Corruption in Elections : రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.60 కోట్లు ఇస్తామన్నారు : రాజస్థాన్ మంత్రి

ABN , First Publish Date - 2022-08-03T17:07:44+05:30 IST

రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూధా (Rajendra Singh Gudha) ఇటీవల చెప్పిన

Corruption in Elections : రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.60 కోట్లు ఇస్తామన్నారు : రాజస్థాన్ మంత్రి

జోధ్‌పూర్ : రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూధా (Rajendra Singh Gudha) ఇటీవల చెప్పిన మాటలు మన దేశంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా విస్తరించిందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. ప్రజాసేవ చేస్తామంటూ ముందుకు వస్తున్నవారి నిజ రూపం ఆ మాటల్లో స్పష్టంగా వెల్లడవుతోంది. ఆయన చెప్పినది వాస్తవమైతే, పెద్దల సభగా గొప్ప గౌరవాన్ని పొందుతున్న రాజ్యసభలోకి ఎలాంటివారు ప్రవేశిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఆ మాటలు చాలు. 


రాజేంద్ర సింగ్ జూలై 1న ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ, దేశంలో అవినీతి గురించి ప్రస్తావించారు. ఆయన స్పందిస్తూ, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఓటు వేయాలని తనను కోరారని, అందుకు ప్రతిఫలంగా తనకు రూ.25 కోట్లు ఇస్తామని ఆశపెట్టారని తెలిపారు. ఈ విషయాన్ని తన భార్య, కుమార్తె, కుమారుడులతో చెప్పానని తెలిపారు. వారు ప్రతిస్పందిస్తూ ‘‘మనకు డబ్బు అక్కర్లేదు. (డబ్బుకు ఆశపడితే) పరువు, ప్రతిష్ఠలను కోల్పోవలసి వస్తుంది’’ అని చెప్పారన్నారు. ఓ అభ్యర్థికి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.60 కోట్లు ఇస్తామని కూడా ఆశపెట్టారన్నారు. ఈ విషయాన్ని కూడా తన భార్యాబిడ్డలకు చెప్పినపుడు, వారు అందుకు తిరస్కరించారని, డబ్బు కన్నా, గౌరవానికే ప్రాధాన్యమిచ్చారని అన్నారు. దేశ ప్రజలంతా ఇదే విధంగా ఆలోచిస్తే, దేశం బాగుపడుతుందని చెప్పారు. 


బీఎస్‌పీ టిక్కెట్‌పై గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది...

బీఎస్‌పీ టిక్కెట్‌పై గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో రాజేంద్ర ఒకరు. ఆయనకు అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ మంత్రివర్గంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి లభించింది.  ఈ విషయాల గురించి ఆయన 2021 నవంబరులో చెప్పిన మాటలతో ఓ వీడియో అప్పట్లో వైరల్ అయింది. 


‘‘నేను బీఎస్‌పీ టిక్కెట్‌ మీద ఎన్నికల్లో గెలిచాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రినయ్యాను. చాప చుట్టేసే పరిస్థితి వచ్చినపుడు కాంగ్రెస్‌ను వదిలేస్తాను’’ అని రాజేంద్ర అన్నట్లు ఆ వీడియోలో కనిపించింది. పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడ ఉన్నవారిని కోరినట్లు కనిపించింది. 


‘‘మొదట నేను సోదరి మాయావతి నుంచి టిక్కెట్ పొందాను. బీఎస్‌పీ ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రినయ్యాను. నా ఆటలో తప్పు ఏమైనా ఉందా?’’ అని అడిగారు. 


బాలీవుడ్ నటి బుగ్గల్లా రోడ్లు 

రాజేంద్ర అంతకుముందు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన గ్రామంలోని రోడ్లను, హేమ మాలిని బుగ్గల్లా కాకుండా, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గలంత నున్నగా తయారు చేయాలన్నారు. హేమ మాలిని వృద్ధురాలు అయిపోయిందన్నారు. 


ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, హుందాతనం లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. 


Updated Date - 2022-08-03T17:07:44+05:30 IST