ఒకే రాజధాని.. అదే అమరావతి

ABN , First Publish Date - 2021-04-23T05:35:19+05:30 IST

ఒకే రాజధాని.. అదే అమరావతి కావాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాజధాని రైతుల ఆందోళనలు గురువారం 492వ రోజుకు చేరుకున్నాయి.

ఒకే రాజధాని.. అదే అమరావతి

 రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలి

స్వార్ధ ప్రయోజనాల కోసం బలిచేయవద్దు

492వ రోజుకు రైతుల ఆందోళనలు

 

తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, ఏప్రిల్‌ 22: ఒకే రాజధాని.. అదే అమరావతి కావాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాజధాని రైతుల ఆందోళనలు గురువారం 492వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, మందడం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, ఐనవోలు, వెలగపూడి తదితర గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న అమరావతిని కాదని మూడు రాజధానులు అనడం అభివృద్ధిని అటకెక్కించడమే అన్నారు. పరిపాలనకు కావాల్సిన అన్నీ హంగులు అమరావతిలో ఏర్పడ్డాయన్నారు. ఇక్కడ ఐదేళ్ల నుంచి పాలన సాగుతుంటే మధ్యలో మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావవతిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి లాంటి భూములు ఇచ్చి అభివృద్ధి నిలిచిపోవటంతో మనోవేదనతో రైతులు మరణిస్తుంటే ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇంతకన్నా రాక్షసపాలన ఉందా.. అంటూ మండిపడ్డారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలుగించి నినాదాలు చేశారు. తాడికొండ మండలం మోతడక, నిడుముక్కల గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల దీక్షలు జరిగాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రైతులు నినాదాలు చేశారు.


Updated Date - 2021-04-23T05:35:19+05:30 IST