తప్పంటే.. రాక్షసులేనా?

ABN , First Publish Date - 2020-03-01T05:49:34+05:30 IST

కొన్ని పత్రికలు, న్యూస్‌ చానెళ్లు రాక్షసులుగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిట్టిపోయడం మొదలెట్టారు. తొమ్మిది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా జగన్‌...

తప్పంటే.. రాక్షసులేనా?

కొన్ని పత్రికలు, న్యూస్‌ చానెళ్లు రాక్షసులుగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిట్టిపోయడం మొదలెట్టారు. తొమ్మిది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా జగన్‌ మీడియాను తిట్టిపోశారు. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ ధోరణి పెరుగుతోంది. గిట్టని న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. రాజకీయ పార్టీల అధినేతలు సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇతర మీడియాను టార్గెట్‌ చేయడం ఆనవాయితీగా మారింది. పత్రికల్లో ఏ చిన్న వార్త వచ్చినా మీడియా సంస్థల అధిపతులను నిందించడం పరిపాటి అయ్యింది. గిట్టని పత్రికలకు వ్యాపార ప్రకటనలు ఇవ్వకపోవడం హక్కుగా అధికారంలో ఉన్నవారు భావిస్తున్నారు. మీడియా సంస్థలు విమర్శలకు అతీతం కాకపోయినా, రాజకీయ పార్టీలు సహనం కోల్పోయి మీడియాకు కులం, రాజకీయం పులుముతుండటం తెలుగునాట అధికంగా ఉంటోంది. ఒకప్పుడు మీడియాలో అవాస్తవ వార్తలొస్తే ఆయా ప్రభుత్వాలు వివరణలు పంపేవి. ఇప్పుడు అలా కాకుండా ఎదురుదాడికి దిగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ రెండోపర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ప్రధాన పత్రికలకు వ్యాపార ప్రకటనలు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి కూడా ఇదే విధానాన్ని అమలుచేస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘‘ఆ రెండు పత్రికలు...’’ అని నిందించినప్పటికీ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడలేదు.


ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇందుకు విరుద్ధంగా కక్ష సాధింపు మార్గాన్ని ఎంచుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిననాడే మీడియా పట్ల తనకున్న అక్కసు బయటపెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా మీడియాను రాక్షసులుగా అభివర్ణించారు. అధికారంలోకి రాకముందు కూడా ఆయనకు స్థానిక మీడియా పట్ల చిన్నచూపు ఉండేది. ఈ కారణంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పర్యాయం కూడా తెలుగు మీడియాతో ఆయన మాట్లాడలేదు. తాను అధికారంలోకి రావడానికి గానీ, అధికారంలో కొనసాగడానికి గానీ తన సొంత మీడియా చాలు.. ఇతర మీడియా అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన మీడియా ద్వారా భారీ ఎత్తున ఉన్నవి, లేనివి ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందారు. ఇప్పుడు తనది కాని మీడియాను విలన్లుగా చిత్రించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొన్ని న్యూస్‌ చానెళ్లను భయపెట్టి లొంగదీసుకోగా, తన దారిలోకి రావనుకున్న చానెళ్ల ప్రసారాలను నిలిపివేయించారు. జగన్మోహన్‌రెడ్డి నిందిస్తున్నట్టుగా స్థానిక మీడియా నిజంగా ఉన్మాదంగా వ్యవహరిస్తోందా? అదే నిజమైతే జాతీయ మీడియా కూడా జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలను అడుగడుగునా తప్పుబడుతోంది కదా? తాజాగా ఆయన తీసుకుంటున్న అవకతవక నిర్ణయాలను అంతర్జాతీయ మీడియా కూడా ఆక్షేపిస్తోంది కదా? స్థానిక మీడియాకు పచ్చరంగు పులుముతున్న అధికార పార్టీ నాయకులు దీనికి ఏమి చెబుతారు? అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేసిన కియ మోటార్స్‌ సంస్థ తమిళనాడుకు తరలిపోవాలని భావిస్తున్నట్టు ఆ మధ్య రాయిటర్స్‌ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించగా.. అదంతా చంద్రబాబు నాయుడు కుట్ర అని నిందించారు.


