రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లల్లోనే..!

ABN , First Publish Date - 2021-04-23T07:48:58+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ, రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ ప్రార్థనలను ఈ సారి కూడా పలు పరిమితుల మధ్య కొనసాగిస్తున్నారు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లల్లోనే..!

  • మసీదులో నమాజులు రాత్రి 8.30 లోపే..
  • కర్ఫ్యూ సడలించినా జాగ్రత్తలు పాటిస్తాం: కమిటీలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ, రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ ప్రార్థనలను ఈ సారి కూడా పలు పరిమితుల మధ్య కొనసాగిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన ఉపవాస దీక్షల ప్రారంభంలో ముస్లింలు మసీదులకు యథేచ్ఛగా వెళ్లారు. అయితే.. ఇటీవల కొవిడ్‌ కేసులు ఉధృతమవుతున్నందున, ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ముస్లిం మత పెద్దలు, మసీదుల కమిటీల ప్రతినిధులు కూడా తగిన జాగ్రతలు తీసుకున్నారు. మసీదుల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరిస్తేనే అనుమతించడం, శానిటైజేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. పలు సూచనలతో మసీదుల్లో బోర్డులు కూడా పెట్టారు. వృద్ధులు, 12 ఏళ్ల లోపు పిల్లలను మసీదుల్లోకి అనుమతించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ విధించడంతో రాత్రి 10 గంటల వరకు నిర్వహించే తరావీ(ఖురాన్‌ పఠనం) నమాజును 8.30 గంటలకే పరిమితం చేశారు. నమాజ్‌ కోసం మసీదుల్లో పరిచే తివాచీలు(జానెమాజ్‌)లను తీసేశారు. 


ఖాళీ ఫ్లోరింగ్‌పై లేదా ముస్లింలు తమ ఇళ్ల నుంచి తీసుకొచ్చే జానెమాజ్‌లపైనే నమాజు చేస్తున్నారు. వజూ(ముఖం, చేతులు, కాళ్లు కడుక్కోవడం)ను ఇళ్ల వద్దే చేసుకొని రావాలని ఆదేశాలు జారీ చేశారు. మసీదుల్లోని టాయిలెట్ల వాడకాన్ని కూడా నిషేధించారు. మసీదుల్లోకి పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. దీంతో చాలా మంది ప్రార్థనలు(నమాజ్‌) ఇళ్లలోనే చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూను సడలించినా.. కరోనా ఉధృతి తగ్గే వరకూ తాము ఈ ఆంక్షలు కొనసాగిస్తామని మసీదు కమిటీలు స్పష్టం చేశాయి. 

Updated Date - 2021-04-23T07:48:58+05:30 IST