అందరూ ఏకగ్రీవమే?

ABN , First Publish Date - 2022-05-31T13:57:56+05:30 IST

రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. అన్నాడీఎంకే తరఫున పోటీ చేయనున్న మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ధర్మర్‌, కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ సీనియర్‌

అందరూ ఏకగ్రీవమే?

- కాంగ్రెస్‌, అన్నాడీఎంకే అభ్యర్థుల నామినేషన్‌

- పూర్తయిన రాజ్యసభ ఎన్నికల తొలిఘట్టం


చెన్నై: రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. అన్నాడీఎంకే తరఫున పోటీ చేయనున్న మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ధర్మర్‌, కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రానికి చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యులు ఆర్‌ఎస్‌ భారతి, టీకేఎస్‌ ఇళంగోవన్‌, కేఆర్‌ఎన్‌ రాజేష్ కుమార్‌, అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు నవనీతకృష్ణన్‌, ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణియన్‌, ఎ.విజయకుమార్‌ పదవీ కాలం జూన్‌ నెలాఖరుతో ముగియనుండడంతో ఆ ఆరు స్థానాల భర్తీకి జూన్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి డీఎంకే నాలుగు సీట్లను, ప్రధాన ప్రతిపక్షం రెండు సీట్లను సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. డీఎంకే తన ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్ కు ఒక సీటు కేటాయించి తక్కిన మూడింటికి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ మేరకు డీఎంకే తరఫున కల్యాణసుందరం, కేర్‌ఎన్‌ రాజేష్ కుమార్‌, గిరిరాజన్‌ ఇప్పటికే నామినేషన్లు సమర్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అన్నాడీఎంకే తరఫున సీవీ షణ్ముగం, ధర్మర్‌ సచివాలయంలో ఎన్నికల నిర్వహణాధికారి, శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్‌కు నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, మాజీ మంత్రి వేలుమణి, కేపీ మునుసామి తదితరులు పాల్గొన్నారు.


చిదంబరం నామినేషన్‌...

కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం కూడా సోమవారం నామినేషన్‌ను వేశారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి, నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీచిదంబరం, సీఎల్పీనేత సెల్వపెరుందగై, ఎమ్మెల్యే విజయతరణి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు చిదంబరం సీఎం స్టాలిన్‌ను కలుసుకుని తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ, డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు చిదంబరం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి మద్దతు ప్రకటి స్తూ నామినేషన్‌ పత్రంలో పదిమంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి వుంటుంది. ఆ నామినేషన్లను మాత్రమే అంగీకరిస్తారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల వీరుడు పద్మరాజన్‌ సహా మరికొంతమంది ఇండిపెండెంట్లు సమర్పించిన నామినేషన్లలో పదిమంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో ఆ నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. దీంతో పోటీలో ఉన్న ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఖాయమైపోయింది.  

Updated Date - 2022-05-31T13:57:56+05:30 IST