రక్ష – శిక్ష

ABN , First Publish Date - 2022-02-18T06:16:02+05:30 IST

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు సైతం సిగ్గుపడే స్థాయిలో బ్యాంకులను 23వేల కోట్ల రూపాయల మేరకు ముంచేసిన ఏబీజీ షిప్ యార్డ్ కుంభకోణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలహించుకుంటున్నాయి...

రక్ష – శిక్ష

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు సైతం సిగ్గుపడే స్థాయిలో బ్యాంకులను 23వేల కోట్ల రూపాయల మేరకు ముంచేసిన ఏబీజీ షిప్ యార్డ్ కుంభకోణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలహించుకుంటున్నాయి. ఈ గుజరాతీ కంపెనీ వ్యవహారం గురించి ఏళ్ళక్రితమే తాము హెచ్చరించినా మోదీ ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ విమర్శిస్తే, సదరు కంపెనీ ఎదుగుదలలూ, ఎగవేతలూ అన్నీ మీ హయాంలోనివేనంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తున్నది. భారీ కాంట్రాక్టులతో, బ్యాంకు రుణాల పునర్వ్యవస్థీకరణతో ఈ కంపెనీని కాంగ్రెస్ ఏ రీతిన కాపాడుకొచ్చిందో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఏబీజీ మోసాన్ని సకాలంలో గుర్తించడమే కాదు, సత్వర చర్యలకు ఉపక్రమించామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు. ఏబీజీ వెలుగులోకి వచ్చిన తరువాత ఈ స్థాయి రుణాల ఎగవేతలూ, భారీ కుంభకోణాలు ఇంకెన్ని వినవలసివస్తుందోనన్న భయం కలుగుతున్నది.


ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చైర్మన్ రిషి కమలేశ్ అగర్వాల్‌ను సీబీఐ గురువారం ప్రశ్నించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణాన్ని ఈ కంపెనీ చెల్లించలేదంటూ 2019 నవంబరులోనే సీబీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తే, మరుసటి ఏడాది మార్చిలో మరిన్ని వివరాలు ఇవ్వమని అడిగింది సీబీఐ. ఆగస్టులో మరోమారు ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. ఏడాదిన్నరపాటు సీబీఐ దానిని క్షుణ్ణంగా పరిశీలించి ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్నికలకాలం కోసమేమో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం అడుగులు వేగంగానే పడుతున్నాయి. లుక్ ఔట్ నోటీసులతో పాటు, కంపెనీకీ, నిందితులకు సంబంధించిన డజనుకుపైగా స్థావరాల్లో సీబీఐ సోదాలు జరిపింది. కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈడీ సైతం విరుచుకుపడింది. 2012 నుంచి ఐదేళ్ళపాటు కంపెనీ కార్యకలాపాలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, కంపెనీ ప్రమోటర్లంతా కుమ్మక్కై రుణాలను దారిమళ్లించినట్టు గుర్తించింది. 2016 జూలైలోనే బ్యాంకుల కన్సార్షియం ఏబీజీ రుణాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఐదేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. బీజేపీ తన పాలనలో అస్మదీయులకోసం ‘దోచుకో, పారిపో’ పథకాన్ని ఆరంభించిందనీ, మోదీ హయాంలో ఐదున్నర లక్షలకోట్ల రూపాయల బ్యాంకు మోసాలు జరిగాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది.


పదహారు సంవత్సరాల్లో 160పైగా నౌకలను నిర్మించిన ఓ కంపెనీకి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని దుస్థితి ఉంటుందా? కేవలం రెండు కోట్ల రూపాయల షిప్ యార్డు లీజు మొత్తాన్ని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఈ కంపెనీ కట్టనందుకూ, అయినా దానికి ఉదారంగా సహకరిస్తున్నందుకూ గుజరాత్ మారిటైమ్ బోర్డును 2014లో కాగ్ చీవాట్లు పెట్టింది. చిన్న మొత్తమే కానీ ఇది ఆ కంపెనీ డైరక్టర్ల స్వభావానికి మచ్చుతునక. ఇప్పుడు పరస్పరం కలహించుకుంటున్న పార్టీలు అప్పట్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంటూ ఈ కంపెనీకి పోటీపడి మరీ సేవలందించాయి. కంపెనీ కార్యకలాపాల విస్తరణకు, వసతుల కల్పనకు ఏళ్ళతరబడి లీజులతో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే, కేంద్ర ప్రభుత్వం భారీ రక్షణ కాంట్రాక్టులు కట్టబెట్టింది. కోస్టుగార్డు, నేవీ కోసం ఈ కంపెనీ మరపడవలూ, నౌకలూ చివరకు జలాంతర్గామిని కూడా నిర్మించింది. 2012లో కంపెనీ ఆర్డర్ల విలువ పదహారువేల కోట్ల పైమాటే. అనతికాలంలోనే మూడు షిప్ బిల్డింగ్ యార్డులు ఏర్పాటు చేసుకొని, అంతర్జాతీయ కాంట్రాక్టులు కూడా అందుకుంది. పాలకుల ఆశీస్సులతో వేగంగా ఎదిగింది, భారీగా రుణాలు తీసుకోగలిగింది, వాటిని నిర్భయంగా ఎగ్గొట్టగలిగింది. దేశ ప్రజల సొమ్మును కుబేరులు ఇలా అవలీలగా దిగమింగడానికి రాజకీయ నాయకుల నుంచి బ్యాంకు ఉన్నతాధికారుల వరకూ అందరూ కారకులే. రుణాలు చెల్లించకున్నా వాటిని రీస్ట్రక్చర్ చేస్తూ, మరిన్ని లోన్లు ఇస్తూ చివరకు పద్దుపుస్తకాల్లో చెరిపేస్తూ బ్యాంకులు ఇతోధికంగా సహకరించాయి. చిన్నపాటి లీజుమొత్తాన్ని కూడా నిర్లజ్జగా ఎగవేసిన ఓ కంపెనీకి వేలకోట్ల రక్షణరంగ కాంట్రాక్టులు ఇస్తూ, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్లలో భారీ రాయితీలూ కల్పిస్తూ ప్రభుత్వాలు సహకరించాయి. ఈ దేశంలో రక్షలే కానీ, శిక్షలుండవన్న ‌ధైర్యం ఎంతటి పాపాన్నయినా చేయిస్తుంది.

Updated Date - 2022-02-18T06:16:02+05:30 IST