Rajasthan Political Crisis: సీఎంలను మార్చబోయి బొక్కబోర్లాపడుతోన్న కాంగ్రెస్..

ABN , First Publish Date - 2022-09-26T23:59:26+05:30 IST

న్యూఢిల్లీ: రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరంతరం ఫెయిల్ అవుతూనే ఉంది.

Rajasthan Political Crisis: సీఎంలను మార్చబోయి బొక్కబోర్లాపడుతోన్న కాంగ్రెస్..

న్యూఢిల్లీ: రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరంతరం ఫెయిల్ అవుతూనే ఉంది. అనేకసార్లు ముఖ్యమంత్రులను మార్చబోయి బొక్కబోర్లా పడింది. పుదుచ్చేరి, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో గతంలో ముఖ్యమంత్రులను మార్చడంలో దెబ్బతిన్న కాంగ్రెస్ అధిష్టానం తాజాగా మరోసారి రాజస్థాన్‌లో ఫెయిల్ అయింది. 


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడ్తుండటంతో ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని అధిష్టానం అనుకుంది. అయితే ఈ ప్రక్రియ ఏ మాత్రం సజావుగా సాగడం లేదు. అశోక్ గెహ్లాట్ మద్దతుదారులంతా స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని భావిస్తుండగా అధిష్టానం సచిన్‌ పైలట్‌ వైపు మొగ్గుచూపుతోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగకపోగా సంక్షోభంగా తయారైంది. చివరకు జైపూర్ నుంచి సీన్ హస్తినకు చేరింది. 


గతంలోనూ అనేకసార్లు ఇలాగే జరిగింది. ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేతలను బుజ్జగించలేకపోతోంది. చివరకు వారంతా పార్టీ వదిలి వేరే పార్టీల్లో చేరుతున్నారు. సమర్థులైన నేతలంతా వేరే పార్టీలకు వెళ్తుండటంతో అధిష్టానం నిస్సహాయంగా చూడటం మినహా వేరేమీ చేయలేకపోతోంది.       


మధ్యప్రదేశ్‌లో 15 సంవత్సరాల విరామం తర్వాత 2017లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా కీలకపాత్ర పోషించారు. అయితే సింధియాను పక్కనపెట్టి సీనియర్ నేత కమల్‌నాథ్‌కు అధిష్టానం పట్టం కట్టింది. సరిగ్గా రెండేళ్లు గడిచాక సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ చేసి కేంద్ర మంత్రి అయ్యాడు. కమల్‌నాథ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయి పడిపోయింది. జ్యోతిరాదిత్య వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 


2008లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని తప్పించి వి.వైతిలంగమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంను చేసింది. 2011లో కాంగ్రెస్ పార్టీ వీడిన రంగస్వామి తర్వాత ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి బీజేపీ పొత్తుతో పుదుచ్చేరి సీఎం అయ్యారు. 


పంజాబ్‌లో ఈ ఏడాది ఆరంభంలో అమరీందర్ సింగ్‌ను సీఎం పీఠం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం చన్నీని సీఎంగా చేసింది. ఆ తర్వాత అమరీందర్ పార్టీ బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారు. చివరకు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోగా ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చింది. 


బీజేపీ అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎప్పటికప్పుడూ మారుస్తూ వస్తోంది. ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటకల్లో విజయవంతంగా ముఖ్యమంత్రులను మార్చి తిరిగి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియలో తమ పార్టీ నేతలందరినీ ఒప్పించుకుంటోన్న బీజేపీ అసంతృప్తులను దారిలోకి తెచ్చుకుంటోంది. అసంతృప్త నేతలెవ్వరూ పార్టీ వీడకుండా చూసుకుంటోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సమర్థులైన నేతలను నిలబెట్టుకోలేకపోతోంది. రాజకీయాల్లో పట్టువిడుపులుండాలి. ఇగోలు డామినేట్ కాకుండా చూసుకుంటే పార్టీలూ వర్ధిల్లుతాయి. 


Updated Date - 2022-09-26T23:59:26+05:30 IST