రక్షణ లేని ప్రయాణం

ABN , First Publish Date - 2022-05-26T06:39:09+05:30 IST

అరకులోయ ఘాట్‌రోడ్డులో పలు చోట్ల రక్షణ గోడలు శిథిలం కావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

రక్షణ లేని ప్రయాణం
గాలికొండ, సుంకరమెట్ట మధ్యలో శిథిలమైన రక్షణ గోడ

 అరకులోయ ఘాట్‌రోడ్డులో రక్షణ గోడలు శిథిలం

- తరచూ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు శూన్యం

- జాతీయ రహదారి 516ఈ పరిధిలోకి వెళ్లడంతో పట్టించుకునే నాథుడు కరువు

- ఆర్‌ అండ్‌ బీ ఆధీనంలో ఉన్నప్పుడూ అదే తీరు


---

అందాల అరకులోయను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు. అయితే అరకులోయ ఘాట్‌రోడ్డులో రక్షణ గోడలు శిథిలంకావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడంతో వాహనచోదకులు భీతిల్లుతున్నారు.

-----


అరకులోయ, మే 25: అరకులోయ ఘాట్‌రోడ్డులో పలు చోట్ల రక్షణ గోడలు శిథిలం కావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు కొండ, మరో వైపు లోయ ఉండే ఈ రహదారిలో ఏ మాత్రం అజాగ్రత్తగా ప్రయాణించినా రక్షణ గోడలు శిథిలమైన కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా అనంతగిరి, బీసుపురం, గాలికొండ, సుంకరమెట్ట మధ్యలో ఎక్కువ మలుపులు ఉంటాయి. ఈ మార్గంలో ఇరవై ఏళ్ల క్రితం రక్షణ గోడలు నిర్మించారు. కొన్ని సంవత్సరాలుగా పలు రకాల వాహనాలు రక్షణ గోడను ఢీకొనడం, వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల శిథిలావస్థకు చేరాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

జాతీయ రహదారి 516ఈ పరిధిలోకి..

గత ఏడాది ఈ ఘాట్‌ రోడ్డును జాతీయ రహదారి 516ఈ పరిధిలోకి రావడంతో దీని నిర్వహణను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. రాజమహేంద్రవరం నుంచి చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులు కొత్తభల్లుగుడ వరకు శరవేగంగా సాగుతున్నాయి. అయితే కొత్తభల్లుగుడ నుంచి చిలకలగెడ్డ వరకు పనులు జరగడం లేదు. కాగా చిలకలగెడ్డ నుంచి బొడ్డవర, గంట్యాడ మీదుగా విజయనగరానికి పనులు జరుగుతున్నాయి. కొత్తభల్లుగుడ నుంచి చిలకలగెడ్డ వరకు పనులు జరగకపోయినా కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. బీసుపురం- గాలికొండ, సుంకరమెట్ట- గన్నెల జంక్షన్‌, కొత్తభల్లుగుడ వరకు రక్షణ గోడలు శిథిలమయ్యాయి. గన్నెల జంక్షన్‌- కొత్తభల్లుగుడ మధ్యలో ఓ మలుపు వద్ద రక్షణగోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు కొన్నేళ్ల క్రితం ఈ మలుపు వద్ద పెద్ద బండరాళ్లు పెట్టించారు. ఇప్పటి వరకు అక్కడ రక్షణ గోడ నిర్మించలేదు. 

గాలికొండ వ్యూ పాయింట్‌ వద్ద..

గాలికొండ వ్యూ పాయింట్‌ మలుపు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పర్యాటక సీజన్‌ ప్రారంభమైతే ప్రతీ పర్యాటకుడు తమ వాహ నాన్ని గాలికొండ వ్యూ పాయింట్‌ వద్ద నిలిపివేసి అక్కడి అందాలను ఆస్వాదిస్తూ గడుపు తాడు. ఇలా వాహనాలు ఇరుకుగా ఉన్న గాలికొండ వ్యూ పాయింట్‌ మలుపు వద్ద నిలిపి ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య తీవ్రంగా ఉన్నా ఆర్‌ అండ్‌ బీ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఈ రహదారి మలుపు విస్తరణపై అధికారులు దృష్టి పెట్టలేదు. అలాగే రక్షణ గోడల మరమ్మతులకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఘాట్‌ రోడ్డు హైవే అఽథారిటీ పరిధిలోకి వచ్చినా చర్యలు శూన్యం. జిల్లా అధికారులు ఘాట్‌రోడ్‌ విస్తరణ పనులు చేపట్టకపోయినా కనీసం మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-26T06:39:09+05:30 IST