ద్విజాతి సిద్ధాంతం సజీవం!

ABN , First Publish Date - 2021-12-18T06:16:20+05:30 IST

1971 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ ఆవిర్భావం భారత ఉపఖండాన్ని మత ప్రాతిపదికన చీల్చివేసిన ద్విజాతి సిద్ధాంతం నిరాధారమైనదిగా నిరూపించింది. అర్ధశతాబ్ది అనంతరం ఆ సిద్ధాంతం మరోవిధంగా ప్రభవిల్లుతోంది....

ద్విజాతి సిద్ధాంతం సజీవం!

1971 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ ఆవిర్భావం భారత ఉపఖండాన్ని మత ప్రాతిపదికన చీల్చివేసిన ద్విజాతి సిద్ధాంతం నిరాధారమైనదిగా నిరూపించింది. అర్ధశతాబ్ది అనంతరం ఆ సిద్ధాంతం మరోవిధంగా ప్రభవిల్లుతోంది. హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులవారన్న వాదనను మొదటిలోనే తిరస్కరించిన భారత్‌లోనే ‘ద్విజాతి’ భావన మళ్ళీ బలపడుతోంది. 


ఒక రాజ్యం అంతరించి ఒక జాతి ఆవిర్భవించింది. యాభై ఏళ్ళ క్రితం డిసెంబర్ శీత వేళ సంభవించిన చరిత్రాత్మక పరిణామమిది. తూర్పు పాకిస్థాన్ మరణాన్ని, బంగ్లాదేశ్ జననాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ప్రవాసంలో ఉన్న బంగ్లా స్వాతంత్ర్య సమరయోధులు 1971 ఏప్రిల్‌లోనే ‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం’ను ఏర్పాటు చేశారు. 1971 డిసెంబర్ 6న ఆ ప్రభుత్వాన్ని భారత్ లాంఛనంగా గుర్తించింది. 


తూర్పు పాకిస్థాన్‌లో జనరల్ నియాజీ నాయకత్వంలోని పాకిస్థాన్ సేనలు 1971 డిసెంబర్ 16న భారత సైన్యానికి లొంగిపోయాయి. కొద్ది వారాల అనంతరం పాకిస్థాన్‌లో జైలు నుంచి విడుదలయిన షేక్ ముజిబుర్ రహమాన్ ఢాకాకు తిరిగివచ్చి స్వతంత్ర బంగ్లాదేశ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.


బంగ్లాదేశ్ పుట్టుకను భారతీయులు మూడు దృక్కోణాలలో హర్షించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ధైర్యం, దార్శనికత, వివేకం, రాజనీతిజ్ఞతకు అమోఘమైన విజయంగా ఆమె రాజకీయ మద్దతుదారులు భావించారు. 1962లో చైనా చేతుల్లో భారత్‌కు ఎదురైన అవమానకరమైన, బాధాకరమైన పరాజయ స్మృతులను పాకిస్థాన్‌పై విజయం తుడిచి పెట్టిందని జాతీయవాదులు భావించారు. ఈ ఇరు బృందాలకు భిన్నంగా మరికొందరు బంగ్లాదేశ్ జననం భారత్‌కు సైద్ధాంతిక, నైతిక విజయంగా భావించారు. పాకిస్థాన్ సంస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతానికి అంతిమ తిరస్కారమే బంగ్లాదేశ్ ఆవిర్భావమని ఈ మూడో దృక్పథంతో ఆలోచించిన భారతీయులు విశ్వసించారు.


1947లో దేశ విభజన అనివార్యమన్న విషయం అవగతమైన తరువాత గాంధీ, నెహ్రూ భారత్ ఎట్టి పరిస్థితులలోనూ లౌకిక దేశంగా ఉండి తీరాలని సంకల్పించారు. కొత్తగా ప్రభవించనున్న దేశంలో మైనారిటీలకు ఏమి సంభవించినప్పటికీ భారత్‌లో మతపరమైన మైనారిటీలకు సంపూర్ణ పౌరసత్వ హక్కులు కల్పించాలని వారు నిర్ణయించారు. మతాలకు అతీతంగా రాజ్యవ్యవస్థ వ్యవహరించాలని వారిరువురూ నిర్దేశించారు. హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతుల వారని, ఆ ఇరువర్గాలూ శాంతిసామరస్యాలతో సహజీవనం చెయ్యలేరన్న జిన్నా వాదనను భారత్ గణతంత్ర రాజ్యం ఎటువంటి మినహాయింపులు లేకుండా తిరస్కరించింది. 


