ప్రజల రక్తాన్ని పీల్చి సొమ్ము దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటా?

ABN , First Publish Date - 2022-05-22T09:04:42+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీని ఓడగొట్టేందుకే వేల కోట్లున్న హెటిరో పార్థసారఽథిని రాజ్యసభ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

ప్రజల రక్తాన్ని పీల్చి సొమ్ము దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటా?

  • ఆ సీటు అమరుల కుటుంబాలకు ఎందుకివ్వలేదు?
  • రాష్ట్రంలో బిజినెస్‌ పాలన నడుస్తోంది: జగ్గారెడ్డి


హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని ఓడగొట్టేందుకే వేల కోట్లున్న హెటిరో పార్థసారఽథిని రాజ్యసభ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రజల రక్తాన్ని పీల్చి సొమ్ములు దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటా అంటూ ప్రశ్నించారు. పార్థసారధి ఆస్తులపై ఐటీ దాడులు జరిగితే రూ.500 కోట్లు దొరికాయని, అలాంటి వ్యక్తిని రాజ్యసభకు ఎలా పంపుతున్నారని నిలదీశారు. తనను తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒకరు అన్నారని, ఆ రాజ్యసభ సీట్లను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజా పాలన జరగట్లేదని, బిజినెస్‌ పాలన నడుస్తోందన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టీఆర్‌ఎస్‌ పార్టీ.. విలువలను వదిలేసిందని విమర్శించారు. కరోనా సమయంలో రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ను తయారు చేసిన హెటిరో సంస్థపై ఐటీ దాడులు జరిగితే రూ.500 కోట్లు దొరికాయని, కనపడని రూ. వేల కోట్లు ఇంకా ఉన్నాయన్నారు.  టీఆర్‌ఎస్‌ వాళ్లు డబ్బులన్నీ పార్థసారధి దగ్గరే పెట్టి ఉంటారని, ప్రొటోకాల్‌.. సెక్యూరిటీ కోసమే ఆయన్ను రాజ్యసభకు పంపుతున్నారని ఆరోపించారు. హెటిరో సంస్థ ఉత్పత్తి చేసే రెమిడెసివర్‌ ధర రూ. 3,500 అయితే.. దాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ అమ్మారని ఆరోపించారు. రెమిడెసివర్‌ స్కాంలో రూ. వేల కోట్లు చేతులు మారాయని ఆయన అన్నారు. 


అసద్‌.. మెదక్‌లో పోటీ చేసే దమ్ము నీకుందా? 

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై తాను పోటీ చేసి గెలుస్తానని, ఆయనకు మెదక్‌లో పోటీ చేసే దమ్ము ఉందా అని జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ మినహా మరో పార్లమెంటు స్థానం లో పోటీ చేసి గెలిచే దమ్ము అసదుద్దీన్‌కు లేదన్నారు. రైతుల కోసం తెలంగాణకు వచ్చిన రాహుల్‌గాంధీపై సవాల్‌ చేయాల్సిన అవసరం అసదుద్దీన్‌కు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఇందిరాగాంధీ రాష్ట్రానికి వస్తుంటే ఎన్టీఆర్‌ లాంటి వాళ్లే వెళ్లి స్వాగతం పలికారని, అలాంటిది ప్రధాని మోదీ హైదరాబాద్‌ వస్తుంటే.. ఏ ధైర్యంతో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లుంటారని సందే హం వ్యక్తం చేశారు. ప్రధాని అనుమతితోనే కేసీఆర్‌ హరియాణాకు వెళ్లుంటారని, వారిద్దరివీ అవగాహనా రాజకీయాలని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. పోలీసు కమిషనర్‌ చెంప పగలగొట్టినా పౌరుషం లేని బండి సంజయ్‌.. జనాన్ని కాపాడతారా? అని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-05-22T09:04:42+05:30 IST