అగ్ర రాజ్యాల భయంకర భ్రమలు

ABN , First Publish Date - 2022-02-26T06:31:36+05:30 IST

అమెరికన్లు 1975లో వియత్నాం నుంచి నిష్క్రమించారు. 28 సంవత్సరాల అనంతరం 2003లో ఇరాక్‌ను ఆక్రమించారు. సోవియట్ యూనియన్ సైన్యం 1989లో అఫ్ఘానిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది....

అగ్ర రాజ్యాల భయంకర భ్రమలు

అమెరికన్లు 1975లో వియత్నాం నుంచి నిష్క్రమించారు. 28 సంవత్సరాల అనంతరం 2003లో ఇరాక్‌ను ఆక్రమించారు. సోవియట్ యూనియన్ సైన్యం 1989లో అఫ్ఘానిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది. 33 సంవత్సరాల అనంతరం రష్యా సైన్యం ఉక్రెయిన్‌ను దురాక్రమించింది. ప్రతి సందర్భంలోనూ ప్రజలు, నాయకులు అంతకు ముందటి దుస్సాహసం ఎంత విషాదభరితంగా, అవమానకరంగా ముగిసిందో మరచిపోయారు! అమెరికా రష్యాల ‘అగ్రరాజ్య’ అభిజాత్యాలకు సమస్త ప్రపంచమూ, ముఖ్యంగా వియత్నాం, అఫ్ఘానిస్తాన్, ఇరాక్, ఉక్రెయిన్‌లు భయానక మూల్యాన్ని చెల్లించాయి.


‘వైషమ్యం, స్వార్థపరత్వం, కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్థలు, మాయలతో మారు పేర్లతో చరిత్ర గతిని’ మళ్లీ నిర్దేశిస్తున్నాయి. పొరుగు దేశం ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడమే ఇందుకొకతాజా తార్కాణం. ‘తామే భువికధినాథులమని’ అహంకరించే అగ్రరాజ్యాలు గతంలో పాల్పడిన సైనిక దుస్సాహసాల గురించి ఆలోచించేలా ఆ దురదృష్టకర ఘటన నన్ను పురిగొల్పింది. నాసొంత జీవిత కాలానికే పరిమితమయితే ఉక్రెయిన్‌పై యుద్ధం అగ్రరాజ్యాల నాలుగో దుస్సాహసం. వియత్నాం, ఇరాక్‌లో అమెరికా; అఫ్ఘానిస్తాన్ లో సోవియట్ యూనియన్ ఇటువంటి దుస్సాహసాలకే పాల్పడ్డాయి. ఆ మూడు సైనిక జోక్యాలు అంతిమంగా విఫలమయ్యాయి. దురాక్రమించుకున్న దేశంలో ప్రజలను మాటల్లో వర్ణింపశక్యంకాని బాధలకు లోను చేశాయి. దురాక్రమదారుని ప్రతిష్ఠ మంటగలిసింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పర్యవసానాలకు ఆ దురాక్రమణలు దారితీశాయి. 


1965లో అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌ వియత్నాంలో అమెరికా జోక్యాన్ని మరింతగా విస్తృతం చేసినప్పుడు నేను బాలుడిని. ఆ యుద్ధం ఎలా సాగిందన్న విషయమై జ్ఞాపకాలు పెద్దగా లేనప్పటికీ, ఆ సమరం ఎలా ముగిసిందో నాకు ఇప్పటికీ బాగాగుర్తుంది. 1975 ఏప్రిల్‌లో నేను ఢిల్లీలో కళాశాల విద్యార్థిగా ఉన్నాను. సైగాన్ నుంచి అమెరికా సైనికులు ఎంత అవమానకరంగా నిష్ర్కమించారో విపులంగా అభివర్ణించిన బిబిసి వార్తాకథనాలను నేను, నా మిత్రులు ఎనలేని ఆసక్తితో విన్నాం. అమెరికాకు జరిగిన పరాభవానికి తోటి ఆసియా దేశస్థులుగా ఎంతో ఆనందించాం. బంగ్లాదేశ్ సంక్షోభంలో వాషింగ్టన్‌, పాకిస్థాన్ సైనిక ప్రభుత్వ పక్షం వహించడం పట్ల మా నిరసన కూడా ఆ సంతోషానికి ఎంతైనా కారణమయింది. 1979 డిసెంబర్‌లో అఫ్ఘానిస్తాన్‌ను ఆనాటి సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్న చరణ్‌సింగ్, మన జాతీయోద్యమ సంప్రదాయాల స్ఫూర్తితో సోవియట్ చర్యను తీవ్రంగా ఖండించారు. 1980 జనవరిలో అధికారానికి తిరిగి వచ్చిన ఇందిరాగాంధీ సోవియన్ యూనియన్‌ను సమర్థించారు. 


