YSRCPలో రాజ్యసభ ఫైట్.. అన్నీ ఫిక్స్ కానీ.. నాలుగోస్థానంపైనే అందరి ఆశలు.. ఎవరికి దక్కుతుందో..!

ABN , First Publish Date - 2022-03-12T17:23:40+05:30 IST

కులాలవారీగా లెక్కలు వేయడంలో ఏసీ సీఎం జగన్‌ మాంఛి ఎక్స్‌పర్ట్‌. ప్రతి విషయాన్ని కులం తూకంలో కొలిచి ఆ మేరకే ముందుకు వెళుతుంటారు. తాగాజా రాజ్యసభ

YSRCPలో రాజ్యసభ ఫైట్.. అన్నీ ఫిక్స్ కానీ.. నాలుగోస్థానంపైనే అందరి ఆశలు.. ఎవరికి దక్కుతుందో..!

వైసీపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు అసంతృప్తిని రాజేస్తోందా? ఏపీకి సంబంధం లేని వ్యక్తులను ఎంపికచేయడంపై ఆ పార్టీ నేతలు లోలోప రగిలిపోతున్నారా? గతంలో తాము చేసిన విమర్శలకు, ప్రస్తుతం తాము చేస్తున్న పనులకు పొంతన లేదని జనానికి మొహం ఎలా చూపించాలని ఆవేదన చెందుతున్నారా... అసలు రాజ్యసభ సీట్లపై వైసీపీలో జరుగుతున్న రచ్చేంటి..? జగన్‌ మైండ్‌లో ఉన్న క్లారిటీ ఏంటి..? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


లెక్కలు వేయడంలో సీఎం జగన్‌ మాంఛి ఎక్స్‌పర్ట్‌..

కులాలవారీగా లెక్కలు వేయడంలో ఏసీ సీఎం జగన్‌ మాంఛి ఎక్స్‌పర్ట్‌.  ప్రతి విషయాన్ని కులం తూకంలో కొలిచి ఆ మేరకే ముందుకు వెళుతుంటారు. తాగాజా రాజ్యసభ సభ్యుల ఎంపికలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతారని తెలుస్తోంది. జూన్‌ 21తో ఏపీ నుంచి నలుగురి రాజ్య సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఇందులో ఒకటి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి కాగా మరో రెండు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన ఎంపీలవి, మరొకటి టీడీపీ సాయంతో నామినేట్ అయిన బీజేపీ ఎంపీది. వైసీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, సాంకేతికంగా బీజేపీ ఎంపీలుగా కొనసాగుతన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు రిటైర్ కాబోతున్నారు. రాష్ట్రం నుంచి ఈ నాలుగు ఎంపీ స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. దీంతో కొత్త సభ్యుల ఎంపిక కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికల ముందు టిక్కెట్లు ఇవ్వలేకపోయిన నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ హామీలిచ్చారు. 


ఇప్పటికే ఎమ్మెల్సీస్థానాలను భర్తీ చేయగా.. ఇప్పుడు రాజ్యసభ వంతు వస్తోంది.  పార్టీ నిర్ణయాలు, సామాజిక వర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటున్న పలుపురు నేతలు తమకు ఛాన్స్ రాదని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఐతే కొందరు మాత్రం తమస్థానం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభపై ఆసక్తి ఉంది. సీఎం జగన్ ఒప్పుకోవాలేగానీ టీటీడీ పదవి వదిలేసి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఇలా రాజ్యసభ సభ్యత్వంపై ఆసక్తి చూపుతున్న పెద్దలకు వైసీపీలో కొదవలేదు. 


జగన్‌, విజయసాయిరెడ్డి మధ్య కొంత గ్యాప్... 

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే మరోసారి విజయసాయిరెడ్డి తన పదవి పదిలం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్‌ ఆంతరంగికుల్లో ఒకరైన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వ్యవహారాలను చక్కపెడుతన్నారు. ఇటీవల కొంత గ్యాప్‌ పెరుగుతోందనే వార్తలు వచ్చినా అవేవీ నిజం కాదంటున్నారు. తాజాగా ఆయనను వైసీపీలోని అన్ని విభాగాలకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీంతో విజయసాయి సేవలను పార్టీకి పరిమితం చేస్తారని, ఆయనస్థానంలో రాజ్యసభకు మరొకరిని పంపుతారనే గుసగుసలు వినిపించాయి. కానీ పార్టీ సమన్వయంతోపాటు రాజ్యసభ పదవిని కంటిన్యూ చేయడానికి జగన్‌ మొగ్గు చూపుతున్నారిన వైసీపీ వర్గాల ఇన్‌సైడ్‌ టాక్‌. 


