త్వరలో వారూ విడుదల?

ABN , First Publish Date - 2022-05-19T12:57:40+05:30 IST

రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులైన ఏడుగురిలో ఒకరిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మిగిలిన ఆరుగురు కూడా త్వరలోనే విడుదలయ్యే

త్వరలో వారూ విడుదల?

చెన్నై: రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులైన ఏడుగురిలో ఒకరిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మిగిలిన ఆరుగురు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. రాజీవ్‌ హత్య కేసులో పేరరివాలన్‌, నళిని, మురుగన్‌, శాంతను, రవిచంద్రన్‌, రాబర్ట్‌ ఫయాజ్‌, జయకుమార్‌ వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. నిజానికి ఈ కేసులో పేరరివాలన్‌తో పాటు 26 మందికి ఉరిశిక్ష విధిస్తూ టాడా కోర్టు 1998 జూలై 28న తీర్పు చెప్పింది. అయితే 1999లో సుప్రీంకోర్టు పలువురి శిక్షల్లో మార్పు చేసింది. శాంతను, మురుగన్‌, పేరరివాలన్‌, నళినిలకు మాత్రం ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే రాబర్ట్‌ ఫయాజ్‌, జయకుమార్‌, రవిచంద్రన్‌లకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మారుస్తూ, మిగిలిన 19 మంది శిక్షా కాలాన్ని తగ్గించింది. ఇదిలా ఉండగా 2000 సంవత్సరంలో నళిని ఉరిశిక్షను యావజ్జీవంగా మారుస్తూ నాటి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం తీర్మానం చేసింది. దాంతో  తమను కూడా ఉరిశిక్ష నుంచి తప్పించాలని కోరుతూ పేరరివాలన్‌, శాంతను, మురుగన్‌ రాష్ట్రపతికి కారుణ్యవిన్నపాలు చేశారు. ఆ అభ్యర్థన పెండింగ్‌లోనే వుండిపోయింది. కాగా అకారణంగా ముగ్గురి కారుణ్య పిటిషన్లను సుదీర్ఘకాలం పెండింగ్‌లో వుంచినందున వారి ఉరిశిక్ష  రద్దు చేస్తున్నట్లు జస్టిస్‌ సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2014లో ప్రకటించింది. అయితే సుమారు మూడు దశాబ్దాల పాటు తాము శిక్ష అనుభవించినందున భారతశిక్షాస్మృతిలో ఏ నేరానికీ ఇంతకాలం శిక్ష లేదని, అందువల్ల తమను విడుదల చేయాలంటూ పేరరివాలన్‌, నళిని నిత్యం న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పేరరివాలన్‌ ఎట్టకేలకు విజయం సాధించారు. దీంతో మిగిలిన వారు కూడా త్వరలోనే విడుదలవుతారని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైతం సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్ణంగా పరి శీలించాక, మిగిలిన ఆరుగురి విడుదలకు అవసరమైన చర్యలు చేపడతామని ప్రకటించడం గమనార్హం. ఇదిలా వుండగా పేరరి వాలన్‌ కేసుల్ని వాదిస్తున్న న్యాయవాదుల్లో ఒకరైన తమిళ్‌మణి మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తాజా తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేస్తే ఆరు గంటల్లోపే మిగిలిన ఆరుగురు విడుదలవుతారని వ్యాఖ్యానించారు. 

 

తమిళ పార్టీలకు ఎందుకంత పట్టు?