1971 నాటి విజయాన్ని ఈ మూడో దృక్కోణంతో చూసిన భారతీయులను రాజ్యాంగ విహిత దేశభక్తులు అందాం. వీరు గాంధీ, నెహ్రూ భావజాల సంప్రదాయాలను కొనసాగించినవారు. పాకిస్థాన్ ఓటమి కంటే బహుళత్వం, లౌకికవాదం విజయంగా 1971ని పరిగణించాలనేది వీరి నిశ్చిత విశ్వాసం. జిన్నా, ఆయన నాయకత్వంలోని ముస్లింలీగ్ విశ్వాసాలకు విరుద్ధంగా పశ్చిమ, తూర్పు పాకిస్థాన్‌లను సమైక్యంగా ఉంచడంలో ఇస్లాం విఫలమయింది. మతం అనేది జాతికి ప్రాతిపదిక కాదనే సత్యాన్ని బంగ్లాదేశ్ ఆవిర్భావం రుజువు చేసింది. 


బెంగాలీ అస్తిత్వానికి ప్రాధాన్యమిచ్చిన బంగ్లాదేశ్ వ్యవస్థాపకులు మత ప్రాతిపదికన పౌరుల పట్ల వివక్ష చూపకూడదని నిర్ణయించారు. దేశ విభజన అనంతరం తూర్పు పాకిస్థాన్‌లోని హిందువులు వేధింపులకు గురయిన మాట నిజమే. భారత్‌కు వలసలు పెరగడంతో బంగ్లాలో హిందువుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1971లో తూర్పు పాకిస్థాన్ జనాభాలో హిందువులు పది శాతం కంటే ఎక్కువగా ఉండేవారు (అదేకాలంలో పశ్చిమ పాకిస్థాన్‌లో హిందువులు 2 శాతం కంటే తక్కువగా ఉండేవారు) పశ్చిమ పాక్‌లో వలే కాకుండా తూర్పు పాకిస్థాన్ ప్రజాజీవితంలో హిందువులు ప్రభావశీలమైన పాత్ర నిర్వహిస్తుండేవారు. బంగ్లా విముక్తి పోరులో చాలామంది హిందువులు కీలక పాత్ర వహించారు. సైనిక కమాండర్లు జీవన్ కనాయి దాస్, చిత్తరంజ్ దత్తా, ప్రముఖ కమ్యూనిస్టు మోనీ సింగ్ మొదలైన వారిని ఆ సందర్భంగా ప్రస్తావించి తీరాలి. 


బంగ్లాదేశ్ మొదటి రాజ్యాంగాన్ని న్యాయకోవిదుడు కమాల్ హొస్సేన్ రూపొందించారు. 1972లో అమలులోకి వచ్చిన ఈ రాజ్యంగం లౌకికవాదాన్ని ఔదల దాల్చింది. మతాలకు అతీతంగా దేశపౌరులు అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఇస్లాంకు ప్రత్యేక స్థానం కల్పించలేదు.


 1975లో ముజిబుర్ రహమాన్ హత్యానంతరం బంగ్లాదేశ్ ప్రజా జీవనంలో ఇస్లామిక్ ప్రభావాలు ఉధృతమయ్యాయి. జనరల్ ఎర్షాద్ నేతృత్వంలోని సైనిక పభుత్వం ఆ ధోరణులను అన్ని విధాల ప్రోత్సహించింది. 1986లో రాజ్యాంగాన్ని సవరించి ఇస్లాంను బంగ్లాదేశ్ అధికారిక మతంగా ప్రకటించారు. అవామీలీగ్ అధికారంలోకి వచ్చిన తరువాత కమాల్ హొస్సేన్ రూపొందించిన తొలి రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని పాలకపక్షం నాయకులు నిర్ణయించారు. అయితే అటువంటి మార్పును వారు తీసుకురాలేక పోయారు. 


బంగ్లాదేశ్ ఆవిర్భవించింది మొదలు సామాజిక, ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. స్థూల దేశీయోత్పత్తిలో తయారీంగం వాటా మన దేశంలో కంటే మెరుగ్గా ఉంది. కార్మికశ్రేణుల్లో మహిళల శాతమూ ఎక్కువే. గత ఆర్థికసంవత్సరంలో బంగ్లాదేశ్ పౌరుల తలసరి ఆదాయం భారతీయుల తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. అయితే రాజకీయ, ధార్మిక రంగాలలో పరిస్థితులు దేశ వ్యవస్థాపకుల ఆదర్శాలకు అనుగుణంగా లేవు. మైనారిటీలు అభద్రతాభావంతో బతుకుతున్నారు. రచయితలు, మేధావులపై దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి.


సరే, ఇప్పుడు సహనం, బహుళత్వం విశిష్టతల గురించి బంగ్లాదేశీయులకు బోధించగల నైతిక అర్హత భారతీయులకు ఉందా? 1971 నాటికి, ఇప్పటికీ మన రాజకీయ, సామాజిక రంగాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014 మేలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ హిందూ మెజారిటీవాద ఎజెండా అమలుకు అగ్ర ప్రాధాన్యమిస్తున్నాయి. 2015 సెప్టెంబర్‌లో అఖ్లక్ బహిరంగ ఊచకోత నుంచి 2021 డిసెంబర్‌లో కర్ణాటకలో క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన హింసాకాండ దాకా మోదీ ప్రభుత్వ పాలనాచరిత్ర అంత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మైనారీటీలపై మళ్ళీ మళ్ళీ దాడులు జరగడమే కదా? తమ దేశంలో హిందువులపై దాడులను బంగ్లా ప్రధాని షేక్ హసీనా నిర్ద్వంద్వంగా ఖండించారు. మరి మన ప్రధానమంత్రి తన దేశంలోని మైనారిటీలపై దాడుల పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారు!


