బుచ్చయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:59:40+05:30 IST