సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Nov 29 2021 @ 14:45PM

న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది. 


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపిస్తారు. 


వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఓ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబరు 19న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. 


రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ స్పందిస్తూ, ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు ఇది నివాళి అని పేర్కొన్నారు. ఈ చట్టాలను రద్దు చేసినప్పటికీ, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సమస్య పెండింగ్‌లోనే ఉందని, అందువల్ల తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.