2019 మేలో అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయిన తరువాత ముస్లింలపై అపనిందలు మోపడం, వారిని అవమానాలకు లోనుచేయడం కేంద్ర పభుత్వం అనుసరిస్తున్న విధానాలలో ప్రధానాంశాలుగా ఉంటున్నాయి. ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి రద్దుచేయడం, జాతీయ పౌరపట్టిక రూపకల్పనకు ప్రతిపాదన, పౌరసత్వ చట్టం సవరణ మొదలైనవి అందుకు నిదర్శనాలు. ముస్లింల పట్ల ప్రస్తుత పాలకుల వివక్షకు అవి పూర్తిగా అద్దం పడుతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమర్థించారు. అలాగే జాతీయ పౌరపట్టిక రూపకల్పన విషయంలో ఆయన దృఢసంకల్పం చూపుతున్నారు. బంగ్లాదేశ్ ఒక ‘చెదపురుగుల జాతి’ అని ఆయన ఒక సందర్భంలో దుయ్యబట్టారు.


ఇది చాలా అనాగరికమైన అభివర్ణన. సహజంగానే బంగ్లాదేశ్ మేధావులు అమిత్ షా వ్యాఖ్యను తీవ్రంగా ఖండించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు బంగ్లాదేశ్‌లోని మైనారిటీల విషయంలో తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తాయని’ ఢాకా విశ్వవిద్యాలయ చరిత్ర ఆచార్యుడు కమాల్ 2019 అక్టోబర్‌లోనే హెచ్చరించారు. బంగ్లాలోని కొంత మంది మౌలానాలు తమ ప్రసంగాలలో కశ్మీర్, జాతీయ పౌరపట్టిక గురించి తరచు ప్రస్తావిస్తూ భారత్‌లో ముస్లింల హక్కులపై దాడి జరిగితే అందుకు ప్రతిగా బంగ్లాలో హిందువులు తమ హక్కులను కోల్పోతారని స్పష్టం చేస్తున్నారని కూడా ప్రొఫెసర్ కమాల్ అన్నారు. 


వివిధ మతాలకు చెందిన చాందసవాదులు పరస్పరం రెచ్చగొట్టుకోవడం పరిపాటి. అమిత్ షా ఈ విషయంలో మరింత ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, బంగ్లాదేశ్ తన పౌరులకు ఆహారాన్ని సమకూర్చలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఇందుకు బంగ్లా విదేశాంగ మంత్రి ప్రతిస్పందిస్తూ అమిత్ షాకు తీవ్రంగా చివాట్లు పెట్టారు. బెంగాల్‌లో ఎన్నికల పోటీని హిందూ- ముస్లిం వ్యవహారంగా చిత్రించేందుకు అమిత్ షా ప్రయత్నించారు. బెంగాల్ ఓటర్లు ఆయన వైఖరిని తిరస్కరించి మమతకు మళ్ళీ అధికారం ఇచ్చారు. అయినా కేంద్ర హోంమంత్రి తన వైఖరిని మార్చుకోకుండా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో హిందువులలో అభద్రతా భావాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు.


భారతీయ ముస్లింలు భద్రత, గౌరవంతో జీవించేందుకు వారికి ఒక ప్రత్యేక దేశం అవసరమని 1940లలో జిన్నా వాదించారు. ముస్లింలపై హిందువులు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాబల్యాన్ని ఎడతెగకుండా ప్రకటించాలని 2020లలో నరేంద్ర మోదీ, అమిత్ షా విశ్వసిస్తున్నారు.


ఇది, గాంధీ, నెహ్రూ సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైనది. 1971 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ ఆవిర్భావం భారత ఉపఖండాన్ని మత ప్రాతిపదికన చీల్చివేసిన ద్విజాతి సిద్ధాంతం నిరాధారమైనదిగా నిరూపించింది. అర్ధశతాబ్ది అనంతరం ఆ సిద్ధాంతం మరో విధంగా ప్రభవిల్లుతోంది. హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతుల వారన్న వాదనను మొదటిలోనే తిరస్కరించిన భారత్‌లోనే ‘ద్విజాతి’ భావన మళ్ళీ బలపడుతోంది. మన వర్తమాన చరిత్ర క్రూరవైరుద్ధ్యాలలో ఇదొకటి!


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-12-18T06:16:20+05:30 IST