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీని పొట్టనబెట్టుకున్న దోషుల విడుదల కోసం తమిళ పార్టీలన్నీ ఎందుకంత పట్టుబట్టాయి?.. మన దేశ మాజీ ప్రధానిని హత్య చేశారని రుజువైన తరువాత కూడా వారి విడుదల కోసం కాంగ్రెస్‌ మినహా తమిళనాడులోని అన్ని పార్టీలు ఎందుకంతగా పరితపించాయి?.. ఇవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినవస్తున్న సందేహాలు. అయితే దీనిపై తమిళనాట రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. భారత్‌కు దక్షిణాన వున్న చిన్న దేశమైన శ్రీలంకలో సింహళీయులకు - తమిళులకు సుదీర్ఘకాలంగా ఆదిపత్యపోరు జరుగుతోంది. ఇది 1980 దశకంలో అంతర్యుద్ధానికి దారి తీసింది. వి.ప్రభాకరన్‌ నేతృత్వంలో ఏర్పాటైన లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) లంక సైన్యానికి పెను సవాల్‌గా మారింది. దీంతో ఆ దేశం భారత్‌ శరణుజొచ్చింది. ఆ మేరకు 1987 జూలై 29వ తేదీన నాటి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ మేరకు భారత్‌ నుంచి వెళ్లిన ‘ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌’ (ఐపీకేఎఫ్‌) శ్రీలంకలో మోహరించింది. భారత నుంచి వెళ్లిన శాంతి బలగాలు అక్కడి సైనిక కార్యకలాపాల్లో పాల్గొనబోవని ఒప్పందంలో పేర్కొన్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఐపీకేఎఫ్‌ బలగాలు ఎల్‌టీటీతో తలపడ్డాయి. అంతిమ ఫలితం ఏదైనప్పటికీ ఆ యుద్ధంలో భారత సైనికులతో పాటు ఎల్‌టీటీఈ సభ్యులు కూడా భారీగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత 1989-90 మధ్య కాలంలో భారత్‌ ఐపీకేఎఫ్‌ బలగాల్ని లంక నుంచి ఉపసంహరించుకుంది. లంకకు శాంతిసేనల్ని పంపడం వల్లనే అక్కడ వేలాదిమంది తమిళులు చనిపోయారని రాష్ట్రంలో అత్యధికులు గట్టిగా విశ్వసిస్తున్నారు. రాజీవ్‌ అనాలోచిత నిర్ణయం వల్లనే లంకలో ఎల్‌టీటీఈ బలహీనపడిందని, తమిళజాతి క్షీణించిందని ఇప్పటికీ రాష్ట్రంలో అత్యధికుల విశ్వాసం. ఆ కారణంగానే రాజీవ్‌పై ఎల్‌టీటీఈ కక్ష తీర్చుకుందని వాదిస్తున్న కొంతమంది, ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం రాజీవ్‌ హత్య కేసులో దోషులుగా తేలిన ఏడుగురూ కేవలం నిమిత్త మాత్రులని, రాజీవ్‌ హత్య గురించి వారికేమాత్రం తెలియదని వాదిస్తున్నారు. ఎవరో ఏదో సాయం అడిగితే చేయడం తప్ప, రాజీవ్‌ను హత్య చేస్తారన్న విషయం వారికి తెలియదని, అలాంటప్పుడు అమాయకులైన వారిని ఎలా శిక్షిస్తారన్నది మరికొంతమంది వాదన. అందుకే కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ రాజీవ్‌ హత్య కేసు దోషుల్ని బయటపడేసేందుకు పోటీ పడ్డాయి. తాము వారికి అండగా వున్నామన్న విషయం బయటికి తెలిసేలా వ్యవహరించాయి. రాజీవ్‌ హత్య కేసు దోషుల విడుదల ప్రయత్నంలో ప్రస్తుత అధికార డీఎంకే ముందంజలో వుంది. ఆ పార్టీ బహిరంగంగానే ఈలం తమిళులకు మద్దతు పలికింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే 494వ హామీలో రాజీవ్‌ హత్యకేసు దోషులను విడుదల చేయిస్తామని స్పష్టం చేయడం గమనార్హం. ఎల్‌టీటీఈ పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరిచే అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం రాష్ట్ర ప్రజల భావోద్వేగాలకు తలొంచక తప్పలేదు. ఆమె కూడా రాజీవ్‌ హత్య కేసు దోషుల విడుదల వ్యవహారంలో తనవంతు ప్రయత్నం చేశారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తీర్మానం ప్రకారం, రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా వున్న ఏడుగురినీ విడుదల చేస్తున్నట్లు 2014 ఫిబ్రవరి 19న నాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఇలా డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు ఎవరికి వీలైనంతగా వారు దోషుల్ని విడుదల చేసేందుకు, చేయాల్సిందంతా వంతులవారీగా చేశారు. బుధవారం పేరరివాలన్‌ను విడుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగానే తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలుచోట్ల తమిళ ఉద్యమకారులు మిఠాయిలు పంచుతూ, బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.

Updated Date - 2022-05-19T12:57:40+05:30 IST