TS News: నేను రాజీనామ చేస్తున్నా అంటే కేసీఆర్ దిగి వచ్చారు: రాజగోపాల్

ABN , First Publish Date - 2022-08-08T16:38:52+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

TS News: నేను రాజీనామ చేస్తున్నా అంటే కేసీఆర్ దిగి వచ్చారు: రాజగోపాల్

హైదరాబాద్ (Hyderabad): రాష్ట్రంలో అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని, ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం (KCR Family) అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. తాను రాజీనామా చేస్తున్న అంటే సీఎం కేసీఆర్ (CM KCR) దిగి వచ్చారని, వెంటనే గట్టుప్పల్ మండలం అయ్యిందన్నారు. తన రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని, కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తారన్నారు. పడుకుంటే.. లేస్తే.. మునుగోడు ప్రజలు గుర్తుకు రావాలన్నారు.


తనను గెలిపించి ప్రజలు పాపం చేశారా?.. మునుగోడు నియోజకవర్గం అభివృద్ది కోసం సీఎం కేసీఆర్‌ను కలవాలని చూస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని రాజగోపాల్ అన్నారు. మునుగోడు ప్రజలపై ఉన్న నమ్మకంతో రాజీనామ చేసి తీర్పు కోరుతున్నానని, దైర్యం లేకపోతే తాను ఈ పని చేసే వాడిని కాదని అన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం, పేదలకు ఇళ్లు, పెన్షన్‌ల కోసమే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు సిరిసిల్ల సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇంకేం కనిపించడం లేదని విమర్శించారు. లక్ష రుణ మాఫీ ఏమైందని ప్రశ్నించారు. వరి కొనలేమని చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథలో రూ. 25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని, గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదన్నారు. స్పీకర్ తన రాజీనామాను ఆమోదిస్తారని అనుకుంటున్నానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-08T16:38:52+05:30 IST