IPL 2022: సెంచరీ మిస్ చేసుకున్న మొయిన్ అలీ.. రాజస్థాన్ ఎదుట స్వల్ప లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-21T03:03:21+05:30 IST

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే

IPL 2022: సెంచరీ మిస్ చేసుకున్న మొయిన్ అలీ.. రాజస్థాన్ ఎదుట స్వల్ప లక్ష్యం

ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేసి, ప్రత్యర్థికి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై రెండు పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (1) వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ.. ఆ తర్వాత కూడా బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతడి దెబ్బతో పవర్ ప్లేలో 75 పరుగులొచ్చాయి.


అయితే, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే చెన్నై వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. డెవోన్ కాన్వే (16), జగదీశన్ (1), అంబటి రాయుడు (3) వికెట్లను చేజార్చుకుంది. ఫలితంగా అప్పటి వరకు టాప్ గేర్‌లో నడిచిన చెన్నై బ్యాటింగ్ ఒక్కసారిగా నెమ్మదించింది. మరోవైపు, రాజస్థాన్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో పరుగులు రావడం గగనమైంది. ధోనీ (26) కూడా నిరాశ పరిచాడు.


మరోవైపు, సెంచరీకి చేరువైన మొయిన్ అలీ.. మెక్‌కాయ్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు చిక్కి ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న మొయిన్ అలీ 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే రావడంతో చెన్నై స్కోరు 150 పరుగులకు పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, మెక్‌కాయ్‌కు చెరో రెండు వికెట్లు దక్కగా, బౌల్ట్, అశ్విన్‌ చెరో వికెట్ తీశారు.

Updated Date - 2022-05-21T03:03:21+05:30 IST