రాయిటర్స్‌ సంస్థను ప్రభావితం చేయగల శక్తి చంద్రబాబుకు ఉంటుందా? అసంభవం! అయినా గతమెంతో ఘన చరిత్ర కలిగి.. వర్తమానంలో కాలం చెల్లిన ఒక వృద్ధ జర్నలిస్ట్‌ కూడా రాయిటర్స్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారన్న అభిప్రాయం బలపడేలా తన వ్యాసంలో వ్యాఖ్యలు చేశారు. కియ మోటార్స్‌ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ దక్షిణ కొరియాకు చెందిన ట్రేడ్‌ ప్రమోషన్‌ అథారిటీ చైర్మన్‌ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు. దీన్నిబట్టి జగన్‌ ప్రభుత్వం కియ మోటార్స్‌ సంస్థను ఇబ్బందిపెడుతున్న విషయం నిజమేనని రుజువు అవుతోంది కదా! తప్పు జరిగినప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవలసిన పాలకులు బుకాయించడం వల్ల రాష్ట్రానికి నష్టమే గానీ లాభం ఉండదు. రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు రాకుండా మీడియా దుష్ప్రచారం చేస్తున్నదనీ, ఉన్నవి తరలిపోయేలా వ్యవహరిస్తున్నదనీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాజాగా నిందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఒక్క సంస్థతోనైనా జగన్మోహన్‌రెడ్డి ఈ తొమ్మిది నెలల్లో చర్చించారా? అదానీ, టాటా గ్రూపులను తరిమికొట్టింది ప్రభుత్వం కాదా? భవిష్యత్తులో కూడా ఏపీలో అడుగుపెట్టబోమని లులు గ్రూప్‌ ప్రకటించిన విషయం నిజం కాదా? ఇందులో మీడియా తప్పు గానీ పాత్రగానీ ఏముంది? ప్రభుత్వం అంటే తన సొంత కంపెనీ అన్నట్టుగా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నందువల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించింది.


ఈ తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పకుండా మీడియాను నిందించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కుంభకోణం ఉందన్న దిక్కుమాలిన అనుమానంతో ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే రాష్ట్రం పట్ల పెట్టుబడిదారుల్లో విముఖత ఏర్పడిందే గానీ మీడియా వల్ల కాదు! సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించాలన్న నిర్ణయాన్ని జగన్మోహన్‌రెడ్డి తీసుకున్నారే గానీ మీడియా సూచించలేదు కదా? ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో తప్పుబట్టడానికి, మీడియాకు సంబంధం ఏమిటి? ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకున్న చందంగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే అనర్థాలన్నీ జరుగుతున్నాయి. రాజధాని అమరావతిని శ్మశానంగా, ఎడారిగా పోల్చిన తర్వాత ఆ వ్యతిరేక ప్రభావం పెట్టుబడిదారులపై పడదా? రాజధానికి భూములిచ్చిన రైతులపై కూడా కక్షగా వ్యవహరిస్తూ, రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్‌రెడ్డి కాదా? ఇందులో మీడియా పాత్ర ఎక్కడ? పుండు మీద కారం చల్లినట్టుగా రైతులను మరింత మనోవ్యథకు గురిచేయడానికే ఇటువంటి నిర్ణయాలు దోహదపడతాయని విమర్శించకుండా ఎవరైనా ఎందుకుంటారు? మంత్రులు అన్నట్టుగా ఎడారిలోనో, శ్మశానంలోనో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే పేదలకు మాత్రం ఏమి ఉపయోగం? దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న దాదాపు అన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావడమే కాకుండా హైకోర్టులో కేసులు దాఖలవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో న్యాయ వ్యవస్థకు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తారేమో తెలియదు. ‘ఆత్మస్తుతి.. పరనింద’ ఎంతో కాలం సాగదు.


...కేరాఫ్‌ వంచన!

