తెలంగాణ బీజేపీ నుంచి రాజ్యసభకు ఒకరికి అవకాశం.. ఆ అదృష్టవంతులెవరో..

ABN , First Publish Date - 2022-05-24T19:22:18+05:30 IST

తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్‌ ప్రకటించింది. పార్టీ బలోపేతంపై హైకమాండ్‌ సీరియస్‌ ఫోకస్ పెట్టింది.

తెలంగాణ బీజేపీ నుంచి రాజ్యసభకు ఒకరికి అవకాశం.. ఆ అదృష్టవంతులెవరో..

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్‌ ప్రకటించింది. పార్టీ బలోపేతంపై హైకమాండ్‌ సీరియస్‌ ఫోకస్ పెట్టింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒకరికి అవకాశం లభించనుంది. ఉత్తరాది రాష్ట్రాల కోటా నుంచి ఎంపిక చేశారు. పరిశీలనలో మురళీధర్‌రావు, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి పేర్లున్నట్టు తెలుస్తోంది. నామినేషన్లకు తుది గడువు ఈ నెల 30 వరకూ ఉంది. ఈ ముగ్గురిలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ తెలంగాణలో బీజేపీ నుంచి నేరుగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన వారెవరూ లేరు. ఒకవేళ ఈ ముగ్గురిలో ఎవరైనా ఎన్నికైతే వీరే ప్రథమం అవుతారు. 


జూపల్లికి రాజ్యసభ..?

మరోవైపు తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావుపై కమలనాథులు దృష్టి పెట్టారు. ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సమతామూర్తి ప్రారంభోత్సవం సమయంలో ఆయనకు, సీఎం కేసీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జూపల్లికి, కేసీఆర్‌కు పొసగడం లేదని భావిస్తున్న బీజేపీ వర్గాలు ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ఖాయమని చెబుతున్నాయి. ఆయన సేవలను పార్టీకి ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభకు నామినేట్‌ చేసే ప్రతిపాదన కూడా వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీజేపీ ఆకర్ష్‌ ప్రయత్నాలకు రామేశ్వరరావు ఎటువంటి వైఖరి తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-05-24T19:22:18+05:30 IST