‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌పై జ‌క్క‌న్న నిర్ణ‌యం..!

Jun 8 2021 @ 13:52PM

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’. ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ ఆగింది. దీంతో ఈ భారీ మూవీని ప్ర‌క‌టించిన తేదిలో విడుద‌ల చేయ‌డం క‌ష్ట‌మేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ త‌రుణంలో ‘ఆర్ఆర్ఆర్‌’ను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. 

ఈ నేప‌థ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. పెండింగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కావ‌డానికి త‌క్కువ‌లో త‌క్కువ‌ ఆరు నెల‌ల స‌మ‌యం కావాల‌ని రాజ‌మౌళి నిర్మాత‌ల‌కు, హీరోల‌కు చెప్పేశార‌ట‌. అంటే జూన్‌, జూలైలో షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టికీ ఏడాది చివ‌ర‌ల్లోనూ పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి మ‌రో రెండు మూడు నెల‌ల స‌మ‌యం తీసుకుని అన్నీప‌నుల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 28, 2022లో ‘ఆర్ఆర్ఆర్‌’ను విడుద‌ల చేస్తామ‌ని జ‌క్క‌న్న యూనిట్‌కు సూచించార‌ట‌. ఆ లెక్క‌లో ద‌ర్శ‌క‌ధీరుడు త‌న సినిమా రిలీజ్‌డేట్‌పై ఓ నిర్ణ‌యం తీసుకుని వ‌ర్క్ చేయ‌బోతున్నారని టాక్‌. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌, కోలీవుడ్‌కి చెందిన స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.