రాజధాని రోడ్డు.. వర్షమొస్తే నరకమే!

ABN , First Publish Date - 2021-11-17T05:46:15+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారికి ఎనహెచ-340సీగా హోదా కల్పించారు.

రాజధాని రోడ్డు..  వర్షమొస్తే నరకమే!
ప్రకాశం జిల్లా పరిధిలోని కేజీ రహదారి దుస్థితి ఇలా

  1. అధ్వాన్నంగా కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి
  2. ప్రకాశం జిల్లా పరిధిలో మరింత దారుణంగా పరిస్థితి
  3. నల్లమలలో వాహనదారుల ప్రమాదకర ప్రయాణం
  4. మంత్రి చెరుకువాడ రఘునాఽథరాజు హామీ ఏమైంది?


నల్లమలలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ప్రయాణం అంటే నరకయాతనే. మామూలు రోజుల్లోనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక వర్షం వస్తే అంతేసంగతులు. ఏ గుంత ఎంతలోతు ఉంటుందో తెలియని పరిస్థితి. వర్షపునీరంతా రోడ్డుకిరువైపులా గుంతల్లో నిలిచి ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తోంది. రెండు భారీ వాహనాలు ఎదురెదురుగా వచ్చాయంటే అంతే. వాహనాలు ఎక్కడ జారిపడి బోల్తా పడతాయోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఇది శ్రీశైలం, రాజధాని అమరావతికి వెళ్లే రోడ్డు కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. 


ఆత్మకూరు, నవంబరు 16:  గత ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారికి ఎనహెచ-340సీగా హోదా కల్పించారు. ఇందులో భాగంగా కేజీ రహదారి విస్తరణ, ఆధునికీకరణ ప్రక్రియ దిశగా అప్పట్లో వేగంగా అడుగులు పడ్డాయి. ప్రస్తుతం కేజీ రహదారి దుస్థితి దారుణంగా తయారైంది. పేరుకు జాతీయ రహదారి అయినా, ప్రయాణం అంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు నుంచి దోర్నాలకు వెళ్లేందుకు కేజీ రహదారిపై సుమారు 67 కి.మీ. ప్రయాణించాలి. ఇందులో రోళ్లపెంట ఘాట్‌ 27 కి.మీ. వరకు కర్నూలు జిల్లా పరిధిలో, మిగిలిన 40 కి.మీ. ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది. నల్లమలలోని నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం గుండా వెళ్లే కేజీ రోడ్డు అటవీ అనుమతుల లేని కారణంగా చాలా వరకు సింగిల్‌ లైనగా ఉండిపోయింది. ఉన్న ఈ చిన్నపాటి సింగిల్‌ లైన కూడా దెబ్బతినడంతో ఈ దారిన వెళ్లాలంటేనే వాహనదారలు భయపడుతున్నారు. 


అధ్వాన్నగా జాతీయ రహదారి

నల్లమలలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి అధ్వాన్నంగా మారింది. ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం దాటిన తర్వాత ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. వర్షాకాలంలో బురద గుంతలుగా, వేసవి దుమ్ము వెదజల్లుతూ ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వర్షపునీరు నిలిచి అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో  పరిస్థితి మరీదారుణంగా తయారైంది. రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడడంతో వాహనాల కిందికి దిగితే ఇక్కుపోయి ఒరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజు ఈ రోడ్డుపై రెండు మూడు వాహనాలు ఇరుక్కుపోయాయి. దీంతో వాహనదాలరు నానాతంటాలు పడ్డారు. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలన్నీ బురదలో మునిగితేలుతున్నాయి. దీంతో తప్పనిసరిగా వాటర్‌సర్వీసు ఖర్చులను భరించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్డును ఎప్పుడు బాగుచేస్తారోనని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. 


మల్లన్న భక్తులకు తీవ్ర అసౌకర్యం 

కేజీ రోడ్డు ప్రయాణం శ్రీశైల మల్లన్న భక్తులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. కార్తీక మాసం కావడంతో ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఆత్మకూరు మీదుగా భక్తులు తరలివెళ్తున్నారు. అటవీ మార్గంలో 67 కి.మీ. ప్రయాణం రెండు గంటలకు పైగా పడుతోంది. కర్నూలు నుంచి గుంటూరు, చీరాల, ఒంగోల్‌, రాజమండ్రి, కాకినాడ, మార్కాపురం, దోర్నాల, తుని, తణుకు, మాచర్ల, శ్రీశైలం తదితర ప్రాంతాలకు రాకపోకలలో తిప్పలు తప్పడం లేదు. బైక్‌లపై వెళ్లేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. కేజీ రోడ్డు ఇంత అధ్వాన్నంగా ఉన్నా సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లను బాగుచేసేందుకు నిధులు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి పురోగతి కనిపించడంలేదు. 


మంత్రి హామీ ఏమైంది..? 

సమస్యను పరిష్కరించాలని కోరుతూ జూలై 26న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధికార టీడీపీ ప్రతినిధి మోమిన ముస్తఫా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నల్లమలలోని కేజీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. అదేసమయంలో శ్రీశైలం నుంచి కర్నూలుకు వెళ్తున్న గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ రఘునాఽథరాజు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులతో ఆయనే స్వయంగా చర్చించారు. కేజీ రోడ్డు స్థితిగతులను సీఎం జగన దృష్టికి తీసుకెళ్లి రోడ్డును బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు నెలలు గడిచినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 

 శ్రీశైలానికి వెళ్లే భక్తుల ఇక్కట్లు పట్టవా..?

శ్రీశైలానికి నల్లమలలోని కేజీరోడ్డు మీదుగా రోజూ వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అయితే రోడ్డు అధ్వానంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అటవీ అనుమతుల పేరుతో దెబ్బతిన్న రోడ్డును కూడా బాగు చేయకుండా అధికారులు జాప్యం వహించడం సరికాదు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. 

- గరుడాద్రి సత్యనారాయణశర్మ, పురోహితుడు, ఆత్మకూరు


ప్రయాణం సాగడం లేదు

నల్లమలలో కర్నూలు-గుంటూరు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణమే ముందుకు సాగడం లేదు. ఆత్మకూరు నుంచి దోర్నాలకు గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డంతా గుంతలు పడడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. వాహనాలు ఇరుక్కుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. 

-ఆంజనేయులు, లారీ అసోసియేషన నాయకుడు, ఆత్మకూరు



 



Updated Date - 2021-11-17T05:46:15+05:30 IST