రాజేంద్ర బాలాజీ కోసం గాలింపు

ABN , First Publish Date - 2021-12-19T15:44:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని రూ.3 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో మాజీ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీని పట్టుకొనేందుకు ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఇందులో ఓ బృందం శనివారం

రాజేంద్ర బాలాజీ కోసం గాలింపు

               - కారు డ్రైవర్‌, సోదరి కుమారుల అరెస్టు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని రూ.3 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో మాజీ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీని పట్టుకొనేందుకు ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఇందులో ఓ బృందం శనివారం బెంగుళూరుకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పాడిపరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించిన రాజేంద్ర బాలాజీ ఆవిన్‌ మొదలైన ప్రభుత్వ పలు శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని పలువురిని నమ్మించి రూ.3 కోట్ల వరకు మోసానికి పాల్పడినట్ట్లు విరుదునగర్‌ జిల్లా క్రైం బ్రాంచ్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో, రాజేంద్ర బాలాజీ, బాబురాయ్‌, ముత్తుపాండ్యన్‌, బలరామన్‌లపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ రాజేంద్ర బాలాజీ సహా నలుగురు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం కొట్టివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజేంద్ర బాలాజీ పరారయ్యారు. ఈ నేపథ్యంలో, ఆయన సోదరి కుమారులు వసంతకుమార్‌, రమణన్‌, కారు డ్రైవర్‌ రాజ్‌కుమార్‌లను విరుదునగర్‌ జిల్లా ఎస్పీ మనోహరన్‌ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్ట్‌ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-12-19T15:44:18+05:30 IST