అదానీ సతీమణి ప్రీతి అదానీని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు జగన్‌ అంగీకారం

ఏపీలో పరిశ్రమల ఏర్పాటు సంగతి ఎలా ఉన్నా, పారిశ్రామికవేత్తలకు పదవులు కట్టబెట్టడంలో జగన్‌ ముందుంటున్నారు. గతంలో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్‌ అంబాని సీఎం నివాసానికి వచ్చి మరీ తన సహచరుడు పరిమళ్‌ నత్వానికి రాజ్యసభ సభ్యత్వం కోరడం జగన్‌ దానికి అంగీకరించడం చకాచకా జరిగిపోయాయి. తాజా రాజ్యసభ సీట్లలోనూ ఒక సీటును మరో పారిశ్రామిక దిగ్గజం ఆదానీ కుటుంబానికి కేటాయించనున్నారని తెలుస్తోంది. అదానీ సతీమణి ప్రీతి అదానీని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టిన జగన్‌ రాజ్యసభ సభ్యత్వంపై కూడా సానుకూలంగానే ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారని సమాచారం. సహజంగా జాతీయపార్టీలు తమ రాజ్యసభ అభ్యర్థులను ఆయా రాష్ట్రాలనుంచి పంపుతుంటాయి. అయితే వైసీపీ లాంటి ప్రాంతీయపార్టీలు పొరుగు రాష్ట్రాలవారికి పెద్దపీట వేయడం చర్చనీయాంశమవుతోంది. 


టీజి వెంకటేశ్‌ నియామకాన్ని తప్పు పట్టిన వైసీపీ

గతంలో ఏపీతో ఎటువంటి సంబంధం లేని జైరామ్‌ రమేష్‌ను ఏపీ నుంచి రాజ్యసభకు పంపితే ఆయన ఏపీ విభజన బిల్లులో కీలకపాత్ర పోషించారు. తాను ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రం గొంతు కోశారు. పక్క రాష్ట్రం వ్యక్తులను ఎంపిక చేస్తే వారికి మన ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. అయినా గతంలో ఏపీకే చెందిన పారిశ్రామికవేత్త టీజి వెంకటేశ్‌ నియామకాన్ని వైసీపీ తప్పు పట్టింది. మరి అదే తప్పు వైసీపీనిర్భయంగా చేయడంపై విమర్శలు రేగుతున్నాయి. ఇప్పటికే అదానీకి గంగవరం, కృష్ణపట్నం పోర్టులను కట్టబెట్టారు. కారుచౌకగా విశాఖ ఉక్కును అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పోనీ అదానీ ఏపీలో ఏమైనా పరిశ్రమలు పెట్టారా అంటే అదీ లేదు. ఎవరికీ ఉపాధి కల్పించడమూ లేదు. అయినా అదానీ అడిగారు... జగన్‌ ఇచ్చేశారు అనే తరహాలో రాజ్యసభ సీటు కట్టబెట్టడానికి సిద్ధమవుతుండటంపై వైసీపీ వర్గాలు లోలోప కుమిలిపోతున్నాయిట. 


రాజ్యసభ సీటు సినీనటుడు అలీకి కన్ఫామ్‌..

ఇక మిగిలిన రెండు స్థానాలలో ఒకసీటును మైనార్టీ వర్గాలకు కేటాయించనున్నారు. కొంతకాలంగా మైనార్టీలకు వైసీపీలో తగిన ప్రాధాన్యం దక్కలేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ సీటును మైనార్టీలకు ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలని జగన్‌ యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ సీటు సినీనటుడు అలీకి కన్ఫామ్‌ అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు వక్ఫ్‌బోర్డు పదవి ఇస్తారనే ఊహాగానాలు షికారు చేసినా, సాంకేతికంగా అలీకి వక్ఫ్‌బోర్డు పదవికి అవకావం లేదని తెలిసింది. 


నాలుగో స్థానం కోసం కాపు, ఎస్సీ,ఎస్టీ వర్గానికి ఛాన్స్

జగన్‌ లెక్కలను అర్థం చేసుకున్న వైసీపీ నేతలు మిగిలిన నాలుగో సీటు కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాగాపోటీ పడుతున్నారు. తొలి నుంచి వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సభ్యత్వమే కోరుకుంటున్నారు. కానీ ఆయనను రెండోసారి కూడా టీటీడీ చైర్మన్‌ చేసి ఆయనకు దాదాపుగా రాజ్యసభతలుపులు మూసేశారని చెపుతున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన రాజ్యసభకోసం ప్రయత్నిస్తున్నారని చెపుతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కోరుకుంటున్నట్టు చెపుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గ కోటాలో విజయసాయిరెడ్డి కొనసాగడం ఖాయం కాబట్టి వీరిద్దరికి ఛాన్స్‌ ఉండదంటున్నారు. మరో పక్క ఈ నాలుగోసీటుకు ఉత్తరాంధ్ర నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణకు రాజ్యసభకు పంపే అవకాశం ఉందంటున్నారు. ఇదీ కాకపోతే 

నాలుగో స్థానం కోసం కాపు లేదా ఎస్సీ - ఎస్టీ వర్గా నికి అవకాశం దక్కవచ్చనీ అంటున్నారు. ఈనాలుగోవ్యక్తిగా జగన్‌ ఎవరిని ఎంపికచేస్తారనే విషయమే వైసీపీలో హాట్‌ టాపిక్‌ అవుతోంది.

Updated Date - 2022-03-12T17:23:40+05:30 IST