తాను ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే, అసూయతో, కడుపు మంటతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది జగన్మోహన్‌రెడ్డి అభిప్రాయం. ఉద్దేశం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్‌ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల ఓట్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో దాదాపు పది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పసుపు–కుంకుమ పేరిట పంచిపెట్టారు. అయినా ప్రతికూల ఫలితమే వచ్చింది కదా? ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రకటించి అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు వంచనతో కూడినవి కాగా, మరికొన్ని నిరుపయోగం కాబోతున్నాయి. అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేసి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. జగనన్న విద్యా వసతి దీవెన పథకాన్ని తీసుకుందాం. ఎప్పటినుంచో అమలులో ఉన్న స్కాలర్‌షిప్పులు, మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీల చెల్లింపులవంటివన్నీ నిలిపివేసి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఏడాదికి ఒకేసారి నగదు చెల్లింపు చేయడం వల్ల ఆ సొమ్ము దుర్వినియోగం అవుతుందే గానీ విద్యార్థులకు ఉపయోగపడదు. గతంలో ప్రభుత్వాలు నెలవారీగా మెస్‌ చార్జీలు విడుదల చేసేవి. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి చెల్లిస్తే.. అవి ఇతర అవసరాలకు వాడేసుకుంటే పిల్లలకు తిండి సమకూరేది ఎలా? అమ్మ ఒడి పథకం కింద చెల్లించిన సొమ్మును ఇప్పటికే ఇతరత్రా అవసరాలకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కుడి జేబులో నుంచి తీసుకొని ఎడమ జేబులో పెట్టడం వల్ల తాత్కాలికంగా మభ్యపెట్టవచ్చునేమో గానీ, దీర్ఘకాలంలో ప్రజలు వాస్తవాలు గుర్తించకుండా ఉంటారా? సంతర్పణల జాతర కొనసాగించడం వల్ల ఇటు రాష్ట్రం ఆర్థికంగా కుదేలవడమే కాకుండా, ప్రజలను కూడా సోమరులను చేసినవాళ్లు అవుతారు.


పథకాల వెనుక దురుద్దేశాలు ఉండటం వల్లనే ప్రజలలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. అధికారంలో ఉన్నవారు అంతా పచ్చగానే ఉందని భ్రమిస్తారు. చంద్రబాబు కూడా అలాగే భావించారు. ప్రజలకు నిజంగా మేలు చేయాలనే సంకల్పం ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అంతేగానీ.. నేను ఇన్ని డబ్బులు పంచిపెడుతున్నా తప్పుబట్టడం ఏమిటని హుంకరిస్తే ప్రయోజనం ఏమి ఉంటుంది? 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న భారీ లక్ష్యం పెట్టుకుని భూసేకరణకు డబ్బుల్లేక గతంలో మంజూరు చేసిన అసైన్డ్‌ భూములను గుంజుకోవడం అన్యాయం కాదా? ఎల్లమ్మ దగ్గర నుంచి లాక్కుని పుల్లమ్మకు ఇవ్వడం వల్ల ఫలితం ఏముంటుంది? తాము పనిచేసే చోట నివసించాలని పేదలు భావిస్తారు. అలా కాకుండా ఉపాధి లభించే ప్రాంతాలకు ఆమడదూరంలో నివాస స్థలాలు ఇచ్చినా ఒకటే.. ఇవ్వకపోయినా ఒకటే! విజయవాడలో కాల్వగట్లపై నివసించేవారిని అక్కడ నుంచి తరలించడానికి గత ప్రభుత్వాలు దూరంగా ఇళ్లు నిర్మించి ఇచ్చినా వెళ్లడానికి ఒక్కరు కూడా ఇష్టపడలేదు. ఇవేమీ పట్టకుండా నేను చేసిందే రైట్‌ అని అనుకుంటే అది ఆయన ఇష్టం! పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా గ్రామ సచివాలయాల్లో నియమితులైనవారిని వాడుకుంటామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాజాగా ప్రకటించారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు చేయవలసిన పనిని గ్రామ సచివాలయ సిబ్బందితో చేయించడం ఏమిటి? ఇలాంటి వింత నిర్ణయాలు తీసుకుంటూ మమ్మల్ని ఎవరూ తప్పుబట్టకూడదంటే ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో డీశాలినేషన్‌ ప్లాంట్లు నెలకొల్పే విషయం పరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నట్టు వార్తలు వచ్చాయి.


ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో డీశాలినేషన్‌ ప్లాంట్లు అవసరమా? సహజ నీటి వనరులు లభ్యంకాని ఎడారి దేశాలలో మరో ప్రత్యామ్నాయం లేక సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే డీశాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటారు. ఇజ్రాయెల్‌ వంటి దేశానికి నీటి కొరత ఉంది. ఆ దేశపు కంపెనీకి చెందిన ప్రతినిధులు చెప్పారని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిశ్రమలు, మంచినీటి అవసరాలకు డీశాలినేషన్‌ ప్లాంట్లు పెట్టే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించడం విడ్డూరంగా అనిపించడం లేదా? తనకు సలహాలు, సూచనలు ఇవ్వగలిగినవారు దేశంలోనే లేరని జగన్మోహన్‌రెడ్డి భావిస్తూండవచ్చు. డీశాలినేషన్‌ ప్లాంట్లు ఎంతో వ్యయంతో కూడుకున్నవి. విధిలేని పరిస్థితులలోనే వాటిని ఏర్పాటు చేసుకుంటారు.


నీటిని పొదుపు చేయడానికై మురుగునీటిని శుద్ధిచేసే విధానానికై కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. అలా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకుంటారు. కపటం, కక్ష లేకుండా ఆలోచనలు చేస్తే శుభం జరుగుతుంది. జగన్మోహన్‌రెడ్డి ఆలోచనలు, నిర్ణయాలు ఇందుకు విరుద్ధంగా సాగటం వల్లనే విమర్శలు పెరుగుతున్నాయి. అయినా ప్రజలను మాయ చేయడం జగన్మోహన్‌రెడ్డికి కొత్త ఏమీకాదు. తండ్రి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్న ఆయన ఏ పత్రికా సాహసించని రీతిలో దాదాపు 36 పేజీల తన పత్రికను రెండు రూపాయలకే విక్రయించారు. అంతటితో తగ్గకుండా ఇతర పత్రికలు కూడా రెండు రూపాయలకే అమ్మాలని ఉద్యమాన్ని మొదలెట్టారు. దినపత్రికలను పాఠకులకు చేరవేసే హాకర్లను ప్రలోభపెట్టారు. పత్రిక స్థిరపడింది అనుకున్న తర్వాత పేజీల సంఖ్యను ఇతర పత్రికలకు సమానంగా తగ్గించి ధర కూడా పెంచారు. వ్యాపారవేత్తగా ఆయన చేసింది తప్పు కాకపోవచ్చును గానీ, నైతికంగా ప్రజలను మాయ చేయడమే అవుతుంది. హెలికాప్టర్‌ ప్రమాదంలో రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత తనను ముఖ్యమంత్రిని చేయకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని.. రాజశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీనే చంపించారనీ, రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేశ్‌ అంబానీ పాత్ర కూడా ఉందనీ ప్రజలలో ప్రచారం చేసి సానుభూతిని పొందారు. అప్పట్లో ఉప ఎన్నికలు జరగ్గా రాజశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు చంపించారని జగన్‌ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల విస్తృతంగా ప్రచారం చేసి కన్నీళ్లు పెట్టుకోలేదా? నిజంగా రాజశేఖర్‌రెడ్డి హత్యకు గురయ్యారు అని వారు నమ్మి ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు ఎందుకు? ప్రమాదం జరిగిన ప్రాంతం పావురాలగుట్ట కర్నూలు జిల్లాలో ఉంది కనుక, ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి విచారణకు ఎందుకు ప్రయత్నించలేదు. అంటే రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నట్టు స్పష్టం అవుతోంది కదా? కోడి కత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఈ కోవలోకే వస్తాయి. వివేకా హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా తమపై కనికరం చూపాలని జగన్‌ పిన్ని, చెల్లి హైకోర్టును వేడుకోవడాన్ని