అమరావతిని అవమానించడం తగదు

ABN , First Publish Date - 2022-10-02T05:43:27+05:30 IST

ఐదుకోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని అవమానిస్తున్న వారు పాలకులుగా ఉండే అర్హత లేదని రాజధానికి 33 వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

అమరావతిని అవమానించడం తగదు
వెంకటపాలెం శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

1019వ రోజుకు రైతుల ఆందోళనలు


తుళ్ళూరు, అక్టోబరు 1: ఐదుకోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని అవమానిస్తున్న వారు పాలకులుగా ఉండే అర్హత లేదని రాజధానికి 33 వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. ఆడవారని చూడకుండా అగౌరవంగా మాట్లాడుతున్న వారు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించటానికి అర్హులో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం  1019వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతి రైతులకు చేసిన అన్యాయానికి భవిష్యత్‌లో ఏ ఒక్క రైతు భూమిని ఇవ్వటానికి ముందుకు రాడని స్పష్టం చేశారు. మూడు  రాజధానుల పేరిట అమరావతిని నాశనం చేస్తున్నారన్నారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలని, లేదంటే పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం  నిర్వహించారు. 

అమరావతి ఉద్యమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్‌ఆర్‌ఐ తానా బోర్డు డైరెక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గత ఆదివారం  మరణించారు. తుళ్లూరు రైతు ధర్నా శిబిరంలో మహిళలు, రైతులు, రైతు కూలీలు శనివారం వారి మృతికి మౌనం వహించి నివాళి అర్పించారు. నాగేంద్ర శ్రీనివాస్‌కి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2022-10-02T05:43:27+05:30 IST