Rajinikanth: రజనీజీ! ఇదేం కిరికిరి?

ABN , First Publish Date - 2022-08-09T14:35:04+05:30 IST

రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్‌(Governor)తో సినీ రంగ ప్రముఖుడు రజనీ రాజకీయాలపై చర్చించడమేంటి?.. ఆ విషయాన్ని బాహాటంగా

Rajinikanth: రజనీజీ! ఇదేం కిరికిరి?

- గవర్నర్‌తో రాజకీయాలపై చర్చా?

- ఇందులో మతలబేంటబ్బా? 

- అన్ని పార్టీల్లో ఇదే టాక్‌  !


చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్‌(Governor)తో సినీ రంగ ప్రముఖుడు రజనీ రాజకీయాలపై చర్చించడమేంటి?.. ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటించడమేంటి?.. ప్రముఖుల మర్యాదపూర్వక భేటీలో రాజకీయాల ప్రస్తావన రావడం సహజమే అయినా, ఆ విషయాన్ని పనిగట్టుకుని రజనీ ఎందుకు ప్రచారం చేసుకున్నట్లు?.. ఢిల్లీలో జరిగిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో పాల్గొన్న రజనీకాంత్(Rajinikanth) వెంటనే గవర్నర్‌తో ఎందుకు భేటీ అయినట్లు?.. ఇందులో ఏదైనా మతలబుందా?.. కమలనాధుల వ్యూహం ప్రకారమే జరిగిందా?.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోనూ జరుగుతున్న చర్చ. డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే సూపర్‌స్టార్‌ హఠాత్తుగా గవర్నర్‌తో ఎందుకు భేటీ అయ్యారన్న దానిపై ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన రజనీ రెండు రోజులు అక్కడే వున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ(Prime Minister Modi)తో పాటు పలువురు సీనియర్‌ కేంద్రమంత్రులతోనూ భేటీ అయ్యారు. అనంతరం చెన్నై వచ్చిన రజనీ సోమవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి, 12.15 గంటలకు బయటకు వచ్చారు. అరగంటకు పైగా ఆయన గవర్నర్‌తో భేటీ అయినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖులు ఎంతో సన్నిహితంగా, ఆప్యాయంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. 


గవర్నర్‌కు అండ కోసమేనా?

నిజానికి గవర్నర్‌ వ్యవహారశైలి పట్ల డీఎంకేతో పాటు దాని మిత్రపక్షాలు సైతం తీవ్ర అసంతృప్తితో వున్నాయి. ప్రజా సంక్షేమం కోసం రూపొందించిన పలు బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో వున్నాయి. దీంతో తాము అనుకున్నది చేయలేకపోతున్నామని డీఎంకే నేతలు లోలోన రగిలిపోతున్నారు. దీనికి తోడు పలు వేదికలపై గవర్నర్‌ ద్రావిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కూడా డీఎంకే(DMK) నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. సహజంగా గవర్నర్‌ వ్యవహారాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆర్‌ఎన్‌ రవి తీరు పట్ల ప్రజల్లోనూ కొంత అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకి అని, సంక్షేమానికి ఉపయోగపడే బిల్లుల్ని ఉద్దేశపూర్వకంగా ఆయన పక్కన పెడుతున్నారన్న భావన ప్రజల్లో కనిపిస్తోంది. దీనిని సరిదిద్దేందుకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగానే కేంద్రం రజనీని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. నిజానికి మోదీతో పాటు బీజేపీ నేతలందరితో రజనీకున్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి సూచనల మేరకే రాజ్‌భవన్‌(Raj Bhavan) వెళ్లిన రజని గవర్నర్‌తో భేటీ అయినట్లు తెలిసింది. అనంతరం ఆయన మీడియా ఎదుట గవర్నర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లు గవర్నర్‌ చెప్పారని రజనీ కొనియాడారు. కశ్మీర్‌లో పుట్టి, ఉత్తరాదిన పెరిగిన గవర్నర్‌ ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లోని ఆధ్మాత్మిక భావనలకు బాగా ఆకర్షితులయ్యారని చెప్పారు. ఈ పొగడ్తలన్నీ ప్రజల్లో గవర్నర్‌ పట్ల ఏర్పడుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకేనని డీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేయడానికైనా గవర్నర్‌ సిద్ధంగా ఉన్నారనడం, రాష్ట్ర ప్రజల ఆధ్యాత్మిక భావనల పట్ల ఆయన బాగా ఆకర్షితులయ్యారనడం కూడా అందులో భాగమేనని వారు పేర్కొంటున్నారు. నిజానికి గవర్నర్‌తో భేటీ అయినప్పుడు ఏవైనా రాజకీయాల ప్రస్తావన వచ్చినా, ఎవరైనా అలాంటిదేమీ లేదనే మీడియా ముందు చెప్పడం సర్వసాధారణం. అలాంటిది రజనీ తాను రాజకీయాలపైనా గవర్నర్‌తో మాట్లాడానని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదంతా బీజేపీ వ్యూహమేనని డీఎంకే, వామపక్ష నేతలు లోలోన రగిలిపోతున్నారు. ఇప్పుడా రాజకీయాల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ మాట అన్నారా? లేక పొరపాటున నోరు జారారా అన్నదానిపై చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2022-08-09T14:35:04+05:30 IST