
జైపూర్: గర్భిణి స్త్రీ మృతిపై తనమీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మనస్తాపం చెందిన ఒక మహిళా వైద్యురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం, డాక్టర్ అర్చనా శర్మ, ఆయన భర్త ఒక ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారు. ఆ క్లినిక్‌లో చికిత్స తీసుకుంటున్న గర్భిణి స్త్రీ మంగళవారంనాడు మృతి చెందింది. ఆ వెనువెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి వెలుపల ఆందోళనకు దిగారు. వైద్యురాలి నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమంటూ ఆమెపై చర్యకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లాల్సాట్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ అర్చనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో మనస్తాపం చెందిన అర్చన ఆసుపత్రి పైన ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు చేపట్టినట్టు దౌస అడిషనల్ ఎస్పీ లాల్ చంద్ కయల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి