రాజస్థాన్‌ రాజసంగా...

ABN , First Publish Date - 2022-05-28T10:10:42+05:30 IST

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఐపీఎల్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఎలాంటి ఒత్తిడికీ తావీయకుండా ఆల్‌రౌండ్‌ షోతో చెలరేగిన ఈ జట్టు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును 7 వికెట్ల..

రాజస్థాన్‌ రాజసంగా...

ఫైనల్లో ప్రవేశం

బట్లర్‌ అజేయ శతకం

చిత్తయిన బెంగళూరు


క్వాలిఫయర్‌-1లో ఎదురైన భంగపాటును రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో క్వాలిఫయర్‌లో సరిచేసుకుంది. స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ సీజన్‌లో ఏకంగా నాలుగో శతకంతో విరుచుకుపడ్డాడు. ఆరంభం నుంచే మెరుపు ఆటతీరును కనబర్చిన ఆర్‌ఆర్‌ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ ఫలితాన్ని ఊహించేలా చేసింది. దీంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో నిరాశపరిచిన డుప్లెసీ సేనకు నిష్క్రమణ తప్పలేదు.


అహ్మదాబాద్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఐపీఎల్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఎలాంటి ఒత్తిడికీ తావీయకుండా ఆల్‌రౌండ్‌ షోతో చెలరేగిన ఈ జట్టు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును 7 వికెట్ల తేడాతో ఓడించింది. జోస్‌ బట్లర్‌ (60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 నాటౌట్‌) అజేయ శతకంతో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్థాన్‌ తలపడనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్‌ పటీదార్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) మాత్రమే రాణించాడు. ప్రసిద్ధ్‌, మెకాయ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. హాజెల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బట్లర్‌ నిలిచాడు. 2011 నుంచి లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచిన జట్టే ఫైనల్‌కు చేరుతుండడం విశేషం.


మెరుపు ఆరంభం: బట్లర్‌, జైశ్వాల్‌ (21) బాదుడుకు రాజస్థాన్‌ పవర్‌ప్లేలోనే 67 పరుగులు సాధించింది. అయితే వీరి దూకుడుకు ఆరో ఓవర్‌లో హాజెల్‌వుడ్‌ కాస్త బ్రేక్‌ వేస్తూ జైశ్వాల్‌ వికెట్‌ తీశాడు. బట్లర్‌కు.. శాంసన్‌ (23) జత కలవడంతో స్కోరు మరింత వేగంగా దూసుకెళ్లింది. అయితే హసరంగ ఓవర్‌లో ముందుకు వచ్చి ఆడిన శాంసన్‌ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. సమీకరణం 30 బంతుల్లో 32 రన్స్‌కు రాగా బట్లర్‌ 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 14 పరుగులు సాధించి ఛేదనను మరింత సులువు చేశాడు. ఇక 59 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసిన బట్లర్‌ 19వ ఓవర్‌ తొలి బంతిని సిక్సర్‌గా మలిచి రాజస్థాన్‌ను సంబరాల్లో ముంచెత్తి బెంగళూరుకు షాకిచ్చాడు.


చివర్లో బేజారు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను మరోసారి రజత్‌ పటీదార్‌  ముందుండి నడిపించాడు. అయితే రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి ఆఖరి ఐదు ఓవర్లలో 34 పరుగులే చేసిన బెంగళూరు ఐదు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్‌ కోహ్లీ (7) రెండో ఓవర్‌లోనే ప్రసిద్ధ్‌ చేతిలో అవుటవగా.. డుప్లెసీతో జత కట్టిన పటీదార్‌ ఆర్‌ఆర్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే పటీదార్‌ 13 రన్స్‌ వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను పరాగ్‌ వదిలేశాడు. ఇక 7 నుంచి 11వ ఓవర్ల మధ్య రెండు బౌండరీలు మాత్రమే రాగా డుప్లెసీ వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత మ్యాక్స్‌వెల్‌ (24)ను ఎక్కువసేపు క్రీజులో ఉండనీయకుండా 14వ ఓవర్‌లో బౌల్ట్‌ వెనక్కిపంపాడు. మరోవైపు పటీదార్‌ 40 బంతుల్లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ వేగంగా ఆడే క్రమంలో పటీదార్‌ అశ్విన్‌ వేసిన 16వ ఓవర్‌లో  బట్లర్‌కు లాంగాఫ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి నాలుగు ఓవర్లలో 25 పరుగులే చేసిన ఆర్‌సీబీ లొమ్రోర్‌ (8), దినేశ్‌ కార్తీక్‌ (6), హసరంగ (0) వికెట్లను కోల్పోయింది.  దీనికి తోడు చివరి ఓవర్‌లో మెకాయ్‌ 3 పరుగులే ఇచ్చి హర్షల్‌ (1) వికెట్‌ తీయడం తో ఆర్‌సీబీకి ఆశించిన స్కోరు లభించలేదు.


స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) శాంసన్‌ (బి) ప్రసిద్ధ్‌ 7, డుప్లెసీ (సి) అశ్విన్‌ (బి) మెకాయ్‌ 25, పటీదార్‌ (సి) బట్లర్‌ (బి) అశ్విన్‌ 58, మ్యాక్స్‌వెల్‌ (సి) మెకాయ్‌ (బి) బౌల్ట్‌ 24, లొమ్రోర్‌ (సి) అశ్విన్‌ (బి) మెకాయ్‌ 8, దినేశ్‌ (సి) పరాగ్‌ (బి) ప్రసిద్ధ్‌ 6, షాబాజ్‌ (నాటౌట్‌) 12, హసరంగ (బి) ప్రసిద్ధ్‌ 0, హర్షల్‌ (బి) మెకాయ్‌ 1, హాజెల్‌ వుడ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం 20 ఓవర్లలో 157/8 వికెట్లపతనం : 1/9, 2/79, 3/111, 4/130, 5/141, 6/146, 7/146, 8/154 బౌలింగ్‌ : బౌల్ట్‌ 4-0-28-1, ప్రసిద్ధ్‌ 4-0-22-3, మెకాయ్‌ 4-0-23-3, అశ్విన్‌ 4-0-31-1, చాహల్‌ 4-0-45-0 


రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) కోహ్లీ (బి) హాజెల్‌వుడ్‌ 21, బట్లర్‌ (నాటౌట్‌) 106, శాంసన్‌ (సి) దినేశ్‌ (బి) హసరంగ 23, పడిక్కళ్‌ (సి) దినేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 9, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం 18.1 ఓవర్లలో 161/3 వికెట్లపతనం : 1/61, 2/113, 3/148 బౌలింగ్‌ : సిరాజ్‌ 2-0-31-0, హాజెల్‌వుడ్‌ 4-0-23-2, మ్యాక్స్‌వెల్‌ 3-0-17-0, షాబాజ్‌ 2-0-35-0, హర్షల్‌ 3.1-0-29-0, హసరంగ 4-0-26-1.

Updated Date - 2022-05-28T10:10:42+05:30 IST