రావణ రాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి

ABN , First Publish Date - 2021-04-22T06:09:56+05:30 IST

శ్రీరామ నవమి వేడుకలను బుధవారం రాజధాని రైతులు శిబిరాల్లో జరుపుకున్నారు. శిబిరాల్లో భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణం నిర్వహించారు.

రావణ రాజ్యం పోవాలి..  రామరాజ్యం రావాలి
వెంకటపాలెం రైతు శిబిరంలో జై అమరావతి అంటూ శ్రీరామ నవ మి నిర్వహిస్తున్న మహిళలు

నవమి వేడుకల్లో రైతుల నినాదాలు

491వ రోజుకు చేరిన అమరావతి ఆందోళనలు


తుళ్లూరు, తాడేపల్లి, ఏప్రిల్‌ 21: శ్రీరామ నవమి వేడుకలను బుధవారం రాజధాని రైతులు శిబిరాల్లో జరుపుకున్నారు. శిబిరాల్లో భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణం నిర్వహించారు. రావణ రాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి.., జై అమరావతి.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం బుధవారంతో 491వ రోజుకు చేరుకుంది. ఇళ్లల్లో వేడుకగా.. కుటుంబసభ్యుల మధ్య జరుపుకోవాల్సిన పండుగలను పాలకుల దయవల్ల ధర్నా శిబిరాలలో జరుపుకోవాల్సి వచ్చిందని రైతులు, మహిళలు వాపోయారు.  భూములు ఇచ్చిన  రైతులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం సిగ్గు చేటన్నారు. ఇన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తుంటే రైతుల సమస్యలు ఏమిటని పాలకులు ఇంత వరకు తమ వద్దకు వచ్చి అడిగింది లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందన్నారు. రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాయపూడి, తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, అనంతవరం, దొండపాడు, పెదపరిమి, మందడం, వెలగపూడి, నెక్కల్లు, ఐనవోలు, వెంకటపాలెం, తాడేపల్లి మండలం పెనుమాక తదితర గ్రామాల్లో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల దీక్షలు 491వరోజుకు చేరుకున్నాయి.


30న జూమ్‌ యాప్‌ ద్వారా సభ.. 

అమరావతి ఉద్యమం 500వ రోజుకు చేరుతున్న సందర్భంగా  ఈ నెల 30న జూమ్‌ యాప్‌ ద్వారా సభ నిర్వహిస్తామని  అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తెలిపారు. భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నామని అయితే కరోనా కారణంగా యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నట్టు  చెప్పారు. బుధవారం ఆయన రైతు శిబిరాలను సందర్శించి అమరావతి 500 రోజుల ఉద్యమ సభ గురించి వివరించారు. రైతులకు అండగా ఉండడానికి జాతీయ స్థాయి నాయకులు సామాజికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. యాప్‌ ద్వారా జరిగే సభను వీక్షించడానికి ఎంపిక చేసిన రైతు శిబిరాలలో స్ర్కీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీక్షా శిబిరాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. 

 

Updated Date - 2021-04-22T06:09:56+05:30 IST