1986లో నేను ప్రప్రథమంగా అమెరికాకు వెళ్ళాను. అక్కడ నేను బోధిస్తున్న విశ్వవిద్యాలయంలో ఒకసారి అఫ్ఘాన్ ప్రవాస స్వాతంత్ర్య సమరయోధుల సమావేశానికి వెళ్ళాను. తజిక్ యోధుడు అహ్మద్‌షాకు వారు మద్దతుదారులు. ‘ఇందిరాగాంధీ మమ్ములను నిరాశ పరిచారు. సోవియట్ దురాక్రమణను ఆమె ఎలా సమర్థించారు? భారత ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది?’ అని ఒక అఫ్ఘాన్ విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. నేను సమాధానం ఇవ్వలేకపోయాను. 


నన్ను ప్రశ్నించిన అఫ్ఘాన్ విద్యార్థి చాలా పొడగరి. నేనీ వ్యాసం రాస్తున్న సమయంలో అతని రూపం నా కళ్ళకు కనిపిస్తోంది, అతని మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతడి ప్రశ్న సహేతుకమైనది. సోవియట్లకు మద్దతునివ్వడం ద్వారా ఇందిర గొప్ప తప్పిదం చేశారు. సాధ్యమైనంత త్వరిత గతిన ఆ ఆక్రమణ ముగిసేలాగా భారత ప్రభుత్వం కృషి చేసి ఉండవలసింది. భారత్, ఇతర మిత్ర దేశాల మద్దతుతో సమకూరిన భరోసాతోనే అఫ్ఘాన్‌లో సోవియట్ యూనియన్ ఒక దశాబ్దం పాటు తిష్ఠ వేసింది. విషాదమేమిటంటే సోవియట్ వ్యతిరేక పోరు మత ఛాందసవాదతత్వాన్ని సంతరించుకుంది. అంతర్యుద్ధం అఫ్ఘాన్‌లో సకల జీవన రంగాలను శిథిలం చేసింది. ఆ శిథిలాల నుంచే తాలిబన్ ప్రభవించింది. అంతిమంగా సోవియట్ ఆక్రమణదారులు, వియత్నాం నుంచి అమెరికా నిష్క్రమించినట్టుగా అవమానకరమైన రీతిలో వెనక్కి వెళ్ళిపోయారు. 


