అమరావతితోనే రాష్ర్టాభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-03T05:52:35+05:30 IST

రైతుల గోడు పట్టించుకోని ఈ ప్రభుత్వం ఆ రైతులిచ్చిన భూములను ఎలా అమ్ముతుందని రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు ప్రశ్నించారు.

అమరావతితోనే రాష్ర్టాభివృద్ధి
వెంకటపాలెం శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

 928వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


తుళ్లూరు, జూలై2: రైతుల గోడు పట్టించుకోని ఈ ప్రభుత్వం ఆ రైతులిచ్చిన భూములను ఎలా అమ్ముతుందని రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు ప్రశ్నించారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు శనివారం 927వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అని, అధికారంలోకి రాగానే బ్రహ్మాండంగా కడతామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులకు అన్యాయం చేయాలని మూడుముక్కల ఆట ఆడుతున్నారని ఆరోపించారు. వందల రోజుల నుంచి రోడ్డుమీద కొచ్చి ఆందోళనలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి  చీమైనా కుట్టినట్టు అయినా లేదన్నారు. అమరావతి అభివృద్ధిని ఆపేస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని స్పష్టం చేశారు. అమరావతి ఆదాయ ఫలాలు రాష్ట్రానికి వచ్చేవని, సీఎం జగన్‌రెడ్డి తీరుతో అది లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.   

Updated Date - 2022-07-03T05:52:35+05:30 IST