ఏమనాలి? అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ వివేకా హత్యపై జగన్‌ నోరు విప్పడం లేదు. అప్పట్లో ఈ హత్య వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించింది ఆయనే కదా? అది నిజమో కాదో ఇప్పటికైనా చెప్పాలి కదా? కోడి కత్తి కేసులో కూడా చంద్రబాబు హస్తముందని ఆరోపించి ఇప్పుడు మౌనంగా ఉండటాన్ని ఎలా అర్థంచేసుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం నాటి సంఘటనలను జగన్‌ అండ్‌ కో వాడుకున్నదని నిందిస్తే ఎలా తప్పుబట్టగలరు? ముఖ్యమంత్రిగా కూడా ప్రజలను మాయ చేసే దిశగానే ఆయన ఆలోచనలు సాగుతున్నాయి. తాను పేదల కోసమే జీవిస్తున్నాననీ, పథకాలు తీసుకొస్తున్నాననీ చెప్పుకొంటూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మీడియాపై దాడికి పూనుకున్నారు. చంద్రబాబు డబ్బు ఇచ్చి మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని కూడా జగన్మోహన్‌రెడ్డి నిందించారు. స్థానిక మీడియాను అలా ప్రభావితం చేస్తున్నారని కాసేపు ఒప్పుకొందాం. జాతీయ మీడియాను, అంతర్జాతీయ మీడియాను కూడా చంద్రబాబు డబ్బుతో కొన్నారా? ఏ మీడియానైనా అలా డబ్బుతో కొనగలరా? కొంటే ఎంత కాలం? మీడియా దారి తప్పితే కడిగిపారేయడానికి ఇవ్వాళ సోషల్‌ మీడియా ఉంది. ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడానికి సోషల్‌ మీడియా వేదికగా కిరాయి మనుషులను నియమించుకోవడానికి అలవాటుపడిన జగన్మోహన్‌రెడ్డి ప్రధాన మీడియా కూడా అదే దారిలో నడుస్తుందనుకోవడం అవివేకం. ఇవ్వాళ జగన్‌ మీడియా తప్ప మిగతా అన్ని మీడియాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఏమిటి? అని ఆత్మవిమర్శ చేసుకోకుండా ‘‘నన్ను తప్పుబట్టడం ఏమిటి?’’ అని కన్నెర్ర చేయడం వల్ల ఫలితం ఉండదు. రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయనను అమితంగా ఆరాధించే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో పసిగట్టడం వల్లనే ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు నోరు విప్పుతున్నారని భావించవచ్చు. జగన్‌ ధోరణిపై అధికార యంత్రాంగంలో కూడా అసహనం పెల్లుబుకుతోంది. జగన్‌ ఇప్పటికైనా ఆత్మస్తుతి.. పరనిందకు స్వస్తి చెప్పి వాస్తవిక దృక్పథంతో ఆలోచించి.. నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జగన్మోహన్‌రెడ్డి వల్ల తమ సామాజికవర్గానికి ఇతర సామాజికవర్గాల వారు దూరమవుతున్నారనీ, అన్ని వర్గాలతో కలిసిమెలసి వ్యవహరించే రెడ్లు ఇవ్వాళ ఒంటరి అవుతున్నారనీ, జగన్‌ అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందనీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జగన్‌ చుట్టూ ఉన్న రెడ్లు అయినా ఈ విషయాన్ని ఆయనకు ఎందుకు చెప్పడం లేదో అర్థంకావడం లేదని ఆ వర్గానికి చెందిన ప్రముఖుడొకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు. విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎయిర్‌పోర్ట్‌ వద్ద ముందుకు కదలకుండా అధికార పార్టీ కార్యకర్తలనేవారు అడ్డుకోవడం చూశాం. ఇది జగన్మోహన్‌రెడ్డి నైజానికి మచ్చు తునక మాత్రమే! గతంలో జగన్మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అడ్డుకోలేదా? అని సమర్థించుకోవచ్చు గానీ.. అప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. ఇదీ తేడా!


ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-03-01T05:49:34+05:30 IST