మాది న్యాయ పోరాటం

ABN , First Publish Date - 2021-06-15T05:48:39+05:30 IST

రాజధాని అమరావతి ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు అని రైతులు, మహిళలు పేర్కొన్నారు.

మాది న్యాయ పోరాటం
మోతడకలో నిరసన తెలుపుతున్న మహిళలు, రైతులు

అమరావతి ఆంధ్రుల హక్కు

545వ రోజుకు చేరుకున్న ఉద్యమం


తుళ్లూరు, తాడికొండ జూన్‌ 14: రాజధాని అమరావతి ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు అని రైతులు, మహిళలు పేర్కొన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా రాజధాని గ్రామాల్లో 545వ రోజు ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గడిచిన 18 నెలలుగా తాము ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రానికి ఒరిగేది ఏమిలేదని చెప్పారు.  అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పిన సీఎం జగన్‌ అధికారం వచ్చాక మాట మార్చారన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారే రాజధాని అమరావతికి భూములిచ్చారని ప్రచారం చేసి,  సీఎం జగన్‌, మంత్రులు నవ్వుల పాలయ్యారని అన్నారు. దళితులున్న ప్రాంతం రాజధాని కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ఎన్నో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక డంపింగ్‌ పేరుతో కృష్ణా కరకట్టను బలహీన పరిచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే కావాల్సినన్ని కంపెనీలు, జాతీయ సంస్థలు వచ్చేవన్నారు. వాటి ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి రాజధాని అమరావతిలోనే దొరికేదన్నారు. ఇప్పటికైనా సమ యం మించిపోయింది లేదు.. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అన్నారు. అమరావతి వెలుగులో భాగంగా దీపా లు వెలిగించి జై.. అమరావతి అంటూ నినాదాలు చేశారు.

 

Updated Date - 2021-06-15T05:48:39+05:30 IST