రాజస్థాన్‌ అదుర్స్‌

ABN , First Publish Date - 2022-05-16T09:14:06+05:30 IST

టాప్‌-4లో నిలిచేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ తమ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఓ మాదిరి ఛేదనలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను బౌలర్లు

రాజస్థాన్‌ అదుర్స్‌

లఖ్‌నవూపై 24 రన్స్‌ తేడాతో విజయం


ముంబై: టాప్‌-4లో నిలిచేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ తమ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఓ మాదిరి ఛేదనలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో రాజస్థాన్‌ ఘనవిజయం సాధించింది. 16 పాయింట్లతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్న ఆర్‌ఆర్‌ రెండో స్థానంలో నిలిచింది. ముందుగా రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. జైస్వాల్‌ (41), దేవ్‌దత్‌ (39), శాంసన్‌ (32) ఆకట్టుకున్నారు. ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడింది. దీపక్‌ హుడా (59) అర్ధసెంచరీ సాధించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బౌల్ట్‌ నిలిచాడు.

బౌలర్ల హవా: లఖ్‌నవూ ఛేదనకు ఆరంభంలోనే పేసర్‌ బౌల్ట్‌ ఝలక్‌ ఇచ్చాడు. మూడో ఓవర్‌లో వరుస బంతుల్లో డికాక్‌ (7), బదోని (0)లను అవుట్‌ చేయగా, కెప్టెన్‌ రాహుల్‌ (10) ఆరో ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లేలో 34/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో దీపక్‌ హుడాతో కలిసి క్రునాల్‌ (25) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. నాలుగో వికెట్‌కు 65 రన్స్‌ జత చేశాక క్రునాల్‌ను అశ్విన్‌ అవుట్‌ చేశాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన హుడా కాసేపటికే చాహల్‌ ఓవర్‌లో స్టంపయ్యాడు. దీంతో లఖ్‌నవూ ఆశలు ఆవిరయ్యాయి. మెక్‌కాయ్‌ ఒకే ఓవర్‌లో హోల్డర్‌ (1), చమీర (0)ను అవుట్‌ చేయడంతో రాజస్థాన్‌ విజయం ఖాయమైంది.

జైస్వాల్‌, దేవ్‌దత్‌ జోరు: టాస్‌ గెలిచిబ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కకపోయినా.. ఆరంభంలో జైస్వాల్‌.. మధ్య ఓవర్లలో దేవ్‌దత్‌ ఆదుకున్నారు.  మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ బట్లర్‌ (2)ను పేసర్‌ అవేశ్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే శాంసన్‌తో కలిసి జైస్వాల్‌ రెండో వికెట్‌కు ఈ జోడీ 64 పరుగులు జత చేశాడు. శాంసన్‌ అవుటయ్యాక దేవ్‌దత్‌ పదో ఓవర్‌లో 4,6,4తో 15 రన్స్‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనూ రెండు ఫోర్లు బాదడంతో స్కోరు వంద దాటింది. కానీ స్వల్ప వ్యవధిలో జైస్వాల్‌, దేవ్‌దత్‌తో పాటు.. 18వ ఓవర్‌లో పరాగ్‌ (19), నీషమ్‌ (14) వెనుదిరిగారు. చివరి రెండు ఓవర్లలో బౌల్ట్‌ (17 నాటౌట్‌), అశ్విన్‌ (10 నాటౌట్‌) కాస్త జోరు పెంచారు. 

సంక్షిప్త స్కోర్లు

రాజస్థాన్‌: 20 ఓవర్లలో 178/6. (జైస్వాల్‌ 41, దేవ్‌దత్‌ 39, బిష్ణోయ్‌ 2/31)). లఖ్‌నవూ: 20 ఓవర్లలో 154/8. (దీపక్‌ 59, స్టొయినిస్‌ 27, బౌల్ట్‌ 2/18, ప్రసిద్ధ్‌ 2/32).

Updated Date - 2022-05-16T09:14:06+05:30 IST