నేటి తరానికి త్యాగ స్ఫూర్తిని తెలపాలి

ABN , First Publish Date - 2022-08-13T06:07:49+05:30 IST

స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలను నేటి తరానికి తెలిపి వారిలో స్ఫూర్తిని నింపాలని బీజేపీ నాయకుడు లావేటి వీరశివాజీ అన్నారు.

నేటి తరానికి త్యాగ స్ఫూర్తిని తెలపాలి
చాట్రాయిలో జాతీయ జెండాలతో ప్రదర్శన

.కైకలూరు, ఆగస్టు 12: స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలర్పించిన వారి  త్యాగాలను నేటి తరానికి  తెలిపి వారిలో స్ఫూర్తిని నింపాలని బీజేపీ నాయకుడు లావేటి వీరశివాజీ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా  వీరశివాజీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఐదో రోజుకు చేరింది. శుక్రవారం భుజబలపట్నం, వదర్లపాడు, నరసాయపాలెం, నత్తగుళ్ళపాడు గ్రామాల్లో జాతీయ జెండాలతో పాదయాత్ర చేశారు. అలాగే  మూడు రోజుల పాటు ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలన్నారు. అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూల మాలలు వేశారు.  భుజబలపట్నం మాజీ సర్పంచ్‌ గుజ్జల రామలక్ష్మి, కోటేశ్వరరావు, రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు. 

చాట్రాయి: చాట్రాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం గ్రామ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి, ఎంపీడీవో మురళీమోహన్‌, ఎంపీపీ నిర్మల, సర్పంచ్‌  ఉష, ఎంపీటీసీ  శివకుమారి, ఈవోపీఆర్డీ నాగరాజు, ఏపీవో శేఖర్‌, హెచ్‌ఎం సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కలిదిండి: స్వాతంత్య్ర వేడుకలకు గాంధీజీ విగ్రహం ముస్తాబైంది. అధికారులు గాంధీజీ విగ్రహానికి రంగు వేయిం చి విగ్రహం చుట్టూ ఉన్న పొదలను తొలగించి శుభ్రపర్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సీతారామకుమార్‌ మాట్లాడుతూ 13, 14, 15 తేదీల్లో ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకోవాలన్నారు.   సర్పంచ్‌ లీలా కనకదుర్గ, పంచాయతీ కార్యదర్శి రమణ పాల్గొన్నారు.

ముదినేపల్లి:  మండలంలోని అన్ని జడ్పీ హైస్కూళ్లు, యూపీ స్కూళ్ల విద్యార్థులకు స్వాతంత్ర్యోద్యమ భావాలు, ఇతర అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విద్యా శాఖ నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముదినేపల్లి హైస్కూల్‌లో నిర్వహిం చిన ఈ పోటీల్లో ఐదో తరగతి విద్యార్థి ఎన్‌.క్రిస్టీ  గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. 

ముదినేపల్లి రూరల్‌: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని  విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహించారు. విజేతలకు ఆగస్టు 15న బహుమతులు అందజేయనున్నట్టు ఇన్‌చార్జ్‌ ఎంఈవో తెలిపారు.

Updated Date - 2022-08-13T06:07:49+05:30 IST