మూడు రాజధానులతో రాష్ట్రం అధోగతి

ABN , First Publish Date - 2021-06-17T05:42:12+05:30 IST

రాష్ట్ర వినాశనానికే మూడు రాజధానుల ప్రకటనను సీఎం చేశారని రైతులు, మహిళలు ఆరోపించారు.

మూడు రాజధానులతో రాష్ట్రం అధోగతి
మోతడకలో నిరసన తెలుపుతున్న మహిళలు, రైతులు

 547వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడికొండ, జూన్‌ 16: రాష్ట్ర వినాశనానికే మూడు రాజధానుల ప్రకటనను సీఎం చేశారని రైతులు, మహిళలు ఆరోపించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా   ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 547వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరావతిని తరలించటానికి ప్రభుత్వం రోజుకో కొత్త నాటకానికి తెరతీస్తుందన్నారు. అమరావతి కోసం రైతులకు మద్దతుగా దీక్ష చేస్తానని ప్రకటించిన పవన్‌కల్యాణ్‌ ఎందుకు దీక్షలు చేపట్టలేదని ప్రశ్నించారు. మూడు రాజధానులు చెయ్యాలంటే పార్లమెంట్‌లో చట్టసవరణ జరగాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో రైతులు ఇచ్చిన భూములలో పదివేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగి, రాష్ట్ర పాలన అంతా ఐదేళ్ల నుంచి ఇక్కడే జరుగుతుందని గుర్తుచేశారు.  చట్ట ప్రకారం అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. లేదంటే న్యాయదేవత ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు  ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు కాదని, జీవితానికి భరోసానిచ్చే ఉపాధి కావాలన్నారు. సంక్షేమ పధకాల పేరుతో కాలయాపన వద్దన్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే  వందల కంపెనీలు యువతకు ఉపాధి చూపేవన్నారు. మూడుముక్కల ఆట ఆపేసి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై.. అమరావతి నినాదాలు చేశారు.


 


 

Updated Date - 2021-06-17T05:42:12+05:30 IST