లంచ్ బాక్స్‌ మొత్తం ఖాళీ చేశాకే ఇంటికి రావాలంటూ నవ్వుతూ పంపింది.. కానీ స్కూల్‌లో జరిగిన సంఘటనతో తల్లికి మైండ్ బ్లాంక్..!

ABN , First Publish Date - 2021-10-21T17:28:36+05:30 IST

స్కూల్‌కు టైం అవుతోందని..

లంచ్ బాక్స్‌ మొత్తం ఖాళీ చేశాకే ఇంటికి రావాలంటూ నవ్వుతూ పంపింది.. కానీ స్కూల్‌లో జరిగిన సంఘటనతో తల్లికి మైండ్ బ్లాంక్..!

ఇంటర్‌నెట్‌డెస్క్: స్కూల్‌కు టైం అవుతోందని గబగబా ఓ పక్క పిల్లాడిని రెడీచేస్తూ.. మరో పక్క  లంచ్ బాక్స్‌ను రెడీ చేసింది ఆ తల్లి. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేశాకే ఇంటికి రావాలంటూ ప్రేమతో హెచ్చరించింది. అలాగే అమ్మా.. అంటూ ఆ పిల్లాడు స్కూలుకు వెళ్లిపోయాడు. కానీ కొద్దిగంటల తర్వాత స్కూల్‌లో జరిగిన సంఘటన తెలిసి తల్లికి గుండె బద్దలైనంత పనైంది. అయ్యో.. ఎంత ఘోరం జరిగిందే అని కన్నీటిపర్యంతమైంది. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రం చురు జిల్లాలో జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే..


జిల్లాలోని సలసర్ పట్టణం కోలసర్ గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ శర్మ, రాజు దేవి దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్దకుమారుడు వినోద్, కూతురు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళుతుండగా, చిన్న కుమారుడు గణేష్(13ఏళ్లు) మోడ్రన్ పబ్లిక్ స్కూలుకు వెళుతున్నాడు. పాఠశాలలను ఇటీవలే పున:ప్రారంభించగా.. పిల్లలను మళ్లీ బడికి పంపిస్తున్నారు. బుధవారం కూడా ఎప్పటిలాగే ముగ్గురు పిల్లలను రెడీ చేసి రాజు దేవి పాఠశాలకు పంపించింది. గణేష్‌ అంటే.. రాజు దేవికి మరింత ప్రేమ. దీంతో ఆమె ప్రతిరోజూ స్కూల్‌కు పంపేముందు గణేష్‌తో ఓ మాట చెప్పేది. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేయాలి.. అప్పుడే ఇంటికి రావాలి అంటూ చెప్పేది. 



బుధవారం ఉదయం కూడా అలానే చెప్పి పంపించింది. కానీ స్కూల్‌కు వెళ్లిన పిల్లాడు చనిపోయాడని తెలియడంతో రాజు దేవికి గుండె ఆగినంత పనైంది. నవ్వుతూ స్కూలుకు వెళ్లిన పిల్లాడు.. ఉన్నట్టుండి చనిపోవడమేంటి అంటూ ఆమెకు ఏం అర్థం కాలేదు. భర్తను వెంటపెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. అప్పటికే రక్తమోడుతున్న గణేష్‌ను చూసి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.


ఏంమైందని అడగ్గా.. హోం వర్క్ చేయకపోవడంతో గణేష్‌ను రక్తం వచ్చేలా ఓ టీచర్ చావబాదాడని తెలిసింది. అతడి దెబ్బలకు తాళలేక గణేష్ స్పృహ తప్పిపోయాడు. ఓం ప్రకాశ్ పిల్లాడిని భుజాలపై ఎత్తుకుని ఆస్పత్రికి వెళ్లాడు. కానీ పిల్లాడు అప్పటికే చనిపోయాడని తెలియడంతో తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు.


ఓం ప్రకాశ్ మాట్లాడుతూ పెద్ద కుమారుడు వినోద్ కూడా అదే పాఠశాలలో చదువుకుని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నాడని, గణేష్‌ను కూడా వినోద్‌తో పాటు పాఠశాల మార్చి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని అన్నాడు. తన భార్య గణేష్‌ను ఎలాగైనా బతికించండి అని కోరుతోందని, తనకేం సమాధానం చెప్పాలో తెలియడం లేదన్నారు. గణేష్ మరణానికి కారణమైన టీచర్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. సోదరుడి మరణవార్త తెలిసి అన్న, అక్క బోరున విలపించారు. ఈ సంఘటనతో అదే పాఠశాలలో చదువుతున్న తోటి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భయం కలిగింది. ఆ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 



Updated Date - 2021-10-21T17:28:36+05:30 IST