2001లో అమెరికా తొలుత అఫ్ఘాన్‌పై బాంబు దాడులు చేసి, ఆ తరువాత సైన్యాన్ని పంపింది. అమెరికా చర్య, సోవియట్ యూనియన్ దురాక్రమణ కంటే కించిత్ సమర్థనీయమైనది. ఎందుకంటే న్యూయార్క్‌లో సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు కారణమైన అల్‌కాయిదా గ్రూప్‌నకు కాబూల్ లోని తాలిబన్ ప్రభుత్వం ఆతిథ్యమివ్వడమే కాకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. 2002 సంవత్సరాంతంలో న్యూయార్క్ టైమ్‌్స జర్నలిస్ట్ థామస్ ఫ్రైడ్ మాన్ బెంగలూరుకు వచ్చాడు. ఒక పరస్పర మిత్రుని గృహంలో ఆయనతో సమావేశమయ్యాను. అఫ్ఘాన్ అనంతరం ఇరాక్‌ను దురాక్రమించేందుకు అమెరికా చేస్తున్న సన్నాహాలను ఆయన అనేక నిస్సార వాదనలతో సమర్థించారు. సెప్టెంబర్ 11 దాడులలో ఇరాక్ ప్రమేయం లేదని, అంతేకాకుండా అమెరికాకు చాలా దూరంలో ఉన్న ఆ దేశం నుంచి వాషింగ్టన్‌కు ఎలాంటి ముప్పులేదని నేను వాదించాను. వియత్నాంలో అమెరికాకు ఏమి జరిగిందో గుర్తుచేశాను. అయితే తర్కంగానీ, చారిత్రక సాక్ష్యాధారాలు గానీ ఆయనకు పట్టనేలేదు. 


తమ అనైతిక, న్యాయవిరుద్ధ దురాక్రమణను సమర్థించుకునేందుకు ఇరాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనే కట్టుకథను అమెరికన్లుప్రచారం చేశారు. నిజానికి ఇరాక్‌ను దురాక్రమించుకోవడం అగ్రరాజ్య దురహంకార చర్య. దాని భయానక పర్యవసానాలు ఇప్పటికీ ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. ఆ దురాక్రమణతో ఇరాక్ ప్రజలు ఎదుర్కొన్న (మాటల్లో వర్ణించలేని) బాధలు, వ్యధలకు; ఆ తరువాత మధ్యప్రాచ్యంలో సంభవించిన అంతర్యుద్ధాలకు థామస్ ఫ్రైడ్ మాన్, డేవిడ్రెమిన్సిక్ లాంటి పాత్రికేయులు, నాటి బ్రిటిష్‌ ప్రధాని టోనీ బ్లెయిర్ లాంటి వారు బాధ్యులు అని చెప్పక తప్పదు. అలాగే చరిత్రకారులు జాన్ లెవిస్ గడ్డీస్, నియల్ ఫెర్గూసన్‌ లాంటివారు కూడా బాధ్యులే. ఇరాక్‌ను ఆక్రమించుకోవడం మీకూ, మీ దేశానికే కాకుండా సమస్త ప్రపంచానికి మేలు జరుగుతుందని ప్రోత్సహించడం వల్లే నాటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ఆ దురాక్రమణకు ఆదేశించారు. 


అమెరికన్లు 1975లో వియత్నాం నుంచి నిష్క్రమించారు. 28 సంవత్సరాల అనంతరం 2003లో ఇరాక్‌ను ఆక్రమించారు. సోవియట్ యూనియన్ సైన్యం 1989లో అఫ్ఘానిస్తాన్‌ నుంచి నిష్క్రమించింది. 33 సంవత్సరాల అనంతరం రష్యా సైన్యం ఉక్రెయిన్‌ను ఆక్రమించింది. ప్రతి సందర్భంలోనూ ప్రజలు, నాయకులు అంతకు ముందటి దుస్సాహసం ఎంత విషాదభరితంగా, అవమానకరంగా ముగిసిందో మరచిపోయారు! కాలం తెచ్చిన మరపు అది.


