త్యాగం వారి మతం

Published: Sat, 18 Dec 2021 00:50:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
త్యాగం వారి మతం

అష్ఫాఖుల్లా, రాంప్రసాద్‌లను వేర్వేరు జైళ్ళలో ఒకేరోజు ఉరి తీశారు. వీరిద్దరి త్యాగం, స్నేహం చిరస్మరణీయం.


దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన యువ కిశోరాలలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌లు ముఖ్యులు. వయసుకు మించిన పరిణతితో ముఫ్ఫయ్యేళ్ళకే నూరేళ్ళ ఖ్యాతినార్జించి, దేశంకోసం ఉరితాడును ముద్దాడిన దేశభక్తాగ్రేసరులు వీరిద్దరూ. ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నాలై, వారికి ముచ్చెమటలు పట్టించిన రాంప్రసాద్, అష్ఫాఖుల్లాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జన్మించారు.


రాంప్రసాద్ బిస్మిల్ సనాతన హిందువు, ఆర్యసమాజ సభ్యుడు. అష్ఫాఖ్ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ముస్లిం. వీరి స్నేహం పాలూ పంచదారలా కలగలిసి పోయింది. ఆర్యసమాజ సభ్యుడైన బిస్మిల్ మొదట్లో అష్ఫాఖ్‌ను ఒక పట్టాన నమ్మలేదు. ఆ తరువాత అచంచలమైన అష్ఫాఖ్ దేశభక్తికి, అంకిత భావానికి చలించిపోయి అనుమానించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. ఇద్దరి లక్ష్యం ఒకటే కావడంతో సనాతనహిందువైన రాంప్రసాద్‌కు, సాంప్రదాయ ముస్లిమైన అష్ఫాఖ్‌కు స్నేహం గాఢమైంది.


ఒకే కంచంలో తిని, ఒకే మంచంపై పడుకొని ఒకరికొకరు ప్రాణ సమానమయ్యారు. ఎవరి ధర్మాలను వారు పాటిస్తూనే దేశంకోసం ఒక్కటై భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. ఈ ఇద్దరు యువకులూ భావుకులే. యుక్తవయసులోనే పదునైన కవిత్వం రాశారు. సామ్రాజ్యవాద భావజాలాన్ని తుత్తునియలు చేశారు. అచంచలమైన దేశభక్తితో బ్రిటిష్ వారి గుండెల్లో నిప్పు కణికలై రగిలారు. ఆర్ధిక ఇబ్బందులు లేని కుటుంబాల్లో, విలాసవంతంగా గడపవలసిన యవ్వనకాలంలో దేశం గురించి ఆలోచించడం సాధారణ విషయం కాదు.


రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ నేపథ్యాలైనా, వారి ఆలోచనలు రాజకీయంగానే సాగేవి. విదేశీ వస్తువుల వాడకం బానిసత్వానికి చిహ్నమని, వాటిని మానేయాలని ప్రచారం ప్రారంభించారు. మాతృదేశంకోసం పోరాడి చరిత్రలో నిలిచిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. ఉద్యమ అవసరాలకోసం కావలసిన ధనాన్ని ప్రభుత్వధనం కొల్లగొట్టడం ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. 1925 ఆగష్టు 9న అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర విప్లవకారులు కాకోరీ గ్రామం వద్ద ప్రభుత్వఖజానాతో వెళుతున్న రైలును దోపిడీ చేశారు. పట్టుమని పదిమంది కూడా లేని యువకులు ఏకంగా బ్రిటిష్ ఖజానాకే గురిపెట్టి, రైలునే దోచేయడం ఆంగ్లాధికారులకు తలతీసేసినంతపనైతే, ఉద్యమకారులకు కొత్తఉత్సాహాన్ని అందించినట్లయింది. దీంతో ఆంగ్లాధికారులు ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సోదాలు ముమ్మరం చేసి రాంప్రసాద్ బిస్మిల్‌ను అరెస్టుచేశారు.


అష్ఫాఖ్ ఇంటిపైకూడా పోలీసులు దాడిచేశారు కానీ అతడు వారికి దొరక్కుండా తప్పించుకున్నాడు. కొన్నాళ్ళపాటు బనారస్‌లో అజ్ఞాతంలో గడిపి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో ఒక మిత్రుడు చేసిన నమ్మకద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. మిగతా వారి సమాచారం రాబట్టాలని పోలీసులు ఎంత ప్రయత్నించినా అష్ఫాఖ్ ఏమాత్రం భయపడలేదు. చివరికి అష్ఫాఖ్, రాంప్రసాద్‌లను 1927 డిసెంబర్ 19న ఉరితీయాలని తీర్పు వెలువడింది. ప్రాణత్యాగానికి ఏనాడో సిద్ధపడ్డ ఈ ఇద్దరు ప్రాణమిత్రులూ మాతృదేశ విముక్తికోసం ఉరి కంబాన్నెక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని ప్రకటించారు.


ఇంతటి అదృష్టం అందరికీ దక్కదని, ఏడుకోట్ల (ఆనాటి) ముస్లిం జనాభాలో దేశంకోసం బలిపీఠమెక్కబోతున్న తొలి ముస్లింను తానే అయినందుకు పొంగిపోతున్నానని అష్ఫాఖ్ ప్రకటించాడు. ‘నా మాతృదేశమా.. సదా నీసేవ చేస్తూనే ఉంటా. ఉరిశిక్షయినా, యావజ్జీవమైనా.. సంకెళ్ళ దరువుతో నీ కీర్తిగానం చేస్తూనే ఉంటా’ అని కవితాత్మకంగా తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. అష్ఫాఖుల్లా, రాంప్రసాద్‌లను వేర్వేరు జైళ్ళలో ఒకేరోజు ఉరి తీశారు. వీరిద్దరి త్యాగం, స్నేహం చిరస్మరణీయం. అవి దేశం పట్ల బాధ్యతను, హిందూ ముస్లిం ఐక్యతను చాటుతూ, సామరస్య గీతం ఆలాపిస్తూనే ఉంటాయి.


యండి. ఉస్మాన్ ఖాన్

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.