దేశంలోనే అద్భుత పథకం ‘రైతుబంధు’

Jun 16 2021 @ 23:52PM
ధర్మసాగర్‌లో రైతు వేదికను ప్రారంభిస్తున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు, ఎమ్మెల్యే టి.రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా తదితరులు

తెలంగాణలో భూతద్దం పెట్టి వెతికినా బీడు భూమి కనిపించదు..
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
ధర్మసాగర్‌, వేలేరు మండలంలో రైతు వేదికల ప్రారంభం


ధర్మసాగర్‌ జూన్‌ 16: దేశంలోనే అద్భుతమైన పథకం ‘రైతుబంధు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో రైతు వేదికలను బుధవారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వేలేరు మండలం షోడషపల్లిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ రైతు సమ్మేళనంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.

కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి కోసం రైతుల ఖాతాలో నగదు జమ చే స్తోందని తెలిపారు. గతంలో ఎక్కడ చూసినా బీడు భూ ములు కనిపించేవని, పనులు లేక బతుకుదెరువు రైతు లు వలస వెళ్లేవారని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్‌ ఏడే ళ్ల పాలనలో తెలంగాణలో భూతద్దం పెట్టి వెతికినా బీడు భూములు కనిపించవని అన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రైతులు ఆలోచించి ముందుకుసాగితేనే వ్యవసాయం బలపడుతుందన్నారు రాష్ట్రంలో ఖాళీ భూమి కనిపించే పరిస్థితి లేదని, ఈ ఏడాది రభీ, ఖరీఫ్‌ పంటలు కలిపి కోటీ ఆరు లక్షల ఎకరాల్లో 3కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 63.25లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7805కోట్ల మేర రైతు బంధు నగదును జమ చేశామన్నారు. మనది వ్యవసాయానికి అనుకూలమైన రాష్ట్రమని, అన్నిరకాల  కూరగాయలు, పండ్ల పంటలు సాగవుతాయని తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రైతులకు కష్టం లేకుండా చేయాలనేదే సీఎం ఆలోచన అని అన్నారు. గతంలో రైతుల పరిస్థితి ఎలా ఉండేదో అందరూ గుర్తుచేసుకోవాలని కోరారు. కేసీఆర్‌ కృషితోనే దేవాదుల నుంచి రైతులకు సాగునీరు అందుతోందని తెలిపారు. గతంలో వ్యవసాయనికి ఏడు గంటల కరెంట్‌ ఇచ్చినప్పుడు మోటార్లు కాలిపోయి రైతులు ఇబ్బంది పడేవారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు.

వ్యవసాయనికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్‌ పలుమార్లు ప్రధానికి విన్నవించినా ఒప్పుకోవడం లేదన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు రైతువేదికలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఐకేపీ సెంటర్లను తొలగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండునెలల్లో ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో అన్ని అభివృద్ధి పనులను పూర్తిచేయాలని, పూర్తయిన పనులను అధికారులతో పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో నాలుగు చొప్పున మొత్తం ఎనిమిది ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేస్తామని తెలిపారు. ఉత్తమ జీపీలకు నిధులను మంజూరు చేస్తామని, పనులు పూర్తిచేయని గ్రామాలకు నిధులను ఇవ్వబోమని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అధ్యక్షత వహించగా రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఏనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, రైతు బంధు సమితి జిల్లా కోర్డినేటర్‌ లలిత,ఽ వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ సరిత, ధర్మసాగర్‌ ఎంపీపీ కవిత, జెడ్పీటీసీ శ్రీలత, వ్యవసాయ శాఖ అధికారులు ఉషాదయాళ్‌, పద్మ, సర్పంచ్‌లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Follow Us on: