
వడోదర: అహ్లాదకర వైరుధ్యాల భూమి భారతదశమని, దేశంలోని వైరుధ్యం భిన్న విశ్వాసాలను పాటించే ప్రజల మధ్య ఎన్నడూ ఎలాంటి విభేదాలకు తావీయలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్థానిక స్వామినారాయణన్ ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సొంత సంస్కృతి, చరిత్రను అవగాహన చేసుకుని, దానిని పదిలపరుచుకోనంత వరకూ ఏ నాగరికత కూడా గొప్ప నాగరికత అనిపించుకోదని అన్నారు.
ఇవి కూడా చదవండి
''మన దేశంలోని వైరుధ్యం ఎప్పుడూ విభేదాలకు కారణం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు భిన్న విశ్వాసాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్న ఏకైక దేశం మనదే. ఈ గడ్డపై 72 తెగల ముస్లింలు ఉన్నారు. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక స్థాయిలో ముస్లిం తెగలు ఇక్కడే ఉన్నారు. ప్రపంచంలోనే అతి పురాతన చర్చి కూడా ఇక్కడే ఉంది'' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అహ్లాదకర వైరుధ్యాల నేల ఇదని, ఇదే మన సంస్కృతికి వెన్నెముక అని శ్లాఘించారు. యువత నూతన జీవనవిధానాలను అక్కున చేర్చుకుంటున్న విధంగానే మన సంస్కృతీ వారసత్వాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వడోదర సిటీలోని కరెలిబాగ్ ప్రాంతంలో స్వామినారాయణ్ ఆలయం నిర్వహిస్తున్న 'సంస్కార్ అభయ్‌డే శివిర్'లో యువ భక్తులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా నిర్వహకులు రాజ్‌నాథ్‌ను ఆహ్వానించారు.