Venkaiah Naidu : 15 రోజుల్లో ఉపరాష్ట్రపతి పదవీకాలం పూర్తి.. వెంకయ్యనాయుడు ఒక్కసారైనా ఈ నిబంధన అమలు చేయరా..

ABN , First Publish Date - 2022-07-26T23:19:30+05:30 IST

ఉపరాష్ట్రపతి(Vice president) ఎం.వెంకయ్యనాయుడి( Venkaiah Naidu ) పదవీకాలం ఆగస్టు 10న పూర్తవ్వనుంది.

Venkaiah Naidu : 15 రోజుల్లో ఉపరాష్ట్రపతి పదవీకాలం పూర్తి.. వెంకయ్యనాయుడు ఒక్కసారైనా ఈ నిబంధన అమలు చేయరా..

న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి(Vice president) ఎం.వెంకయ్యనాయుడి( Venkaiah Naidu ) పదవీకాలం ఆగస్టు 10న పూర్తవ్వనుంది. అంటే ఇంకా 15 రోజులు మాత్రమే ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఐదేళ్లపాటు రాజ్యసభ చైర్మన్‌గా సభను సమర్థవంతంగా నడిపించారని ఆయన పేరు పొందారు. సభ పని గంటలు ఇందుకు నిదర్శంగా ఉన్నాయి. అయితే ఆయనను విమర్శలపాలు చేస్తున్న అంశం ఒకటుంది. అదే రూల్ 267. దీని కింద ఒక్కసారి కూడా కొత్త అంశంపై చర్చను చేపట్టలేదంటూ ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఈ నిబంధనను పాటించకపోవడం దారుణమంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రూల్ 267 అంటే ఏమిటి? ఈ నిబంధన ఏం చెబుతుంది? ప్రతిపక్ష పార్టీలు వెంకయ్యనాయుడిని ఎందుకు విమర్శిస్తున్నాయో ఒక లుక్కేద్దాం...


రూల్ 267 చెబుతున్నదిదే..

సభ ప్రొసీడింగ్స్ ప్రకారం.. సభలో ఆ రోజు చర్చించే అంశాలు ముందుగానే నమోదయ్యి(లిస్టెడ్) ఉంటాయి. వీటిని ‘సభ బిజినెస్ అంశాలు’గా వ్యవహరిస్తారు. అయితే వేరే కొత్త అంశంపై చర్చ మొదలుపెట్టాలనుకుంటే అప్పటికే లిస్టయిన అంశాలను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు వీలు కల్పిస్తున్నదే ‘రూల్ 267’. ఈ నిబంధన కింద సభకు చెందిన ఏ సభ్యుడైనా సభాపతికి నోటీసు ఇవ్వవచ్చు. అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడమనేది సభాపతి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈ రూల్ కింద చివరిసారిగా 2015లో ఒకసారి, 2016లో ఒకసారి చర్చలు జరిగాయి. అప్పుడు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఇక పార్లమెంట్ రికార్డుల ప్రకారం.. రూల్ 267 కింద 2016 నవంబర్ 16న నోట్ల రద్దుపై చర్చ జరిపారు. అంతకుముందు 23 ఏప్రిల్ 2015న వ్యవసాయ సంక్షోభంపై చర్చ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు రూల్ 267 కింద చర్చ జరగలేదు. 


ధరల పెరుగుదలపై చర్చకు నిరాకరణ..

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి పలువురు ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చినా తిరస్కరణకు గురయ్యాయి. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రూల్ 267 కింద సోమవారం నోటీసులు ఇచ్చారు.కొత్త అంశంపై చర్చకు సభాపతి వెంకయ్య నాయుడు అంగీకరించకపోవడంపై విపక్షాలు విమర్శలకు దిగాయి. ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా రూల్ 267 కింద చర్చకు అవకాశమివ్వారా అంటూ ప్రశ్నిస్తున్నాయి. మరో 15 రోజుల వ్యవధిలో పదవి నుంచి దిగిపోనున్నారని వెంకయ్యనాయుడికి గుర్తుచేస్తున్నాయి. అయితే సభను సజావుగా సాగనిస్తే అన్నీ అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చెబుతున్నారు.


వెంకయ్య నాయుడు ఆగస్టు 11, 2017 నుంచి రాజ్యసభ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. రూల్ 267 కింద చర్చకు విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేసినా వాటిని ఆయన తిరస్కరించారు. రాఫెల్ ఒప్పందం, జీఎస్టీ అమలు, ధరల పెరుగుదల, పెగాసస్ వ్యవహారం, విద్వేష ప్రసంగాలు, దళితులు, మైనారిటీలపై దాడులపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీల ఎంపీలు కోరారు. కానీ ఈ విజ్ఞప్తులను వెంకయ్యనాయుడు పట్టించుకోలేదు. గతేడాది వర్షకాల సమావేశాల్లో పెగాసస్ ఆరోపణలపై చర్చించాలని తృణమూల్ ఎంపీ సుఖేందు కోరారు. దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ..  ‘‘ మీ పాయింట్ ఏంటో మీరు చెప్పారు. దీనిపై మేము జీపీసీ(జనరల్ పర్పస్ కమిటీ)లో చర్చించాలి’’ అని సమాధానమిచ్చారు. రూల్ 267 కింద వేర్వేరు అంశాలపై రోజుకు 10-15 నోటీసులు అందుతుంటాయని వెంకయ్య చెప్పారు.

Updated Date - 2022-07-26T23:19:30+05:30 IST