ఆ దురాక్రమణల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. వియత్నాం, ఇరాక్‌లు అమెరికాకు భౌగోళికంగా వేల యోజనాల దూరంలో ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్‌ సోవియట్ యూనియన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న దేశం. ఉక్రెయిన్, రష్యన్ ఫెడరేషన్‌కు పొరుగు దేశం. తాను ప్రపంచ ఏకైక అగ్ర రాజ్యాన్ని కనుక ఎక్కడైనా సరే ఎవరూ తన మాటను జవ దాటకూడదనే అహంకారమే ఇరాక్ ఆక్రమణకు అమెరికాను పురిగొల్పింది. తేడాలకంటే సాదృశ్యాలే ఎక్కువగా ఉన్నాయి. వియత్నాం, అఫ్ఘాన్, ఇరాక్, ఉక్రెయిన్లలో ఆయా అగ్రరాజ్యాల దుస్సాహసాలు అన్నీ నిష్కారణంగా మరొక సార్వభౌమిక దేశంపై జరిగిన దాడులే. వియత్నాంలో, ఆ మాటకు వస్తే ఇరాక్‌లో జోక్యం చేసుకునేందుకు అమెరికాకు ఎలాంటి హక్కూ లేదు. అలాగే 1979లో అఫ్ఘాన్‌ను సోవియట్ యూనియన్, ఇప్పుడు ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడం పూర్తిగా న్యాయవిరుద్ధం. జాతీయ ఆధిక్యతా భావజాలాలే అమెరికా, రష్యాలను అందుకు పురిగొల్పాయి తమ కంటే చిన్న వైన, సైనికంగా అంతగా శక్తిమంతం కాని దేశాలను ఆక్రమించుకోవడం తమ భగవదత్త హక్కుగా అగ్ర రాజ్యాలు భావించడం శోచనీయం, గర్హనీయం.


ఉక్రెయిన్‌లో యుద్ధం ఎలా పరిణమిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి తన సేనలను రష్యా ఉపసంహరించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా శాంతివాదులు అందరూ కోరుతున్నారు. అయితే అది ప్రస్తుతానికి జరగని పని. ఆందోళనకరమైన విషయమేమిటంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చర్యను సమర్థించుకోవడానికి ఇరాక్ లో అమెరికా తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయించిన చరిత్ర గురించి ప్రస్తావిస్తున్నారు. తద్వారా ఉక్రెయిన్‌లో తామూ అలానే చేసే అవకాశముందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ‘రష్యా విషయంలో తానొక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించవలసి ఉన్నదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నందునే పుతిన్ ధైర్యంగా, సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారని’ లండన్ పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. రష్యాను ప్రపంచం గౌరవించాల్సినంతగా గౌరవించడం లేదని పుతిన్ అనుమానిస్తున్నారు. మళ్లీ ప్రపంచ అగ్రరాజ్యంగా వెలుగొందేందుకునిర్ణయాత్మక కార్యాచరణకు దిగవలసి ఉందని ఆయన భావించారు. ఈ భావనే ఆయన్ని ఉక్రెయిన్ ఆక్రమణకు పురిగొల్పింది. అఫ్ఘానిస్తాన్‌లో సైనిక పరాజయంతో సోవియట్ యూనియన్‌లో సమస్త జీవన రంగాలలో నైతిక పతనం ప్రారంభమయింది. ఈ నైతిక పతనంతోనే సోవియట్ సామ్రాజ్యం తన శక్తిని, ప్రభావాన్ని కోల్పోయిందనే సత్యాన్ని పుతిన్‌కు గుర్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.


ఇరాక్‌ను దురాక్రమించడం వల్లే ప్రపంచంలో అమెరికా పలుకుబడి సన్నగిల్లిందనే సత్యాన్ని కూడా పుతిన్‌కు చెప్పవలసి ఉంది. వియత్నాం, అఫ్ఘానిస్తాన్, ఇరాక్, ఇప్పుడు ఉక్రెయిన్‌లో దురాక్రమణ చర్యల భిన్న కాలాలలో చోటు చేసుకున్నాయి. కనుక అవి వేటికవి ప్రత్యేకమైనవిగా కనిపించవచ్చు కాని భావి చరిత్రకారులు వాటి మధ్య ఒక పరస్పర సంబంధాన్ని తప్పక చూస్తారు. అమెరికా రష్యాల ‘అగ్రరాజ్య’ అభిజాత్యాలకు సమస్త ప్రపంచమూ, ముఖ్యంగా వియత్నాం, అఫ్ఘానిస్తాన్, ఇరాక్, ఉక్రెయిన్‌లు భయానక మూల్యాన్ని చెల్లించాయి.



రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-02-26T06:31:36+05:30 IST